సమ్మర్ సీజన్‌లో మామూలుగా నాలుగైదు పెద్ద సినిమాలైనా వస్తుంటాయి. అలాంటిది ఈ ఏడాదిలో కేవలం రెండే భారీ చిత్రాలు, ఒక రెండు మీడియం బడ్జెట్ చిత్రాలు మాత్రం వచ్చాయి. దీంతో భారీ చిత్రాలు ఎక్కువ లేక 2015 ప్రథమార్థం బాగా డల్ అనిపించింది. ద్వితీయార్థంలో బాహుబలితో మొదలు పెట్టి శ్రీమంతుడు, కిక్ 2, రుద్రమదేవి, రామ్ చరణ్`శ్రీను వైట్ల చిత్రం, అఖిల్`వినాయక్ చిత్రం, బెంగాల్ టైగర్ ఇలా పెద్ద సినిమాలు చాలానే ఉండడంతో ఫస్ట్ హాఫ్ ఫ్లాప్ అయినా సెకండ్ హాఫ్ బ్లాక్‌బస్టర్ అవుతుందని అంచనాలున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఏవి ఎలా పర్‌ఫార్మ్ చేసాయన్నది చూస్తే…
సంక్రాంతికే సందడి లేదు!
సంక్రాంతికి వెంకటేష్, పవన్‌కళ్యాణ్‌ల ‘గోపాల గోపాల’ రిలీజ్ అయింది. ఈ కాంబినేషన్‌పై ఉన్న ఆసక్తి వల్ల ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ ఈ కలయికలో ఆశించే కమర్షియల్ సినిమా కాకపోవడంతో ‘గోపాల గోపాల’ సక్సెస్ తీరం చేరలేకపోయింది. నలభై కోట్ల పైచిలుకు షేర్‌తో ఫైనల్‌గా యావరేజ్ అనిపించుకుంది. ఈ చిత్రం జోనర్‌కి అనుగుణంగా నలభై కోట్లకే థియేట్రికల్ బిజినెస్ పరిమితం చేసినట్టయితే బాగుండేది. గోపాల గోపాలకి పోటీగా స్ట్రెయిట్ సినిమా ఏదీ రాలేదు. కాకపోతే శంకర్, విక్రమ్‌ల ‘ఐ’ రిలీజ్ అయి అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఈ చిత్రంపై ఆడియన్స్‌కి ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయనేది తెలియజేస్తూ ‘ఐ’ అనువాద చిత్రాల్లో అదరగొట్టే ఆరంభ వసూళ్లు తెచ్చుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కానీ అనూహ్యంగా శంకర్ నిరాశ పరచడంతో ఐ ఫైనల్‌గా ఫ్లాప్ అయింది.
నందమూరి బ్రదర్స్ జోరు
సంక్రాంతి సినిమాలు పండగ తర్వాత పూర్తిగా డీలా పడడంతో, తెలుగు సినిమా బిజినెస్‌కి అతి కీలకమైన సీజన్లలో ఒకటి వేస్ట్ అవడంతో బాక్సాఫీస్ భారం నందమూరి హీరోలపై పడిరది. చాలా కాలంగా హిట్లు లేని నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ ఏడాదిలో సర్‌ప్రైజ్ హిట్ సొంతం చేసుకున్నాడు. అతనే స్వీయ నిర్మాణంలో చేసిన ‘పటాస్’ ఫస్ట్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, బ్లాక్‌బస్టర్ అయింది. ఈ ఆరు నెలల్లో అందరు బయ్యర్లకి లాభాలు తెచ్చి పెట్టిన ఏకైక తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన రచయిత అనిల్ రావిపూడి కమర్షియల్ సినిమా డీల్ చేయడంలో తన టాలెంట్ ఏంటో చూపించాడు.
‘పటాస్’లో కళ్యాణ్‌రామ్ మంచి పోలీస్‌గా పరివర్తన చెందే బ్యాడ్ పోలీస్ పాత్రని చేస్తే… ఇంచుమించు అదే లక్షణాలున్న పోలీస్ పాత్రలో ఎన్టీఆర్ ‘టెంపర్’ చూపెట్టాడు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ చక్కని కథ అందిస్తే, ఈమధ్య కాలంలో స్ట్రగుల్ అవుతోన్న పూరి జగన్నాథ్ ఒక డీసెంట్ మూవీని తెరకెక్కించగలిగాడు. ఎన్టీఆర్ అద్భుత అభినయం, కథాబలం ‘టెంపర్’ చిత్రాన్ని విజయవంతం చేసాయి. ఎన్టీఆర్ నుంచి ఆశిస్తోన్న భారీ విజయమైతే సాధించలేదు కానీ రామయ్యా వస్తావయ్యా, రభస తర్వాత తనకి ఉపశమనం ఇచ్చిందీ విజయం.
ఇది నందమూరి నామ సంవత్సరం అవుతుందని ఎన్టీఆర్ చెప్పిన జోస్యం ఫలిస్తుందని, బాలకృష్ణ ‘లయన్’ కూడా విజయం సాధిస్తుందని అనుకుంటే, అది కేవలం ఓపెనింగ్స్‌తో సరిపెట్టుకుని పరాజయం పాలయింది.
బిగ్గెస్ట్ గ్రాసరే కానీ..!
2014 వరకు తెలుగు సినిమాల్లో యాభై కోట్లకి పైగా షేర్ రాబట్టుకున్న చిత్రాలు కేవలం ఆరే. అంటే తెలుగు సినిమాకి సంబంధించి యాభై కోట్ల క్లబ్ చాలా స్పెషల్. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ఉన్న నమ్మకంతో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ని బయ్యర్లు భారీ రేట్లకి కొనుగోలు చేశారు. యాభై కోట్లు అవలీలగా సాధించేస్తుందని అనుకున్నారో.. లేక రేసుగుర్రంతో బన్నీ, అత్తారింటికి దారేదితో త్రివిక్రమ్ చేసిన సంచలనం చూసి పోటీ పడ్డారో కానీ బయ్యర్లు దీనిని చాలా పెట్టుబడి పెట్టేసారు. సమ్మర్‌లో ‘లయన్’ తప్ప మరో భారీ చిత్రమేదీ లేకపోయినా కానీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. యాభై కోట్ల క్లబ్‌లో చేరినా కానీ కమర్షియల్‌గా హిట్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది. అయితే మొదటి రోజు వినిపించిన టాక్‌కి, ఫైనల్‌గా వచ్చిన కలెక్షన్లని చూస్తే ఈ చిత్రం మొదటి రోజు అంచనాలని మించి పర్‌ఫార్మ్ చేసినట్టే అనుకోవాలి. విశేషం ఏమిటంటే ఇకపై రాబోతున్న పెద్ద సినిమాల్లో చాలా వరకు ప్రీ రిలీజ్ ఇదే స్థాయిలో బిజినెస్ చేస్తున్నాయి. సక్సెస్ అయితే తప్ప పెట్టుబడి తిరిగిరాని స్థాయికి బిజినెస్‌ని లాక్కెళ్లడం కరెక్ట్ లాజిక్కా కాదా అనేది ముందు ముందు తెలుస్తుంది.
సమ్మర్ చివర్లో పండగ!
పీక్ సమ్మర్‌లో స్ట్రెయిట్ హిట్ లేకపోవడంతో ఈసారి తెలుగు సినిమా బిజినెస్ వెలవెలబోయింది. సమ్మర్ చివర్లో రిలీజ్ అయిన ‘పండగ చేస్కో’కి రొటీన్ అనే విమర్శలు వచ్చాయి. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ ఉండడంతో, రీజనబుల్ రేట్లకి అమ్మడంతో ఈ చిత్రం నాలుగు వారాల పాటు స్టడీగా వసూళ్లు తెచ్చుకుని హిట్ స్టేటస్ దక్కించుకుంది. రామ్ పరాజయాల పరంపరకి బ్రేక్ వేసిన ఈ చిత్రం మినిమం గ్యారెంటీ దర్శకుడిగా గోపీచంద్ మలినేనికి ఉన్న పేరుని నిలబెట్టింది.
చిన్న చిత్రాల హంగామా!
భారీ చిత్రాలు పెద్ద సంఖ్యలో లేనప్పుడు చిన్న సినిమాలే ఎక్కువగా వస్తుంటాయనేది తెలిసిందే. ఈ ఆరు నెలల్లో చాలానే లో బడ్జెట్ చిత్రాలొచ్చాయి. ఔరా అనిపించే విజయం సాధించిన చిన్న సినిమాలేవీ లేవు కానీ, థియేటర్ల ఫీడిరగ్‌కి కొన్ని చిన్న సినిమాలు హెల్ప్ అయ్యాయి. తద్వారా సినిమా బిజినెస్ స్లంప్‌లోకి వెళ్లకుండా చూసుకున్నాయి. బీరువా, మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు, ఎవడే సుబ్రమణ్యం, సూర్య వర్సెస్ సూర్య, కేరింత తదితర చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతో ఇంతో సందడి చేయగలిగాయి.
మ మ మాస్ లారెన్స్!
మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా పేరున్న లారెన్స్‌పై ఉన్న నమ్మకానికి తగ్గట్టే ‘గంగ’ విజయం సాధించింది. ‘ముని’ సిరీస్‌లో భాగంగా లారెన్స్ తీసిన ఈ హారర్ కామెడీ సూపర్‌హిట్ అయింది. వేసవి సీజన్లో స్ట్రెయిట్ సినిమాలు మిగిల్చిన లోటుని ఇది కొంత వరకు భర్తీ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ధనుష్ చిత్రం ‘రఘువరన్ బీటెక్’ కూడా బయ్యర్లకి లాభాలు తెచ్చింది. ‘ఓకే బంగారం’తో మణిరత్నం ప్రశంసలు అందుకున్నా కానీ లిమిటెడ్ అప్పీల్ ఉన్న సినిమా కావడంతో బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే ఆడిరది. అనువాద చిత్రాల్లో ఉత్తమ విలన్, రాక్షసుడు, ఎంతవాడుగానీ, అనేకుడు ఫ్లాప్ అయ్యాయి. ఇంగ్లీష్ అనువాద చిత్రాల్లో ఫ్యూరియస్ 7, ఎవెంజర్స్ 2, జురాసిక్ వరల్డ్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
ఫెయిల్యూర్స్ లిస్ట్ పెద్దదే!
ఆరు నెలల్లో తొంభైకి పైగా చిత్రాలు విడుదలైతే, విజయవంతమైనవి పది శాతం కూడా లేవు. విడుదలకి ముందు ప్రామిసింగ్‌గా కనిపించిన, కాంబినేషన్ పరంగా ఆసక్తి రేకెత్తించిన చిత్రాలు కొన్ని విడుదలయ్యాక నిరాశ పరిచాయి. స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ చేసిన రెండో చిత్రం ‘దోచేయ్’ నాగచైతన్య కెరీర్లో పెద్ద ఫ్లాప్‌గా మిగిలింది. యువి క్రియేషన్స్ నుంచి వచ్చిన గోపీచంద్ సినిమా ‘జిల్’ కూడా అంచనాలని అందుకోలేక ఫైనల్‌గా డిజప్పాయింట్ చేసింది. పూరి జగన్నాథ్ తీసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘జ్యోతిలక్ష్మి’ నిరాశపరిచింది. అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బందిపోటు’ తనకి నిర్మాతగా కూడా నష్టాలు మిగిల్చింది. ‘అసుర’ పే చేయకపోవడంతో నారా రోహిత్ సక్సెస్ వేట కొనసాగుతోంది. బౌన్స్ బ్యాక్ అవుతానని రాజశేఖర్ హోప్స్ పెట్టుకున్న గడ్డంగ్యాంగ్ అడ్డం తిరిగింది. అవును సక్సెస్‌ని క్యాష్ చేసుకోవాలని చూసిన రవిబాబు ప్రయత్నం బెడిసికొట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆరు నెలల్లో ఫ్లాప్స్ లిస్ట్ చాలా పెద్దదే వుంది.
జూన్ చివర్లో విడుదలైన సినిమాల ఫైనల్ రేంజ్ ఏంటనేది ఇంకా తేలలేదు కానీ ప్రస్తుతం వస్తోన్న కలెక్షన్లని బట్టి సక్సెస్‌ల లిస్ట్‌లోకి చేరే అవకాశాలేం కనిపించట్లేదు. భారీ హిట్లు లేని లోటుని తీర్చే భారం ఇక స్టార్ హీరోలు, దర్శకులదే. అరడజనుకి పైగా పెద్ద సినిమాలతో పాటు, చెప్పుకోతగిన సినిమాల జాబితా కూడా బాగానే ఉంది కనుక సెకండ్ హాఫ్ ఆశలు రేకెత్తిస్తోంది. 2015కి సెండ్ ఆఫ్ సాలిడ్‌గా ఉంటుందనే ఆశిద్దాం.
గణేష్ రావూరి