కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతోన్న సచిన్ టెండూల్కర్, చివరి టెస్ట్ జీవితాంతం గుర్తుపెట్టుకునేలా వుండాలనుకోవడం సహజమే. అతని అభిమానులూ అదే కోరుకుంటారు. కానీ, సచిన్‌పై ఎప్పుడూ వున్నదానికి వంద రెట్లు ఒత్తిడి చివరి టెస్ట్‌పై నెలకొంది. కారణం, అనవసరంగా సచిన్ చివరి టెస్ట్‌పై క్రియేట్ అయిన హైప్.
అవును.. చివరి టెస్ట్ అయినా ఎలాంటి ఒత్తిడీ లేకుండా సచిన్‌ని ఆడనిస్తే కదా. బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, మీడియా.. ఇలా అందరూ కలిసి సచిన్‌పై ఒత్తిడి పెంచేశారు. అంతే, ఎంతో కాన్ఫిడెంట్‌గా బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వచ్చిన సచిన్, పది పరుగులకే వికెట్ సమర్పించేసుకున్నాడు. అదీ ఎల్బీడబ్ల్యూగా.
ఇరవై నాలుగు బంతులు ఎదుర్కొన్న సచిన్, రెండు బౌండరీలు అయితే కొట్టాడుగానీ, అంత కాన్ఫిడెంట్‌గా క్రీజ్‌లో కన్పించలేదు. కారణం.. చివరి టెస్ట్‌లో సచిన్ సెంచరీ చేస్తాడా.? లేదా.? అంటూ అభిమానుల్లో నెలకొన్న టెన్షన్, మీడియాలో అతనిపై వచ్చిన కథనాలు.. ఇంకా చాలా చాలానే. ఇవన్నీ సచిన్‌కి కొత్తేమీ కాదుగానీ, గత కొంతకాలంగా ఇలాంటి టెన్షన్స్‌ని సచిన్ అంతగా తట్టుకోలేకపోతున్నాడు.
ఇక సచిన్ రిటైర్ అయితే మంచిది.. అని చాలాకాలం నుంచే సచిన్‌పై కథనాలొస్తున్నాయి. క్రికెట్ విశ్లేషకులూ సచిన్‌ని సాగనంపేందుకు తమదైన రీతిలో విశ్లేషణలు చేశారు. వెరసి, సచిన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చివరి మ్యాచ్ ఆడుతున్నా.. అని సచిన్ ప్రకటించడంతో ఆ చివరి మ్యాచ్‌పై బీభత్సమైన హైప్ క్రియేట్ అయ్యింది. అదే సచిన్‌ని నిండా ముంచేసిందని అనుకోవాలేమో.