సినీ నటి రంజిత ‘మా ఆనందమయి’గా పేరు మార్చుకున్న విషయం విదితమే. సెక్సానందగా వివాదాస్పద రీతిలో వార్తల్లోకెక్కిన నిత్యానందతో కలిసి రంజిత తిరుమలలో దర్శనమివ్వడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. రంజితతో కలిసి నిత్యానంద రాసలీలలు.. అంటూ ఓ వీడియో తెరపైకి రావడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా రంజిత, నిత్యానంద వార్తల్లో వ్యక్తులుగా మారారు.
ఆ తర్వాత అనేకానేక వివాదాలు నిత్యానంద చుట్టూ ముసురుకున్నాయి. ‘అసలు నేను మగాడ్నే కాదు..’ అంటూ నిత్యానంద పోలీసుల విచారణలో చెప్పడం అప్పట్లో మరో సంచలనం. వివాదాల కారణంగా నిత్యానంద ఆశ్రమాల్లో పోలీసులు సోదాలు నిర్వహించడం, ఆయనపై పలువురు గృహిణులు ‘వేధింపు’ ఆరోపణలు చేయడం జరిగాయి.
ఎలాగోలా ఆ వివాదాలన్నీ సద్దుమణిగాయి క్రమక్రమంగా. సినిమా రంగంలో ఓ మోస్తరు పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించిన రంజిత, వెండితెరపై మాయమైపోయి.. నిత్యానంద కారణంగా వివాదాల్లో ఇరుక్కుంది. అయినాసరే సినిమాల్లోకన్నా ఎక్కువ పాపులారిటీ నిత్యానంద కారణంగానే రంజితకి దక్కాయన్నది నిర్వివాదాంశం.
తిరుమలలో రంజిత, నిత్యానందతో కలిసి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నా, మీడియా ముందు వారిద్దరూ పెదవి విప్పలేదు. ఏం మాట్లాడితే ఏం వివాదమవుతుందోనని ఇద్దరూ మౌనంగానే మీడియాని దాటుకుని వెళ్ళిపోయారు.