వైట్‌ వాష్‌: కోహ్లీ ‘మచ్చ’ చెరిగిపోతుందా.?

చెరిపేస్తే చెరిగిపోయే మచ్చ కాదది. అయినాసరే, ఓ విజయం.. ఓ పరాజయం తాలూకు 'మచ్చ'ని కొంత మేర చెరిపేయొచ్చుగాక.! ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు చేతిలో టీమిండియా చవిచూసిన ఓటమిని, భారత…

చెరిపేస్తే చెరిగిపోయే మచ్చ కాదది. అయినాసరే, ఓ విజయం.. ఓ పరాజయం తాలూకు 'మచ్చ'ని కొంత మేర చెరిపేయొచ్చుగాక.! ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు చేతిలో టీమిండియా చవిచూసిన ఓటమిని, భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ పరాజయం అంతటి మానసిక గాయాన్ని చేసింది మరి.! 

ఆటలో గెలుపోటములు సహజమే. కానీ, ఒకరి మీద కక్ష సాధింపు కోసం మ్యాచ్‌ని పోగొట్టుకోవడమంటే అది క్షమించరాని నేరం. అవును, ఆ క్షమించరాని నేరం చేసేశాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. అప్పట్లో, కోహ్లీ కక్ష సాధింపులకు దిగింది అప్పటి కోచ్‌ కుంబ్లే మీదనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 'కసి' తీరింది.. కుంబ్లేని కోచ్‌ పదవి నుంచి తొలగించేశారు. ఇకనేముంది.? కోహ్లీకి ఎదురే లేకుండా పోయింది. 

సరిగ్గా, ఈ టైమ్‌లోనే టీమిండియాకి అద్భుతమైన విజయం దక్కింది. అలాంటిలాంటి విజయం కాదది. 85 ఏళ్ళలో టీమిండియా ఎప్పుడూ చూడని విజయమది. శ్రీలంకని శ్రీలంకలోనే మట్టికరిపించడం.. అదీ వైట్‌ వాష్‌ చేసేయడమంటే, భారత క్రికెట్‌ అభిమానులకి ఇది ఓ పండగ లాంటి సందర్భం. లంక జట్టులో 'స్టార్‌' ఆటగాళ్ళెవరూ లేరు గనుక, ఈ విజయం మామూలేనని కొంతమంది లైట్‌ తీసుకోవచ్చుగాక. కానీ, గెలుపు గెలుపే.! ఆ గెలుపు ఇచ్చే కిక్‌ ఎప్పుడూ ప్రత్యేకమే. 

మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో ఒకదాన్ని మించిన విజయం ఇంకోటి.. అన్నట్టు లంకని, ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా మట్టికరిపించేసింది. చివరి మ్యాచ్‌లోనూ అదే జోరు. వెరసి, లంకకి వైట్‌ వాష్‌.. టీమిండియాకి మెమరబుల్‌ విక్టరీ. అన్నిటికీ మించి, విరాట్‌ కోహ్లీ మరింతగా విర్రవీగడానికి ఇదో అవకాశం. అయినాసరే, కోహ్లీ మీద పడ్డ 'మచ్చ' మాత్రం చెరిగిపోదండోయ్‌.!