ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహుశా తన రాజకీయ జీవితంలో ఇంతటి క్లిష్ట పరిస్థితి ఇంతకు ముందు ఎన్నడూ ఎదుర్కోలేదేమో! ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే దేశం అంతటికి పరిచయం అయ్యారు. గుజరాత్‌ను ఆయన అభివద్ధి చేయడానికి విశేష కషి చేశారని పేరు వచ్చింది. ఆయన హయాంలో అక్కడ ఓటమి అన్నది లేకుండా రాజకీయం సాగింది.
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా ఆయన గురించిన ప్రచారం విస్తారంగా ప్రచార సాదనాలలో వచ్చింది. గుజరాత్ ప్రభుత్వ ప్రచార ప్రకటన పేరుతో ఆయా రంగాలలో మోడీ ఎంతగా పనిచేసింది వివరించారు. అవన్ని నిజమో, కాదో అన్న ఆలోచన కూడా ప్రజలు ఎవరూ చేయలేదు.
మోడీ అత్యంత నిజాయితీపరుడని, నీతిమంతుడని, ప్రజల అవసరాలు తప్ప ఆయనకు వ్యక్తిగత అవసరాలు కూడా లేవని ప్రజలు భావించారు. ఆ తర్వాత ఆయనను భారతీయ జనతా పార్టీ మల్లగుల్లాలు పడి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆ తరుణంలో అదంతా ఒక వేవ్‌గా మారింది. మోడీ గాలికి పెద్ద పెద్ద రాజకీయ వట వక్షాలు కూడా కూలిపోయాయంటే ఆశ్చర్యం కాదు. ఆ ఊపులో మోడీ ఏమి చేసినా ప్రజలు విశ్వసించారు.
ఇదంతా తమకోసమే ఆయన చేస్తున్నారని భావించారు. ఆ క్రమంలోనే మోడీ 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు ప్రజలు దానితో దేశం నుంచి నల్లధనం, అవినీతి పోతుందని భావించారు. నోట్లరద్దు చేసిన తీరు తప్పు అని వ్యాఖ్యానించిన వారిని సైతం అధిక శాతం ప్రజలు విమర్శించారు.
ప్రధాని కూడా వంద రోజుల్లో దీని ప్రభావం కనబడుతుందని, లేకుంటే శిక్ష వేయవచ్చని కూడా ఆయన అన్నారు. కాని నోట్లరద్దు వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోగా, సామాన్యులు తమ వద్దఉన్న కొద్దిపాటి 500, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకోవడానికి, బ్యాంకుల ఎటిఎమ్‌ల నుంచి తమ డబ్బు డ్రా చేసుకోవడానికి చాలా పాట్లు పడవలసి వచ్చింది.
నల్లధనం పూర్తిగా పోతుందనుకుంటే తమిళనాడుకు చెందిన ఒకాయన వందల కోట్ల రూపాయలను తరలించుకుపోయిన ఘట్టం కాని, ఢిల్లీలో ఒక బ్యాంక్ వారి సహకారంతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న ఘట్టాలు వెలుగులోకి వచ్చాయి. అయినా ప్రజలు మోడీపైనే నమ్మకం కొనసాగించారు. అందువల్లే 2019లో రెండోసారి ఆయన మరింత విజయం సాధించి బీజేపీ సొంతంగా 300 పైగా సీట్లు సంపాదించుకునేలా చేశారు.
మోడీ గ్రాఫ్ పడిపోతుందని నమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు వంటివారు మాత్రం ఆయన కూటమిని విడిచిపెట్టారు. 2019 ఎన్నికల ముందు జరిగిన పుల్వామా ఘటనలో మన సైనికులు 40 మంది మరణించడం, దానికి ప్రతిగా పాక్‌లోని బాల్కోట్ వద్ద ఉన్న ఉగ్రశిబిరాన్ని మన వైమానికదళం ధ్వంసం చేయడంతో మొత్తం దేశం మూడ్ మారిపోయింది. దానికి తోడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆశించిన రీతిలో పటిష్టంగా లేకపోవడం కూడా ఆయనకు కలిసి వచ్చింది.
కాని 2019లో రెండోసారి ప్రధాని అయిన తర్వాత మోడీకి ఎదురుదెబ్బలు గట్టిగా తగులుతున్నాయి. మొదటి టరమ్‌లో మాదిరి ఆయా రాష్ట్రాలలో విజయదుంధిభి మోగించలేకపోయిన మోడీ నాయకత్వంలోని బీజేపీ వేరే పద్ధతుల ద్వారా కర్నాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ప్రతిష్టించింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలలో తనకు సొంతంగా బలం లేకపోయినా ఎలాగోలా సంకీర్ణ భాగస్వామిగా చేరడం వంటి రాజకీయ వ్యూహాలను అమలు చేశారు.
ఇవన్ని ఒక ఎత్తు అయితే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడం మరో ఎత్తుగా మారింది. గత మార్చిలో కరోనాను అరికట్టడానికి గాను ఆయన జనతా కర్ప్యూ ప్రకటించారు. ఆ వెంటనే దేశవ్యాప్త లాక్డౌన్ అమలుకు ఆదేశాలు ఇచ్చారు. ఇది సడన్‌గా జరగడంతో అనేక రాష్ట్రాలలో వలసకూలీలు తమ సొంత ప్రాంతాలకు ఎలా వెళ్లాలో తెలియక అల్లాడిపోయారు. వేలు, లక్షల సంఖ్యలో వలస కూలీలు కాలినడకన వందల కిలోమీటర్లు నడచుకుంటూ తమ గ్రామాలకు చేరుకోవలసి వచ్చింది. అదో పెద్ద విషాదం. ఆ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రజలు పూర్తిగా మోడీ వెంటే నడిచారని చెప్పాలి.
కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారి గౌరవార్ధం చప్పట్లు కొట్టమని మోడీ చెబితే జనం అంతా కొట్టారు. దీపాలు వెలిగించమంటే వెలిగించారు. కాని దేశ ఆర్ధిక వ్యవస్థను ఆయన ప్రభుత్వం పూర్తి స్థాయిలో గాడిలో పెట్టలేకపోయిందన్న విమర్శలు ఎదుర్కున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ఒక పాే్యకజీని ప్రకటించినా, దాని వల్ల పెద్దగా ఒరిగింది ఏమీ లేదన్న భావన ఏర్పడింది.
అప్పుడే కనుక మోడీ ప్రభుత్వం రెండో కరోనా వేవ్‌ను ఎదుర్కోవడానికి వీలుగా ఆరోగ్యపరమైన మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వాలను ఆ దిశగా నడిపి ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది. వాక్సిన్ పెద్ద ఎత్తున తయారీకి అవసరమైన ఏర్పాట్లు చేసి ఉంటే విమర్శలు వచ్చేవి కావు. కాని ఆయన దష్టి అధిక భాగం ఆయా రాష్ఠ్రాల శాసనసభ ఎన్నికలపై పెట్టారు.
ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో ఎలాగైనా అధికారం సాధించాలన్న లక్ష్యంతో ఈ కరోనా సమయంలో మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు పెద్ద, పెద్ద ప్రచార సభలలో పాల్గొనడం విమర్శలకు దారి తీసింది. కొన్ని అంతర్జాతీయ పత్రికలు మోడీ బొమ్మవేసి సూపర్ స్ప్రెడర్ అని హెడ్డింగ్ పెట్టి కవర్ పేజీ ఆర్టికల్స్‌ను ఇచ్చాయి. అలాగే లక్షల మంది పాల్గొనే కుంభమేళాను అనుమతించడం, అందులో అమిత్‌షా పాల్గొనడం వంటివి కూడా ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి.
ఒకప్పుడు అంతర్జాతీయంగా ఆయా దేశాలలో పేరు సంపాదించుకున్న మోడీ ప్రతిష్ట ఈ ఘట్టాలతో మసకబారే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు దేశంలో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రులలో బెడ్ల కొరత, మందుల కొరత, కోవిడ్ బాధితులకు అవసరమైన ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు వంటివాటిపై కేంద్రీకరణ లేకపోవడంతో రెండోవేవ్ వల్ల బాగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే రాష్ట్రాలను కూడా సరైన రీతిలో గైడ్ చేయలేకపోయారు.
పలితంగా ప్రపంచంలోనే కరోనా కేసుల విషయంలో భారత్ మొదటి స్థానానికి వచ్చింది. దానికి తోడు వాక్సినేషన్‌కు సంబంధించి ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, విదేశాలకు ఎగుమతి చేయడం, ప్రజలు దాని అవసరం గుర్తించే సమయానికి వాక్సిన్ సరఫరాలో లోటు ఏర్పడడం జరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలం ముగియడానికి ముందు వాక్సిన్ కంపెనీలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారట. దాంతో ఆ దేశం సత్వరమే ప్రజలకు వాక్సిన్ ఇవ్వగలిగింది. దాంతో అనేక చోట్ల మాస్క్‌లు అవసరం లేదని ప్రకటించే దశకు ఆ దేశం చేరింది. మరో వైపు మనదేశంలో ఇప్పుడు డబుల్ మాస్క్ పెట్టుకోవాలని చెప్పాల్సిన దుర్గతి ఏర్పడింది.
అందువల్ల గతంలో ఎన్నడూ లేనంతగా ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. చివరికి ఆయన గడ్డం పెంచుకున్న వైనంపై కూడా వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటైజ్ చేసే ఆలోచనపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వాటిలో మన విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు ఏ స్థాయిలో జరిగింది అంతా చూశాం.
కరోనా సమయంలో లాక్ డౌన్, కర్ప్యూవంటి వాటి విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయవలసిన కేంద్రం ఎందువల్లో, రాష్ట్రాల నిర్ణయాలేక వదలివేసింది. రాష్ట్రాలకు ఆర్ధికంగా సాయం చేయడంలో కూడా మోడీ ప్రభుత్వం ఆశించిన రీతిలో వ్యవహరించడం లేదన్న భావన కూడా ఉంది. రాజకీయ క్రీడపై ఉన్నంత శ్రద్ధ, కరోనాను నిరోధించడంలో చూపించలేకపోయారన్నది అనేక మంది భావన.
ఏడేళ్ల క్రితం మోడీని ఎంతగా జనం పొగిడారో, అంతగా కాకపోయినా, ఇప్పుడు మోడీని ప్రజలు గణనీయంగానే విమర్శిస్తున్నారని చెప్పాలి. ఈ విషయాన్ని మోడీ గమనించి, వచ్చే మూడేళ్లలో సర్దుబాటు చేసుకుంటే మంచిది. లేకుంటే ఆయనకు, బీజేపీకి రాజకీయంగా నష్టం జరిగినా ఆశ్చర్యపడనవసరం లేదు.
కొమ్మినేని శ్రీనివాసరావు