‘కాలు జారితే తీసుకోవచ్చేమోగాని నోరు జారితే తీసుకోలేం’ అనే సామెత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియదా? ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే సామెత వినలేదా? తెలుగు సాహిత్యం చదువుకున్న కేసీఆర్‌కు, మేధావి అయిన కేసీఆర్‌కు ఇలాంటి సామెతలు తెలియవని అనుకోలేం. ఆకట్టుకునేలా ప్రసంగించడంలో దిట్ట అయిన ముఖ్యమంత్రి ఎన్నో సామెతలను అలవోకగా చెబుతుంటారు. అంతటి పరిజ్ఞానం ఉన్న పాలకుడికి నోరు అదుపులో ఉంచుకోవాలని తెలియకపోవడం దురదృష్టకరం. తాను ఇంకా ఉద్యమ నాయకుడిననే అనుకుంటున్నట్లుంది. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు నోరు పెట్టుకొని బతికేశారు. ప్రతి రోజూ దబాయింపులు, బెదిరింపులే. ఎవ్వరినైనా సరే నోటికి ఎంతొస్తే అంత మాట అన్నారు. పైగా ‘మా తెలంగాణలో ఇట్లనే మాట్లడతరు’ అని దాన్ని మొత్తం తెలంగాణ ప్రజలకు ఆపాదించారు. సరే…ఉద్యమంలో ప్రజలను ఉత్సాహపరిచేందుకు లేదా వారిలో ఆవేశం కలిగించేందుకు ఏదో అన్నారులే అనుకుంటే ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ధోరణి మారలేదు. ఉద్యమ సమయంలో కొన్నిసార్లు తాను అనుచితంగా మాట్లాడానని, అప్పుడు పరిస్థితి అటువంటిదని, అవి మనసులో పెట్టుకోవద్దని తెలంగాణ ప్రకటన తరువాత అనునయ ధోరణిలో చెప్పారు. ఆయన మాటల బారిన పడిన సీమాంధ్రులుగాని, మరొకరుగాని అదంతా మర్చిపోయారు. కాని…అది ఎంతోకాలం నిలవలేదు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి మళ్లీ పదునైన మాటల ఈటెలు విసురుతూనే ఉన్నారు.
కేసీఆర్-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు ప్రతిరోజూ మాటల దాడులు చేసుకున్నారు. ప్రతి విషయంలోనూ ఘర్షణాత్మక వైఖరే. మాట మాట్లాడితే కయ్యానికి కాలు దువ్వడమే. ఇక్కడ మనం చంద్రబాబు నాయుడిని కూడా సమర్థించడంలేదు. అయితే ఆయన చర్యలకు కేసీఆర్ ప్రతిస్పందించిన తీరు సరైంది కాదు. తనకిష్టంలేని విషయాన్ని పదునైన మాటలతో చెప్పాల్సిన పనిలేదు. రెచ్చగొట్టేవిధంగా మాట్లాడాల్సిన అవసరంలేదు. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడూ అదే ధోరణి. ముఖ్యమంత్రి అయ్యాకా అదే వైఖరి. ఆయన మంత్రివర్గ సహచరులు, పార్టీ నాయకులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. కేసీఆర్‌ను ప్రతిపక్ష నాయకులు, పడనివారు నియంత అని, దొర అని విమర్శిస్తుంటారు. ఆయన పీఠం ఎక్కితే గడీల పాలన వస్తుందని అన్నారు. అదేమీ రాలేదుగాని ఆయనలో ఒకవిధమైన నియంతృత్వ పోకడలు కనబడుతున్నాయి. తెలంగాణను అభివృద్ధి చేయాలనే తపన మంచిదేగాని అనవసరంగా నోరు పారేసుకోవడమెందుకు? ఒకప్పుడు రష్యాను జార్ చక్రవర్తులు పరిపాలించారు. వీళ్లకూ నియంతలనే పేరుంది. నియంతలు తమ ఆధిపత్యాన్ని చేతల్లోనే కాకుండా మాటల్లో కూడా చూపిస్తుంటారు. కేసీఆర్‌ది కూడా ఇదే దోరణి. తరచుగా నోరు జారుతున్న కేసీఆర్‌ను నోరు ‘జార్’ చక్రవర్తి అనడం సబబుగా ఉంటుంది.
కాళోజీ జయంతి రోజు తెలుగు మీడియాపై నిప్పులు చెరిగి జాతీయ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. కేసీఆర్ అనుచిత. పరుష వ్యాఖ్యలపై దాదాపు అన్ని జాతీయ ఛానెళ్లు నిరసన వ్యక్తం చేశాయి. తలపండిన సీనియర్ పాత్రికేయులు విస్మయం చెందడమే కాకుండా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌డిటివి కేసీఆర్ కూతురు, ఎంపీ అయిన కవితతో, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణతో చర్చా కార్యక్రమం పెట్టింది. ఈ చర్చలో రాధాకృష్ణ అడగిన ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పాలేకపోయారు. కాళోజీ ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించే వ్యక్తి. తప్పు చేస్తే విమర్శకు వెనకాడని వ్యక్తి. ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారికి, ఆయన కవిత్వం చదవినవారికి ఈ సంగతి తెలుసు. అటువంటి వ్యక్తి జయంతి రోజున మీడియాపై విరుచుకుపడటం ఏం సంస్కారం? కేసీఆర్ ఏ విషయంలోనైనా విమర్శినాత్మకంగా మాట్లాడితే అభ్యంతరం లేదు. కాని తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తెలంగాణ ముసుగులో ప్రజలను రెచ్చగొడుతున్నారు. సరే….నోరు జారడమే అలవాటుగా ఉన్న కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి కమ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్యపట్ల అనుచితంగా మాట్లాడి వివాదాల్లో ఇరుక్కున్నారు. దీంతో అన్ని పార్టీలవారు, దళత సంఘాల నాయకులు ముఖ్యమంత్రిపై ముప్పేట దాడి చేస్తున్నారు. రాజయ్యకు అవమానం జరిగిందని కారాలు మిరియాలు నూరుతున్నారు.
కేసీఆర్ ఎలాగైతే అది చేస్తాం…ఇది చేస్తాం అంటూ గొప్పగా మాట్లాడుతున్నారో, మంత్రులూ అట్లనే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం హెల్త్ యూనివర్శిటీ విజయవాడలో ఉంది. తెలంగాణ వైద్య కళాశాలలు దాని కిందకే వస్తాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ యూనివర్శిటీ అవసరం ఉంది. రాజయ్య ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి ఎక్కడికి పోయినా హెల్త్ యూనివర్శిటీ పెడతామని చెబుతున్నారు. ఇది కేసీఆర్‌కు నచ్చనట్లుంది. ఆయన వరంగల్‌లో తన సహజ ధోరణిలో ‘‘దంబాచారం చెప్పడం, అబద్ధం చెప్పడం, గోల్‌మాల్ చెప్పడం నాకు రాదు. మంత్రులకు కూడా దయచేసి వద్దయా అని చెప్పినా. చెబితే మీరే దెబ్బ తింటరని కూడా చెప్పిన. ఈ రాజయ్యగారు ఇనకుండా ఈడికి వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్శిటీ పెడ్తాడంట. పెడ్తడా ఈయన? చానా వొళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలె. చేయగలగిందే చెప్పాలె. అడ్డం పొడుగు మాటలెందుకు? లేని మాటలు వాగుడెందుకు?….’’ ఇలా సాగింది ఆయన మందలింపు. రాజయ్యను ఉద్దేశపూర్వకంగా అని ఉండకపోవచ్చు. కాని కేసీఆర్‌పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నవారికి ఇదో అస్త్రంగా దొరికింది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్ ఇప్పుడు దళితుడిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూడా ఉండనీయకుండా కుట్ర పన్నుతున్నారని మండిపడుతున్నారు. కేసీఆర్ ఇవే మాటలను మరోరకంగా కూడా చెప్పొచ్చు. కాని ఆయన నలుగురిలో రాజయ్య పేరు ప్రస్తావించడంతో ఆయనను అవమానించారనే భావన కలిగింది. చివరకు ఆయన ‘హంతక భాష’ మాట్లాడున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కేసీఆర్ వివాదాల్లో మునిగి తేలుతున్నారు.
ఎం నాగేందర్