మనం ఇచ్చుకున్న లోకువే.!

అగ్రరాజ్యం అమెరికాకి ఎప్పుడు భారతదేశంపై తగిన గౌరవం లేదు. వుండదు కూడా. ఎందుకంటే, మన దేశంలో రాజకీయాలు అలా తగలడ్డాయ్‌ మరి. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన నరేంద్ర మోడీకి అమెరికా వీసా తిరస్కరిస్తే.. ‘తగిన…

అగ్రరాజ్యం అమెరికాకి ఎప్పుడు భారతదేశంపై తగిన గౌరవం లేదు. వుండదు కూడా. ఎందుకంటే, మన దేశంలో రాజకీయాలు అలా తగలడ్డాయ్‌ మరి. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన నరేంద్ర మోడీకి అమెరికా వీసా తిరస్కరిస్తే.. ‘తగిన శాస్తి జరిగింది’ అని సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు. అప్పట్లో ఆయన్ను రాజకీయ ప్రత్యర్థిగా అధికార పార్టీ నేతలు చూశారే తప్ప, ఓ భారతీయుడికి అవమానం జరిగిందనుకోలేదు.

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం విషయాన్నే తీసుకుంటే, ‘భద్రత’ పేరుతో ఆయన్నీ అవమానించిన ఘనత అమెరికాకి వుంది. షారుక్‌ఖాన్‌ వంటి మేటి నటుడికీ అమెరికాలో ‘భద్రత’ తిప్పలు తప్పలేదు. రాష్ట్రపతికే దిక్కు లేనప్పుడు మిగతావారి గురించి మాట్లాడుకుని ఏం లాభం.? ఇప్పుడేమో భారతదేశానికి చెందిన ఓ అధికారిణి, అధికారిక పనులపై అమెరికాకి వెళితే అక్కడి చట్టాలు ఆమెను అవమానించాయి.

అలా అమెరికా దుర్మార్గాల కారణంగా మనోవేదనకు గురైన భారత అధికారిణి దేవయానికి మద్దతుగా కేంద్రం బోల్డంత ప్రేమ కురిపించేస్తోంది. అమెరికాకి వ్యతిరేకంగా పలు చర్యలు కూడా చేపట్టింది. ఇవే చర్యలు అబ్దుల్‌కలాంకి అవమానం జరిగినప్పుడు, మోడీకి అవమానం జరిగినప్పుడూ, షారుక్‌ఖాన్‌ని అడ్డుకున్నప్పుడూ చేసి వుంటే అమెరికా పైత్యం ఈ స్థాయిలో పెరిగేదే కాదు.

భద్రత కేవలం అమెరికాకేనా.? భారతదేశానికి లేదా.? భారతదేశానికి వస్తోన్న అమెరికన్లను మనం అమెరికాలో మనోళ్ళను ట్రీట్‌ చేస్తున్నట్లే.. ట్రీట్‌ చేస్తున్నామా.? ఛాన్సే లేదు. తోలు తెల్లగా వుందన్న కారణంగానో, అగ్రరాజ్యం నుంచి వచ్చారనో.. కారణమేదైనా, నెత్తిన పెట్టుకుంటున్నాం. అదేమో అమెరికా నెత్తిన కొమ్ములు మొలిచేలా చేశాయి.

ఒక్కసారి భారతదేశం పద్ధతిగా వ్యవహరిస్తే, ధీటుగా బదులిస్తే ఎలా వుంటుందో చూసిన అమెరికా, ‘అబ్బే.. మేం దేవయానిని కించపర్చలేదు, అవమానించలేదు..’ అంటూ వివరణ ఇచ్చుకుంది. క్షమాపణ కూడా చెప్పుకుంది. ఇకపై ఎలాంటి పొరపచ్చాలూ రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

మంచిదే. ఇది కేవలం దేవయానికే పరిమితం కాకూడదు. మన దేశం నుంచి ఎవరు అమెరికాకి అధికారిక పనుల మీద వెళ్ళినా, అక్కడి ఆహ్వానమ్మేరకు వెళ్ళినా వారిని అతిథులుగా భావించే సంస్కారం అమెరికాకి రావాలి. అది జరగాలంటే, మన దేశంలో ఇలాంటి విషయాలపై అధికారంలో వున్నవారు రాజకీయాలు పక్కన పెట్టాలి. అది సాధ్యమేనా.?