ఎంజీఆర్‌ దేవుడు…కూతురు హంతకురాలు…!

తమిళనాడులో ముఖ్యమంత్రిగా పన్నీరు శెల్వమే కొనసాగుతారా? లేదా ఆయన్ని కూలదోసి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన శశికళ నటరాజన్‌ కుర్చీ ఎక్కుతుందా? అనే ఉత్కంఠ ఓ పక్క కొనసాగుతుండగానే మరో పక్క పార్టీ వ్యవస్థాపకుడు,…

తమిళనాడులో ముఖ్యమంత్రిగా పన్నీరు శెల్వమే కొనసాగుతారా? లేదా ఆయన్ని కూలదోసి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన శశికళ నటరాజన్‌ కుర్చీ ఎక్కుతుందా? అనే ఉత్కంఠ ఓ పక్క కొనసాగుతుండగానే మరో పక్క పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి, తమిళ ప్రజల ఆరాధ్యదైవం ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) శత జయంతి ఉత్సవాలు జనవరి 17 నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి.

జయలలిత కన్నుమూశాక కొత్త ప్రధాన కార్యదర్శి శశికళ, ముఖ్యమంత్రి పన్నీరు శెల్వం ఆధ్వర్యంలో జరుగుతున్న భారీ ఉత్సవం ఉంది. ఎంజీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ఏడాదిపాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంలోనే ఎంజీఆర్‌ కూతురు (దత్త పుత్రిక) సుధా విజయ్‌కుమార్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను కలుసుకొని తనే పూర్తి మద్దతును ప్రకటించింది. ఆమెను తాను వంద శాతం అంగీకరిస్తున్నానని, పార్టీ ముక్కలు కాకుండా ఆమె మాత్రమే రక్షించగలదని సుధ చెప్పింది. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు, ఆమె చనిపోయినప్పుడు ఎంజీఆర్‌ కుటుంబ సభ్యులెవరైనా వచ్చి చూడటమో, పరామర్శించడమో చేసినట్లు వార్తలు వచ్చిన దాఖలా లేదు.

జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ గురించి మీడియాలో ప్రముఖంగా వచ్చిందిగాని ఎంజీఆర్‌ కుటుంబ సభ్యుల గురించి తెలియలేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే శశికళకు మద్దతు ఇచ్చిన సుధా జయకుమార్‌ది విషాద గాథ. ఆమె భర్త విజయ్‌కుమార్‌ అలియాస్‌ విజయన్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషాదం వెనక ఉన్న విచిత్రం ఏమిటంటే విజయకుమార్‌ను చంపించిన వ్యక్తి సుధ సోదరి భాను శ్రీధర్‌. ఈ కేసులో మూడు రోజుల కిందటే ఆమెకు, మరో ఆరుగురికి యావజ్జీవ కారగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. భాను శ్రీధర్‌ కూడా ఎంజీఆర్‌ దత్త పుత్రికే. ప్రజలు ఎంజీఆర్‌ను ఆరాధ్య దైవంగా కొలుస్తుంటే ఆయన కుమార్తె హంతకురాలైంది.

ఎంజీఆర్‌ శత జయంతి ఉత్సవాల సమయంలోనే ఆమెకు శిక్ష పడటం విశేషం. ఎంజీఆర్‌ హీరోగా, పార్టీ వ్యవస్థాపకుడిగా, ముఖ్యమంత్రిగా చాలా గొప్పోడు. కాని ఆయన కుటుంబం ఘర్షణలమయం. కుట్రలకు నిలయం. ఇందుకు కారణం కోట్ల విలువైన ఆయన ఆస్తిపాస్తులు. ఎంజీఆర్‌-జానకీ  దంపతులకు సంతానం లేదు. దీంతో జానకి సోదరుడి ఏడుగురు పిల్లలను ఎంజీఆర్‌ దత్తత తీసుకున్నారు. ఈ పని చట్టపరంగా చేశారా లేదా తెలియదుగాని వీరంతా ఎంజీఆర్‌ ఆస్తి కోసం ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే విజయ్‌కుమార్‌ హత్య 2008లో జరిగింది.

ఈ హత్య వెనక ఉన్న మాస్టర్‌ మైండ్‌ పెద్ద కుమార్తె భాను శ్రీధర్‌. విజయ్‌కుమార్‌ కారులో వెళుతుండగా హంతకులు మరో కారులో వెళ్లి అతని కారును రెండుసార్లు ఢీకొట్టారు. దీంతో విజయ్‌కుమార్‌ కిందికి దిగి ఇదేమిటని ప్రశ్నించాడు. ఆ సమయంలో వారు ఇనుప కడ్డీలతో కొట్టి హత్య చేశారు. ఇదంతా ప్లాన్‌ చేసింది భానూయేనని రుజువైంది. కరుణ అనే  పోలీసు కానిస్టేబుల్‌ సహకారంతో నాలుగు లక్షలకు హంతకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదీ ఎంజీఆర్‌ కుటుంబ చరిత్ర. ఆయన పేరు నిలబెట్టేలా వ్యవహరించాల్సిన కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆడ పిల్లలు ఆస్తి కోసం కొట్టుకొని ఆయన పరువు తీశారు. వీరికి ఆస్తి మీద ఉన్న ఆసక్తి రాజకీయాల మీద లేదని అర్థమవుతోంది. జయలలితతోనూ వీరికి సంబంధాలున్నాయో లేవో తెలియదు.

ఎంజీఆర్‌ తరువాత ఆయన కుటంబ సభ్యుల పేర్లు ఎక్కడా ప్రముఖంగా వినబడలేదు. వీరు ఆస్తి కోసం కొట్టుకున్నారంటే ఆయన ఎలాంటి వీలునామా రాయలేదా? పిల్లలు లేనివారెవరైనా ఒకరినో లేదా ఇద్దరినో అధికారికంగా అంటే చట్టపరంగా దత్తత తీసుకుంటారు. ఆస్తులకు వారే నిజమైన వారసులవుతారు. కాని ఎంజీఆర్‌ ఏడుగురిని దత్తత తీసుకున్నారంటే అధికారికంగా అయ్యుండకపోవచ్చు. చేరదీశారేమో. ఇంతమందినీ చట్టప్రకారమో, సంప్రదాయం ప్రకారమో దత్తు తీసుకున్నారని అనుకున్నా ఆస్తుల విషయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయలేదా? జయలలితకు వారసుల బాధ లేకుండాపోయింది. ఆమె ఆస్తులన్నీ శశికళకు, ఆమె కుటుంబ సభ్యులకు కట్టబెట్టినట్లు వార్తలొచ్చాయి. జయ కన్నుమూసి నెల రోజులు దాటిపోయినా ఇప్పటివరకు ఆమె ఆస్తుల గురించి ఎవ్వరూ వివాదం లేవనెత్తినట్లుగా కనబడలేదు.