‘భయో’ డేటా: నిత్య ‘బాలు’డు!

పేరు            : నందమూరి బాలకృష్ణ Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: శాశ్వత శాసన సభ్యత్వం (మంత్రీ, ముఖ్యమంత్రి పదవి అంటారా..? నందమూరి వంశీయుల్లో ఎవరిని వరించినా నేను సంతోషిస్తాను. ) ముద్దు…

పేరు            : నందమూరి బాలకృష్ణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: శాశ్వత శాసన సభ్యత్వం (మంత్రీ, ముఖ్యమంత్రి పదవి అంటారా..? నందమూరి వంశీయుల్లో ఎవరిని వరించినా నేను సంతోషిస్తాను. )

ముద్దు పేర్లు     : నిత్య ‘బాలు’డు (వయసుతో సంబంధం వుండదు. నేను నిత్య యవ్వనుణ్ణి, నిత్య బాలుణ్ణి, నిత్య విద్యార్థిని. అందుకే శాసనసభ్యుడిగా నేర్చుకోవాల్సింది చాలా వుందని మీడియా తో అన్నాను.)

‘విద్యార్హతలు     : బీ ‘కామ్‌’ ( అందుకే నా ఎదురుగా ఎవరు మాట్లాడినా ఒప్పుకోను. ‘కామ్‌’ గా వుండాల్సిందే. నేను మాటల మనిషిని కాను. చేతల మనిషిని. ఐ యామ్‌ ఎ మాన్‌ ఆఫ్‌ ‘ఫ్యాక్షన్‌’… సారీ ‘యాక్షన్‌’. ఎక్కువ ఫ్యాక్షనిస్టు సినిమాల్లో నటించాను కదా! అందుని అలా అన్నాను.)

హోదాలు           : విశ్యవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీరామారావు వారసుణ్ణి, ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిదిని, వియ్యంకుణ్ణి,  భావి ముఖ్యమంత్రి లోకేష్‌ బాబు మామయ్యను. ఇంతకు మించి హోదాలు ఏమి కావాలి?

గుర్తింపు చిహ్నాలు  :ఒకటి: వద్దూ. ఒక వైపే చూడు, రెండో వైపే చూడాలనుకోకు. ( ఒకవైపు సినిమాల్లో  ‘లెజెండ్‌’నే. రెండో వైపు రాజకీయాలు. ఇంకా విద్యార్థినే కదా!)
                            రెండు:నన్ను చూస్తే ‘సీమ’ ను చూడాల్సిన అవసరం లేదు. అసలు ఊరు ఆంధ్రా అయినా, సీమలో పుట్టిన వాడిలాగా వుంటాను.
సిధ్ధాంతం            :  ‘బావ’ (బాబు) కళ్ళల్లో ఆనందం చూడటం.( ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకుమించి ఆనందం ఏమిటి?)

వృత్తి                 :  నటించాల్సిన చోట జీవించటం: జీవించాల్సిన చోట నటించటం.( ఈ చిన్న లాజిక్‌ అర్థం కాకే, 2004లో నా మీద లేని పోని ‘కాల్పుల’ కేసు పెట్టారు. నిలవలేదనుకోండి. అది వేరే విషయం.)

హబీలు              :1.ఎన్నికల ప్రచారం. నాన్నగారు టీడీపీ అధ్యక్షుడిగా వున్నప్పటి నుంచి ఎన్నికల ప్రచారం నాకు హాబీ. ఈ హాబీని మూడు దశాబ్దాలనుంచీ కొనసాగిస్తున్నాను. ఇప్పుడది హటాత్తుగా వృత్తి అయిపోయింది. 

                         2. చిరుఅలకలూ, చిన్నచిన్న తగాదాలూ. అవి కూడా దగ్గర వాళ్ళతోనే. వీటినే పెద్దవి చేసి ‘బాబాయ్‌` అబ్బాయ్‌’ వివాదాలుగా మార్చేస్తారు. 

అనుభవం           : బాలనటుడిగా తెరకెక్కిన వాణ్ని. నాకు నటనే జీవితం. నటించకుండా వుండాలంటే నాకు సాధ్యం కాదు. ఈ అనుభవం అసెంబ్లీలో బాగా పనికి వచ్చేటట్టు వుంది. ఇక్కడ అందరూ సహజ నటులు.

మిత్రులు            : ఉండరు. ఉంటే భక్తులు వుంటారు. అభిమానులు వుంటారు. ( నాన్న గారి తర్వాత నేను కూడా దేవుడి పాత్రలు వేశాను కదా!)

శత్రువులు          : నా చేతిలో తూటా యే కాదు(వేరే అర్థాలు తీయకండి. కేవలం సినిమాలోనే లెండి.), నోటిలో మాట కూడా దాగదు. అంతా ఆ క్షణమే. ఆతర్వాత మరచిపోతాను. కాబట్టి నా శత్రువులు కూడా నాకు అనుకూలంగా మారిపోతారు. నాతో సినిమాలు తీస్తారు. 

మిత్రశత్రువులు    : వెంట వుండి ‘వెన్ను పోటు ’ పొడిచే వారు. ( అమాయకుణ్ణనుకుంటున్నారా… నా కా మాత్రం స్పృహ వుంటుంది లెండి.)

వేదాంతం           :‘హౌస్‌’ ( అసెంబ్లీని ‘హౌస్‌’ అంటారు.) రాజకీయాన్ని ఈశ్వరుడు కూడా పట్ట లేడు. 

జీవిత ధ్యేయం      : ఎప్పుడో తీరిపోయింది. బావ సిఎం అయితే, నేను అయినట్లు కానా? రేపు లోకేష్‌ బాబు సిఎం అయితే నేను అయినట్టు కానా? 

-సర్‌