ఎన్టీఆర్ బయోపిక్. ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సినిమా. టాలీవుడ్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించి, తెలుగునాటే కాకుండా, జాతీయ రాజకీయాలను కూడా మలుపుతిప్పిన వ్యక్తి జీవితచరిత్రను తెరకెక్కించడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ వర్తమాన రాజకీయాలతో ముడిపడిన చరిత్ర. ఇలాంటి ఫీట్ ను దిగ్విజయంగా చేసి, రెండుభాగాలుగా మార్చి, తొలిభాగం విడుదల చేసిన నెల తిరిగిన వెంటనే మలిభాగం విడుదలచేస్తున్న దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ బయోపిక్ రెండోభాగం మహానాయకుడు విడుదల సందర్భంగా ఆయన కాస్సేపు 'గ్రేట్ఆంధ్ర'తో ముచ్చటించారు.
బయోపిక్ భారం దాదాపుగా మీ భుజాల మీద నుంచి దిగిపోయినట్లేనా?
ఇది భారం కాదు. ఒక గొప్ప మనిషి చరిత్రను చెప్పే అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు.
జయాపజయాలు పక్కన పెడితే ఎలాంటి అనుభూతి మిగిల్చిందీ సినిమా మీకు.
ఐకానిక్ యాక్టర్ కథ చెప్పడం అనేది చాలా ఎగ్జయిటింగ్ అయ్యే విషయం. ఇప్పటికే ఎన్టీఆర్ కథ చెప్పడం బాగా ఆలస్యం అయింది. అద్భుతమైన నటుడి గురించి, ఓ మంచి ముఖ్యమంత్రి గురించి చెప్పడం అంటే ఎలా వుంటుందో ఊహించండి.
బయోపిక్ కు ముందు వరకు మీ సినిమాలన్నింటిలో మానవ సంబంధాలు, భావోద్వేగాలు ప్రముఖంగా కనిపిస్తాయి. కానీ ఎన్టీఆర్ జీవితంలో, అందులోనూ మీరు తీసుకున్న పీరియడ్ లో అలాంటి వ్యవహారాలు ఏవీ వుండవు కదా?
రెండోభాగం చూడండి.. మహానాయకుడులో మీరు అనుకుంటున్న, అంటున్న మానవ సంబంధాలు, ఎమోషన్లు అన్నీ పుష్కలంగా వుంటాయి.
బయోపిక్ అంటే ఓ మనిషి జీవితగాథ మొత్తం చెప్పాలి అనుకుంటే, మీరు ఈ సినిమాకు కాలపరిమితిని పెట్టుకున్నారు ఎందుకని?
మీరు రామాయణం తీసుకోండి. రాముడు పట్టాభిషేకం అయ్యేవరకే వుంటుంది. ఆ తరవాత ఉత్తర రామాయణం రాసి వుండొచ్చు. అందులో అంతకు మించిన భావోద్వేగాలు వుంటే వుండొచ్చు. కానీ పట్టాభిషేకం వరకే కీలకం కదా?
అసలు సినిమాను బసవరామతారకం కోణంలో చూపించాలన్న ఆలోచన మీదా? లేక మీరు ఈ ప్రాజెక్టులోకి వచ్చేసరికే వుందా?
ఇది పూర్తిగా నా ఐడియా. నేను ప్రాజెక్టులోకి ఇప్పుడు వచ్చినా, బయోపిక్ ఐడియా నాకు ఎప్పుడో వుంది. శాతకర్ణి సినిమా తీసిన తరువాత సీనియర్ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావు ఆయన రాసిన ఎన్టీఆర్ పుస్తకం ఇచ్చారు. అలాగే సుప్రభాతం తదితర మ్యాగ్ జైన్లలో ఎన్టీఆర్ జీవితంపై వచ్చిన వ్యాసాలు చదివాను. అప్పుడే నా మనసులో వుంది. అనుకోకుండా అవకాశం వచ్చింది.
దానికీ బసవతారకం కోణానికి సంబంధం ఏమిటి?
అదే చెబుతున్నాను. నేను అసలు ఎన్టీఆర్ బయోపిక్ చేస్తే, పెట్టాలనుకున్న పేరు తారకరాముడు. ఎందుకంటే సీతారాములు అంటే భార్యభర్తల ఇద్దరి పేర్లువున్నాయి. అలాగే తారకరాముడు అంటే బసవతారకం, తారకరామారావు పేర్లు రెండు వుంటాయి. నా దృష్టిలో వాళ్లిద్దరిదీ అపూర్వబంధం.
కానీ వాస్తవానికి ఎన్టీఆర్ జీవితంలో మెలోడ్రామా కానీ, సినిమాకు పనికి వచ్చే అంశాలు కానీ అన్నీ ఆయన జీవిత చరమాకంలోనే వున్నాయి. మీరు అక్కడ వరకు వెళ్లకపోవడానికి కారణం?
చెప్పాను కదా? నేను వాల్మీకి రామాయణం స్పూర్తిగా ఈ సినిమా లైన్ గ్రాఫ్ వేసుకున్నాను. అంతకు మించి మరేం కాదు.
అంతేనా? వర్తమాన రాజకీయాలు, చంద్రబాబునాయుడు, ఇలాంటివి అన్నీ ఇబ్బందిపడే అవకాశం వుంది అనా?
నేను అస్సలు అంత దూరం ఆలోచించలేదు.
ఇప్పుడు మీరు వదిలేసిన దాన్నే వేరేవాళ్లు సినిమాగా తీస్తున్నారు కదా?
ఎవరి పెర్ సెప్షన్ వారిది.
తొలిభాగం విడుదలయింది. బాగుందని టాక్ వచ్చింది. కానీ జనాదరణ ఎందుకు పొందలేదని మీ అభిప్రాయం?
అదే నాకు ఇప్పటికీ అర్థంకానిది. అమెజాన్ లో సినిమా విడుదలయ్యాక ఎంతోమంది ఫోన్ లు. చూసాం.. చాలా బాగుంది అని. నేను వాళ్లను ఒక్కటే అడిగాను థియేటర్ కు ఎందుకు వెళ్లి చూడలేదని.
తొలిభాగంపై సోషల్ నెట్ వర్క్ ఫ్లాట్ పారమ్ ల మీద వచ్చిన వివిధ విమర్శలు మీదాకా వచ్చాయా?
కొన్ని కొన్ని విన్నాను. కొన్ని చూసాను.
ముఖ్యంగా బాలయ్య యంగ్ ఎన్టీఆర్ గా సరిపోలేదన్న విమర్శ వుంది. దానికి మీరేం అంటారు.
అదేం లేదు. బాలయ్య చాలా బాగా చేసారు. ఆ పాత్రను.
అసలు మీకు యంగ్ ఎన్టీఆర్ గా ఎవరినన్నా తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందా? లేదా?
అస్సలు లేదు. ముందు నుంచీ బాలయ్యనే అనుకున్నాం.
సినిమాను ఎక్కువగా స్టూడియోల్లోనే చుట్టేసారన్న విమర్శ?
ఇది పీరియాడిక్ ఫిల్మ్. ఇవ్వాళ బయట వాతావరణం వేరు. సినిమాకు కావాల్సిన లుక్ వేరు. అప్పటికీ వీలయినంత వరకు చాలా ఒరిజినల్ లొకేషన్లకు వెళ్లాం. ఇక మిగిలినది స్టూడియోలో తీయక తప్పదు. సినిమా జోనర్ అలాంటిది.
ఎన్టీఆర్ సినిమా జీవితం దాదాపు ఆయన అభిమానులకు, సినిమా అభిమానులకు తెలిసిందే. కొత్త చెప్పాల్సిన పనిలేదు. కానీ పర్సనల్, ఫ్యామిలీ వ్యవహారాలు తెలిసింది తక్కువ. అయితే పార్ట్ వన్ లో మీరు మళ్లీ సినిమాల గురించే ఎక్కువ చెప్పి, ఫ్యామిలీ విషయాలు తగ్గించారు?
రెండోభాగంలో చూడండి. ఫ్యామిలీనే కీలకంగా వుంటుంది.
బాలయ్యకు తన తండ్రి చేసిన పాత్రలు అన్నీ తాను కూడా చేయాలన్న కోరిక తొలిభాగం మీద ప్రభావం చూపించిందా?
అదేం లేదు. మీరు తొలిభాగం గమనిస్తే, ఎన్టీఆర్ జీవిత గమనానికి అవసరమైన పాత్రలనే చూపించాం. నిజానికి ఆయన ధరించినవి అంతకన్నా గొప్పపాత్రలు, గొప్ప సినిమాలు వున్నాయి. వాటిని తీసుకోలేదు. ఆ పాత్ర, ఆ సినిమా ఆయన జీవితంలో ఓ మలుపు లేదా ఓ కుదపునకు కారణం అనుకున్నవే తీసుకున్నాం. అవే బాలయ్య వేసారు. అంతేతప్ప పాత్రల కోసం కథరాసి, సినిమా చేయలేదు.
రెండు భాగాలుగా చేయాలన్న మీ ఆలోచన కారణంగా, తొలిభాగంలో అనవసరపు సాగదీత చోటుచేసుకుందనే విమర్శ మీదాకా వచ్చిందా?
ఎన్టీఆర్ జీవితం సినిమాగా మార్చాలంటే కనీసం నాలుగు గంటలు వస్తోంది. అందువల్ల రెండుభాగాలు చేయకతప్పలేదు. తొలిభాగం నిడివికి కాస్త తగ్గివుంటే మరింత షార్ప్ గా వుండేదేమో కానీ, అక్కడ అవకాశం లేదు. విషయంలో వున్న స్పాన్ అటువంటిది.
మహానటి సినిమా ప్రభావం మీ మేకింగ్ మీద ఏ మేరకు వుంది.
మహానటి సినిమాతో నేను కంటిన్యూగా వున్నాను. ఆ సినిమా, ఆ దర్శకుడు నా పని చాలావరకు సులువు చేసారు అనే అంటాను. వాస్తావానికి అలాంటి సినిమాలు చాలా వున్నాయి. అయినా మహానటి చూపిన దారి ప్రత్యేకమైనది.
తెలుగు దర్శకులకు, తెలుగులో బయోపిక్ ను స్వేచ్ఛగా చేయగలిగే అవకాశం వుందా?
మహానటి చేసారు కదా?
మహానటి వ్యవహారం వేరు. సావిత్రి ఫ్యామిలీ ఇండస్ట్రీలో లేదు. పొజిషన్ లో లేదు.
ఏమైనా ఒకటి వాస్తవం. ఎన్టీఆర్ బయోపిక్ మేకింగ్ విషయంలో నామీద ఎటువంటి వత్తిడి అన్నది లేదు. ఆ మేరకు క్లారిటీ ఇవ్వగలను.
సినిమా ముందు చంద్రబాబును కలిసారు కదా? స్క్రిప్ట్ చెప్పారా?
చంద్రబాబుగారిని కలిసేటప్పటికే బయోపిక్ మొదలు పెట్టేసాం. కేవలం ఆయన దగ్గర నుంచి కొన్ని ఇన్ పుట్స్ తీసుకున్నాం అంతే. అంతే కానీ ఆయనకు స్క్రిప్ట్ చెప్పడం లాంటివి లేదు.
బాలయ్య స్వంత నిర్మాణం ఇది. మీది కాస్త సున్నితమైన వ్యవహారం. ఇలా వుండేది మీ ఇద్దరి మధ్య రోజువారీ?
నాకన్నా సున్నితమైన మనస్తత్వం బాలయ్యది. దర్శకుడుకి అంత గౌరవం ఇచ్చే హీరోలు అరుదుగా వుంటారు. దర్శకుడు చెప్పినమాట దాటరు బాలయ్య. అందువల్ల నాకే సమస్యా రాలేదు.
మరి మీకు యూనిట్ లో కీలకమైన వారికి మధ్య ఘర్షణలు తలెత్తాయని?
అవన్నీ చిన్న చిన్నవి. ఎక్కడయినా వుంటాయి. అవేవీ సినిమాకు సంబంధించి, సినిమాను ప్రభావితం చేసేవి కావు.
తొలిభాగం అయిన తరువాత వచ్చిన పలితం తాలూకా ప్రభావం రెండోభాగం మీద పడిందా? ఏమన్నా?
తొలిభాగం విడుదల వేళకే మలిభాగం షూటింగ్ అంతా అయిపోయింది. పాటలు మినహా.
యాత్ర బయోపిక్ చూసారా?
లేదు. అస్సలు ఖాళీలేదు. కానీ వీలు చూసుకుని చూస్తాను.
శాతకర్ణి నుంచి మీ సినిమాల జోనర్ల లైన్ మారింది. రాబోయే సినిమా ఎలా వుండబోతోంది.
మారడం అన్న సంగతి అలావుంచి, మంచి విషయాలు టేకప్ చేయగలిగాను. శాతకర్ణి అనేది గొప్ప కథ. అలాగే ఎన్టీఆర్. ఇక రాబోయే సినిమా అంటారా? వరుసగా దాదాపు 200 రోజులు పనిచేసి అలసిపోయాను. కాస్త విశ్రాంతి తీసుకుని, అప్పుడు ఆలోచించాలి.
-విఎస్ఎన్ మూర్తి