భారత క్రికెట్‌కి గతంలో కోచ్‌గా పనిచేసిన గ్రెగ్ ఛాపెల్‌పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తన ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ఆత్మకథలో. ‘విభజించు పాలించు’ సూత్రాన్ని ఛాపెల్ పాటించాడనీ, జట్టుపై పెత్తనం కోసం పరితపించేవాడనీ, రాహుల్‌ద్రావిడ్‌ని జట్టు నుంచి తప్పించాలని కుట్ర పన్నాడనీ తన ఆత్మకథలో సచిన్ ప్రస్తావించిన విషయం విదితమే.
సచిన్ ఆరోపణల్ని ఛాపెల్ కొట్టి పారేశాడు. సచిన్ చెప్పినవన్నీ తప్పులేనంటూ ఛాపెల్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఛాపెల్ టైమ్‌లో భారత క్రికెట్‌లో రాజకీయాలు రాజ్యమేలాయన్నది నిర్వివాదాంశం. జట్టు పీకల్లోతు కష్టాల్లో, వరుస వైఫల్యాల్లో కొట్టుమిట్టాడిరది కూడా ఛాపెల్ కోచ్‌గా వున్న సమయంలోనే. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా ఛాపెల్‌పై అనేకానేక విమర్శలు చేశాడు.
భారత క్రికెట్‌ని ఉద్ధరించేస్తాడని ఛాపెల్‌ని తీసుకొస్తే, కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజునుంచే ఆటగాళ్ళపై ఛాపెల్ పెత్తనం చేశాడనేది ఓపెన్ సీక్రెట్. ఈ నేపథ్యంలోనే పలువురు క్రికెటర్లపై ఛాపెల్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు అప్పట్లో. అవన్నీ ఇప్పుడు సచిన్ ఆత్మకథ ద్వారా బహిర్గతమవుతున్నాయి. ఛాపెల్ మాత్రం అదంతా ఉత్తదేనంటున్నాడు. భారత క్రికెట్ అభిమానులు మాత్రం, సచిన్ క్రెడిబులిటీ తమకు తెలుసనీ.. ఛాపెల్ భారత క్రికెట్‌ని భ్రష్టుపట్టించాడని అంటున్నారు.