జ్యోతిషం చెప్పేవాడికి ఓ కామన్ లాజిక్ పాయింట్ తెలిసి వుండాలి. నూటికి తోంభై మంది జోస్యం కోసం వచ్చేవాళ్లు ఏదో ఒక కష్టం లేదా, ఇబ్బందుల్లో వున్నట్లే అన్నది ఆ లాజిక్. అన్నీ బాగుంటే, తీరి కూర్చుని, డబ్బులు ఖర్చు చేసుకోవడానికి జోతిష్కుడి దగ్గరకు రాడు కదా. అదే విధంగా వుంటాయి మన వివిధ సర్వే సంస్థల ఎన్నికల సర్వేలు. జనాల మూడ్, పార్టీల పరిస్థితి అంచనా వేసి, దానికి కాస్త జనాల అనిప్రాయం జోడించి ఇదీ సర్వే అని వదిలేస్తున్నాయా అని అనిపిస్తోంది. ఎందుకంటే లక్షల్లో ఓటర్లు వుంటే పదుల సంఖ్యలో మాట్లాడి, ఇదే ఫలితం అని అనుకోమంటే, ఇంతకన్నా ఏమనుకోవాలి?
ఈ రోజు వివిధ ప్రసార మాధ్యమాలన్నీ ఆకలిగొన్న పులుల్లా రెచ్చిపోయాయి. కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో తమ తమ సర్వే లన్నీ సగర్వంగా ప్రకటించాయి. కొద్దో గోప్పో తేడాగా అన్నీ ఓ మాదిరిగానే వున్నాయి. ఇవి నిజమవడం అవకపోవడం సంగతి అలా వుంచితే, సాధారణంగా మీడియాలో పనిచేసే వారు అనగానే, ఎలావుంది..ఏ ప్రభుత్వం వస్తుంది..ఎవరు గెలుస్తారు. అని రోజుకు అయిదుగురో పదుగురో అడుగుతుంటారు. రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చిన రీతిలో, చకచకా లెక్కలు కట్టి చెప్పేస్తుంటారు చాలా మంది. ఈ చెప్పడంలో వారు ఓ లాజిక్ పాటిస్తారు. సహజంగా వున్న ట్రెండ్, మాధ్యమాల్లో వచ్చిన వార్తల సారాంశం కలిపి, ఓ అయిడియాకు వచ్చి, దాని ప్రకారం ఓ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. సాధారణంగా ఇది కొంత వరకు నిజమయ్యే అవకాశం వుంటుంది. ఈ సర్వేలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.
సాధారణంగా ఈ సర్వేలు ఎన్నికలకు ముందు ఓ ట్రెండ్ ను క్రియేట్ చేస్తాయి. ఎన్నికల తరువాత అలా క్రియేట్ అయిన ట్రెండ్ కు అనుగుణంగా వచ్చే ఫలితాలను అంచనా వేస్తాయి. సిఎన్ఎన్-ఐబిఎన్ సీమాంధ్రలోని 13 పార్లమెంటు స్థానాల్లో 723 మందితో మాట్లాడి ఎగ్జిట్ పోల్ ను ప్రకటించింది. అంటే సగటున నియోజకవర్గానికి 50 నుంచి 60 మధ్య జనంతో అన్నమాట. లక్షల్లో ఓటర్లు వుండే నియోజకవర్గంలో అది కూడా ఏదో ఓ ఊరిలో 60 మందితో మాట్లాడి అదే ట్రెండ్ అని అనుకోవడం ఎంత వరకు సమంజసం అనిపిస్తుంది. ఇప్పుడీ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ 43శాతం ఓట్లతో 11 నుంచి 15 సీట్లు, వైకాపా 40 శాతం ఓట్లతో 11 నుంచి 15 సీట్లు గెల్చుకుంటుందని అంచనా వేసారు.
చిత్రంగా 2009 లో కాంగ్రెస్ పార్టీ అదే 40.7 ఓట్ల శాతంలో 35 సీట్లు గెల్చుకుంది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ 35.1శాతం ఓటింగ్ తో అయిదు సీట్లు గెల్చుకుంది. చివరి రెండు జరిగినవి వాస్తవాలు. మరి పైన రెండూ అంటే, అదే 40శాతంతో 11 నుంచి 15 సీట్లు వైకాపా, కాస్త ఎక్కువగా అంటే 43శాతంతో అదే 11 నుంచి 15 సీట్లు తేదేపా గెల్చుకుంటాయని అంచనా వేసారంటే, దాని వెనుక శాస్త్రీయత లెక్కలేమిటో? నియోజకవర్గానికి 60 మందితో మాట్లాడితే, అందులో నలభై శాతం మంది వైకాపా అంటే, 24 మంది, 43శాతం మంది అంటే 25 మంది తేదేపా అన్నారని అనుకోవాలి. ఇంతోటి పాతిక మంది అభిప్రాయాన్ని పట్టకుని చానెళ్లు తెగ గడబిడ చేస్తున్నాయి. బహుశా దీనికి స్థానిక సమాచార సేకరణ యంత్రాంగం లేదా, మీడియా ప్రతినిధి తన స్వంత అభిప్రాయాలు కూడా జోడించి వుండాలి. లేకుంటే అంత కచ్చితంగా ధీమాగా ఫలితాలు ప్రకటించే అవకాశం వుంది. అదృష్టం కొద్దీ ఇవి గాడిద తన్ను తన్ని నిజమైపోతే, ఓకె. లేకుంటే వుండనే వుంది…ఊహించని ఫలితాలు వచ్చాయి అని చెప్పుకునే సాకు.
ఐబిఎన్ సర్వేలో మరో చిత్రం కూడా కనిపించింది. ఎన్నికల పోలింగ్ కు ముందు కన్నా తరువాత తెలుగుదేశం ఓటింగ్ మూడుశాతం మేరకు తగ్గిపోయిందట. పోలింగ్ కు ముందు 46శాతం వుంటే తరువాత 43శాతానికి పడిపోయిందట. ఇది ఎలా లెక్కించారనుకోవాలి. ఎన్నికల ముందు 27కు తేదేపా అంటే, తరువాత 25గురు అన్నారనా? వీళ్లు శాంపిల్ తీసుకోని వేరే జనం తేదేపాకు పెరిగి వుండొచ్చుగా. అలాంటపడు అంత ఢంకా భజాయించి, ఇంత శాతం వస్తాయని చిలక జోస్యాలు ఎలా చెప్పేస్తారు. అదే సమయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు పోలింగ్ కు ముందు కన్నా పోలింగ్ తరువాతకు 7శాతం పెరిగేసారట. ఇది ఎలా సాధ్యం? అసలు పోలింగ్ ముందు, అనగా ఎన్నాళ్ల ముందు అన్నది చెప్పలేదు. నిజానికి వాస్తవాన్ని పరిశిలిస్తే, పోలింగ్ ముందు కన్నా తరువాత తెలుగుదేశానికే ఓటింగ్ శాతం పెరిగి వుండాలి. ఎందుకంటే, మోడీ, పవన్ ల పభావం పడింది కాబట్టి.
మరి ఈ లెక్కలే నిజమైతే, ఇప్పటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకూడదు. ఎందుకంటే అవి జరిగిన నెలకు ఈ లెక్కలు తీసారు, పైగా ఏడు శాతం వైకాపాకు పెరిగింది, మూడుశాతం తేదేపాకు తగ్గింది అని అంటున్నారు కాబట్టి. ఇదిలా వుంటే, 40 శాతం అయినా, 43 శాతమైనా 11 నుంచి 15 సీట్లే వస్తాయనడం, గతసారి 40శాతంతోనే కాంగ్రెస్ 35 సీట్లు తెచ్చుకోవడం గమనిస్తే, అసలు కౌంటింగ్ జరిగేవరకు ఏ విషయం లెక్కలోకి తీసుకోకూడదను అనిపిస్తుంది. ఎటొచ్చీ రాజకీయాలపై ఆసక్తి వున్నవారిని కాస్సేపు టీవీల ముందు కూర్చో పెట్టి అలరించడానికి, ఆపై ఆఫీసులో గంటల కొద్దీ చర్చలు సాగించడానికి మాత్రం పనికి వస్తాయి. ఫ్లూక్ గా నిజమైపోతే, తమంత వారు లేరనడానికి కూడా ఉపయోగపడతాయంతే.
చాణక్య