ఆర్జీవీ..ఈ మూడు అక్షరాలు చాలు పరిచయానికి. ఇటు టాలీవుడ్ లో అయినా, బాలీవుడ్ లో అయినా. అమితాబ్ సినిమా లెవెల్ నుంచి ఐస్ క్రీమ్ సినిమా లాంటి చోటా సినిమా వరకు ఆయన చేయని ప్రయోగం లేదు. ఎప్పుడు ఏది అనుకుంటే అది చేసేయడమే. మరుక్షణం ఆలోచన వుండదు..ఎవరు ఏమనుకుంటారన్న బెరుకు వుండదు. తనేమిటో..తన సినమాలేమిటో..తన లోకమేమిటో..అన్నట్లుగా సినిమాలు తీసేస్తూ..మాట్లాడేస్తూ..ట్వీటిస్తూ..కాలం గడిపేస్తున్న రామ్ గోపాల్ వర్మతో 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వూ.
సైకో కిల్లర్ లాంటి భయానక సబ్జెక్ట్ పై సినిమా ఎందుకు తీయాలనిపించింది?
నాకు స్కూల్ డేస్ నుంచి కూడా టిపికల్ క్యారెక్టర్ లు అంటే ఇష్టం. వెనుక బెంచీలో కూర్చుని ముందు బెంచీవాళ్లని గిల్లేవాళ్లు, జడలులాగే వాళ్లు..కాలేజీ రోజుల్లో ఇలాంటి సబ్జెక్ట్ వున్న హాలీవుడ్ సినిమా చూసాను. ఆ తరువాత కూడా ఒకటి రెండు చూసాను. అలాంటపుడు నాకు పిచ్చి కోపం వచ్చింది. ఆ క్యారెక్టర్ ను చంపేయాలన్నంత.
దాని సంగతి అలా వుంచండి..ఈ సినిమా రీచ్ అయ్యే ఆడియన్స్ శాతం ఎంత వుంటుంది?
కొంతే వుంటుంది. ఓ విషయం చెప్పనా..హర్రర్ సినిమాలు చూసేవారిలో కూడా చాలా మంది పూర్తి సినిమా చూడరు. అందువల్ల ఎవరు అలా భయపడుతూ, పడుతూ చూస్తారో వాళ్లకోసమే ఈ సినిమా.
సీరియల్ కిల్లర్ లేదా సైకో కిల్లర్ వ్యవహారాలపై తెలుగులో కూడా నవలలు వచ్చాయి. నవల అనేసరికి ఎవరైనా చదవచ్చు..కానీ దాన్ని విజువలైజ్ చేస్తే అందరూ చూడగలరా?
చెప్పాను కదా..చూడలేరు..కానీ ఎవరైతే భయపడుతూనే, అలా అలా చూద్దామనుకుంటున్నారో వారి కోసమే ఇది. రోడ్డు మీద వెళ్తుంటాం. ప్రమాదం జరుగుతుంది. మనం చూడం. భయపడతాం. కానీ ఇంటికి వచ్చి దాని గురించి బోలెడు చెబుతాం. అంటే చూడం కానీ ఫీల్ అవుతాం. అలా ఫీలయ్యే వారికోసమే.
కానీ ఆ ఆడియన్స్ శాతానికి, వ్యాపారానికి మ్యాచ్ అవ్వాలి కదా.
ఆ లెక్కలు నిర్మాత వేసుకుంటారు.
కానీ సినిమా నేను,.నే ఇష్టం..అంటారు. కానీ అన్నది వ్యాపారం అన్నది మర్చిపోతున్నట్లున్నారు
దీనికి నేను చాలా సార్లు సమాధానం చెప్పాను. ఎవరైనా వారి ఇష్టానికే చేస్తారు. అది మీకు ఇష్టం అయితే ఓకె. లేదంటే లేదు. నేను పైకి చెబుతాను. కొందరు చెప్పరు. ఎవరైనా ఏ పనైనా వారి ఇష్టానికే చేస్తారు అంటాను. నాకు ఓ అయిడియా వస్తుంది. నిర్మాతకు చెబుతాను. ఆయన ఆలోచించుకుంటాడు.. బడ్జెట్ సరిపొతుందనుకుంటే ముందుకు వెళ్తారు. మనం తీసిన సినిమా ఎంతలో తీసాం..సరిపోయిందా లేదా అన్నది పాయింట్. మే బి క్రిటిక్స్ కు నచ్చకపోవచ్చు..
మళ్లీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మరిచిపోతున్నారు..మీ మేకింగ్ స్టయిల్ నో, మీ సినిమాలనో నచ్చే గ్రూప్ కొంత వుంటుంది. వారిని అయినా సంతృప్తి పరచాలి కదా.
ఎవరండీ ప్రేక్షకులు..జంతువులు కాదు కదా..మనుషులు..రకరకాల టేస్ట్ లు వుంటాయి. ఇదంతా కాదు. మీరు మీకు నచ్చినట్లు సమీక్షలు రాస్తారు. నాకోసం మార్చుకోరు కదా. నేను అంతే నాకు నచ్చినట్లు సినిమా తీస్తాను.ఒకరి కోసం మార్చుకోను. శివ తీసినపుడు నాగార్జన మూడు నాలుగు కమర్షియల్ ప్రాజెక్ట్ ల్లో వున్నారు. నేను చెప్పాను,.ఇది వాటిలా వుండదు..ఇది వేరు. అని. ఆ సినిమా హిట్ అయింది. అవుతుందనీ. అవాలనీ నేను అనుకోలేదు. అయింది కాబట్టి ఇప్పటికీ మీరంతా దాని గురించి మాట్లాడుతున్నారు. నా సినిమాలు అన్నీ అంతే సత్య హిట్ అవుతదనుకోలేదు. అయింది. ఓహో అంటున్నారు. తీస్తాం..జనానికి నచ్చితే హిట్ లేదంటే లేదు. ఇలా అయితే హిట్ అంటే అదే లైన్ లో సినిమాలు వస్తాయి. నేను ఇప్పుడు హిట్ సినిమా తీయాలని అనుకంటను అనుకోండి. గడచిన మూడు నెలల్లో వచ్చిన పెద్ద హిట్ ఏది అని చూడాలి. రేసుగుర్రం. అప్పుడు అలాంటి సినిమానే చేయాలి. నేను అలా చేయను. అలా చేయడానికి నేను ఈ రంగంలోకి రాలేదు. నాకంటూ ఓ ఫాషినేషన్ వుంది. దాని కోసమే సినిమాలు తీస్తాను. ఇక చూడడం అంటారా..రౌడీ ట్రయిలర్ నచ్చలేదు. జనం రాలేదు. ఐస్ క్రీమ్ ట్రయిలర్ నచ్చింది. ఓెపెనింగ్స్ వచ్చాయి. అందువల్ల మంచి చెడ్డా డిసైడ్ చేయలేం. అసలు ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తారో మనకెలా తెలుస్తుంది. అలా తెలిస్తే అన్నీ హిట్ సినిమాలే వుంటాయి కదా. బాలీవుడ్ లో నాకు భయంకరమై ఫ్లాప్ వచ్చిన తరువాత సినిమా తీస్తే మాంచి ఓపెనింగ్స్ వచ్చి,. హిట్ అయింది. మళ్లీ సినిమా తీస్తే ఓపెనింగ్స్ లేవు. అలా వుంటుంది. అందువల్ల ఒకరి కోసం ఆలోచించి సినిమాలు తీయమన్నా తీయను.
మీరు అంటున్నారు, ఒక్కోసారి ఒక్కో సినిమా పాత్ బ్రేక్ అవుతుందంటారు. శివ, శంకరాభరణం. మధ్యలో కమర్షియల్ సినిమాలు వస్తాయని. మరి అలాంటపుడు మీరు సదా ఈ పాత్ బ్రేకింగ్ పైనే దృష్టి ఎందుకు పెడతారు?
కమర్షియల్ సినిమాలు తీయడానికైతే నేను ఈ రంగంలోకి రాలేదు.
క్షణ క్షణం, గాయం, శివ లాంటి సినిమాల్లో మీలోని కామెడీ యాంగిల్ కూడా కనిపిస్తుంది. చటుక్కున మెరుస్తుంది. మరి ఆ జోనర్ ను పూర్తిగా ఎందుకు వదిలేసారు?
నేను ఇప్పటికి ఇన్ని సినిమాలు తీసాను. వాటిపై విశ్వేషణలు వచ్చాయి. నా సినిమాలపై, నాపై చాలా వ్యాసాలు వచ్చాయి. చాలా మంది ఇదే ప్రశ్న నన్ను అడిగారు కూడా. అయినా కూడా నేను ఇలాగే రకరకాల సినిమాలు తీస్తున్నానంటే, నాకు బుర్రన్నా లేకపోయి వుండాలి. లేదా నేను ఇంకేదైనా ప్రయత్నిస్తున్నాని అనుకోవాలి. అలా వేరే ఆలోచన ఏమిటని ఆలోచించడం లేదు మీరంతా.
సరే మీ స్టయిల్ లోనే అడుగుతా…మీరు ఇలా రకరకాల జనానికి నచ్చని ప్రయోగాలు చేస్తున్నా, మిమ్మల్ని అభిమానించేవారు ఇంకా ఏదో విధంగా మిమ్మల్ని వాళ్లకు నచ్చేదారిలో చూడాలని ఎందుకు అనుకుంటున్నారు?
ఇందాకానే చెప్పాకదా..ప్రేక్షకులు ఏం జంతువులా..మనది అనుకోవడానికి. వాళ్లు మనుషులు. ఇదంతా ఏం వుండదు. నచ్చితే చూస్తారు. లేదంటే లేదు. ఫస్టాఫ్ ఆల్ జనం ఎవర్నీ పట్టించుకోరు
కాదు రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే చిన్న ఆశతో వస్తారని నేనంటాను.
ఎవరి ఉద్దేశాలు వారివి. మీకు ఓ సంగతి చెప్పనా..ఇప్పుడే ఓ ప్రెస్ మీట్ లో అరగంట మాట్లాడాను. ఎక్కువ మందితో. ఇప్పుడు మీతో పది నిమషాలే మాట్లాడుతున్నా. కానీ నేను దీన్నే ఇష్టపడతాను. రోటీన్ ప్రశ్నలు అక్కడ. కాస్త డిఫరెంట్ గా, ఇక్కడ. నేను దీన్నే లైక్ చేస్తాను..ఓ సినమా తీసినంతగా.
అంటే, అనుక్షణంలో కిల్లర్ తన ఆనందం కోసం మనుషుల్ని చంపుతాడు. మీరు మీ ఆనందం కోసం సినిమాలు తీస్తారు. మిగిలినవి మీకు అనవసరం.
నాకు సబ్జెక్ట్ మీద ఎగ్జయిట్ మెంట్ రావాలి. అంతే. తీస్తాను.
సరే సినిమాల సంగతి వదిలేద్దాం. మిగిలిన సినిమా జనాలు అయితే సినిమాలు, లేకుంటే మహా అయితే రాజకీయాలు. కానీ మీరెందుకు సదా కాంట్రావర్సీలు చుట్టుకుంటారు.
కాంట్రావర్సీ కాదండి. నాకు ఏదో చెప్పాలని పిస్తుంది..చెబుతాను. అంతే.
మీకు తెలుసుకదా..ఏది కాంట్రావర్సీ అవుతుందో ఏది కాదో..అలాంటపుడు మీరు మిమ్మల్ని కంట్రోలు చేసుకోవాలి కదా.
మీరు ఒకటో రెండో సినిమాలు తీసినవాళ్లని అడిగే ప్రశ్నలు, ఇన్ని సినిమాలు తీసిన నన్ను అడిగితే ఎలా? మొన్న మీడియా కాంట్రావర్సీ వచ్చినపుడే చెప్పాను. ఒకటి. నేను దేని గురించి ఏది అనుకుంటే అది నిర్మొహమాటంగా చెబుతాను. అది నా స్వభావం. నేను చిన్నప్పటి నుంచీ అంతే. అది అర్థం చేసుకోలేని వాళ్లకి నాది కుక్కబుద్ది. అంతే అంతకన్నా ఇంక ఏమీ చెప్పేది లేదు.
చాణక్య