మంచు మనోజ్..తెలుగు సినిమాలతో పరిచయం వున్నవారికి మనోజ్ ఎవరో, ఏమిటో తెలుసు. కొత్తగా నాలుగు లైన్ల పరిచయ వాక్యాలు అవసరం లేదు. అహాం బ్రహ్మాస్మి అనే అద్భుతమైన టైటిల్ లో కాస్త గ్యాప్ తరువాత సినిమా చేస్తున్న మనోజ్ బర్త్ డే సందర్భంగా ఈ చిట్ చాట్.
-హాయ్ అండీ..
హాయ్ అండీ..ఎలా వున్నారు? పిల్లలు అంతా బాగున్నారా? అందరి హెల్త్ అన్నీ బాగున్నాయా?
-ఆపకపోతే మీరే ఇంటర్వ్యూ చేసేసేలా వున్నారు.
హ..హ.హ..అదికాదు కరోనా టైమ్ లో ఇలా కాకపోతే ఇంక ఎలా పలకరిస్తాం. అందుకే.
-మంచు మనోజ్ ఏ యాంగిల్ లో ఇంటర్వ్యూ చేయాలి. మంచు ఫ్యామిలీ వారసుడిగానా? హీరోగానా? అనేక విషయాల్లో ఆసక్తి కలిగిన వ్యక్తిగానా? ఇంకా మరేమైనా?
మీ ఇష్టం. మీరు ఎలా చేసినా? ఏం అడిగినా ఒకె.
-అలా అని కాదు. మీరు హీరోగా నటించారు. యాక్షన్ కొరియోగ్రఫీ, డ్యాన్స్ ల రూపకల్పన, స్క్రిప్ట్ లో అసిస్టెన్స్ ఇలా చాలా చేసారు. ఆ మధ్య చిన్న పొలిటికల్ యాంగిల్ చూపించారు. డోనార్ గా సాయాలు చేసారు. ఇలా మీకు బహుముఖాలు వున్నాయి కదా.
బేసిక్ గా నటుడినే. సినిమాల్లో ఏవేవో చేసాను అంటే అప్పుడు డబ్బులు సరిపోక, వేరే వాళ్లని పెట్టుకోలేక నేనే చేసేసాను.
-మంచు మోహన్ బాబుగారబ్బాయికి డబ్బుల కొరత..ఈ పాయింట్ నోట్ చేసుకోవాలా?
అంటే డాడీని అడగడం ఇష్టం లేక. నా కాళ్ల మీదనేను నిల్చోవాలనే ప్రయత్నం. నాన్న నాకు అదే నేర్పారు. రేపు భవిష్యత్ లో నా పిల్లలకు అదే నేర్పుతాను. ఇక పొలిటికల్ యాంగిల్ నాకేమీ లేదు. అప్పట్లో నేనేదో ట్వీట్ వేయడం, ఆ టైమ్ లో ఎన్నికలు వుండడం. అన్నీ అలా ఒకటికి ఒకటి కలిసిపోయాయి అంతే. డోనార్ గా అంటారా? మనిషికి మనిషి సాయం చేయాలి.ఇప్పటికీ నా వంతు, నా పరిథిలో ప్రయత్నిస్తున్నా. ఎక్కువ చేసే స్థోమత లేదు కానీ, ఓ పది బస్ ల వరకు పెట్టి, వలస కార్మికులను వాళ్ల వాళ్ల ఊళ్లకు చేర్చే ప్రయత్నం చేయబోతున్నాను. వివరాలు అన్నీ చెబుతాను. కేవలం బస్ లు పెట్టడం కాకుండా, వారు ఇళ్లకు చేరే వరకు అన్ని అవసరాలు ఏర్పాటు చేయబోతున్నాను.
-మంచు మనోజ్..దారితప్పిన గొర్రెపిల్ల…అనుకోవాలా?
గొర్రెపిల్ల ఏం ఖర్మ…కోతిపిల్ల అనుకోండి.
-మరో ఉద్దేశం ఏం లేదు..
నాకు అర్థం అయింది. బైబిల్ కథ నాకూ తెలుసు. కోతిపిల్ల అని ఎందుకన్నాను అంటే, నాకు కాస్త గెంతులు ఎక్కువే కదా? వదిలేస్తే ఆ కొమ్మ, ఈ కొమ్మ పట్టుకుని వెళ్లిపోతుంటా .
-మరి ఈ కోతిపిల్ల మీద డాడీకి ప్రేమ ఎక్కువేనా?
కచ్చితంగా, మమ్మీకి, అక్క రూపంలో వున్న నా రెండో తల్లికి, డాడీకి అందరికీ నేనేంటే ఎక్కువ ప్రేమే.
-మరి ఇంత మంది ప్రేమ వుండీ, హిమాలయాలు పట్టుకుని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది.
మీకు తెలిసిందే కదా? నా జీవితంలో వచ్చిన విషాదం. అది మీ అందరికీ తెలియడానికన్నా ముందే నాకు తెలుసుకదా. ఈ పరిస్థితులను ఎవ్వరితో షేర్ చేసుకోలేను. తట్టుకోలేను. నా దగ్గర ఓ డాగ్ వుంది. మౌంటెన్ బ్రీడ్. దాన్ని తీసుకుని సిమ్లా నుంచి నడుచుకుంటూ, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాను.
-ఇంట్లో వాళ్లకి, ప్రెండ్స్ కి చెప్పారా?
ఎప్పటికప్పుడు లోకేషన్ ఆన్ చేసి, షేరింగ్ లో వుంచేవాడిని ఫ్రెండ్స్ వచ్చేవాళ్లు రావచ్చు అనేవాడిని. కొందరు రావడం, ఓ వారం వుండడం, మరి కొందరు రావడం వీళ్లు వెళ్లడం, ఇలా గడిచేది. అదంతా ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. ఎన్ని అనుభవాలో..ఎన్ని పరిచయాలో?
-సో ఎక్కడ, ఎంతలా తిరిగినా మళ్లీ సినిమాల దగ్గరకే వచ్చారన్నమాట.
ఇది నా తల్లి. సినిమా తల్లి. వదిలేసి ఎక్కడకు వెళ్తాను. కమ్ బ్యాక్ అనకండి..హోమ్ కమింగ్ అనుకోండి.
-ఈ సినిమా సంగతేమిటి?
ఇది మంచి సబ్జెక్ట్. ఓ నిర్మాత తెచ్చారు. కానీ నాకు మార్కెట్ లేదు. నా కింద బోలెడు ఫ్లాపులు వున్నాయి. ఇప్పుడు నా సినిమా ఎవడు కొంటాడు. అందువల్ల ఆ రిస్క్ ఏదో నేనే చేస్తా, అంతా బాగుంటే మీకు మరో సినిమా చేస్తా అని చెప్పి, ప్రొడక్షన్ స్టార్ట్ చేసా. థాంక్స్ టు రాజమౌళిగారు. ఇండియా అంతా తెలుగు సినిమా గురించి తెలిసేలా చేసారు. అందుకే నాది కూడా పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నా. లేకపోతే ఖర్చు కిట్టుబాటు కాదు.
-మరి అంత ఖర్చు అంటున్నారు. ఇదంతా సినిమాల్లో సంపాదించినదేనా? డాడీ సపోర్టునా?
సినిమాల్లో సంపాదనా? అంత బొమ్మలేదు. నేనే రిస్క్ తీసుకుని, అవసరం అయితే అప్పు చేసి మరీ చేస్తున్నా.
-మీ వ్యక్తిగతం జీవితంలో జరిగిన విషాదం నుంచి పూర్తిగా తేరుకున్నట్లేనా? ఏం జరిగింది అసలు?
ఏముంది? ఇద్దరు మనుషులు కలవాలి? రెండు మనసులు కలవాలి. అప్పటికే అయిదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. కానీ ఎక్కడో తేడా?
-ఈ సంఘటన తరువాత మిమ్మల్ని మీరు ఏమైనా మార్చుకోవాలి అని అనిపించిందా?
కచ్చితంగా. ఎందుకంటే ఈ విషయంలో తప్పంతా నాదే అంటాను కానీ, అవతల వాళ్ల మీద నెపం వేయను. మనం మారాలి. మనం తగ్గాలి అనే అనుకుంటాను.
-మీరు మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని, మంచు ఫ్యామిలీకి మంచి నట వారసుడిగా మారాలని కోరుకుంటూ..ఆల్ ది బెస్ఠ్ అండ్ అడ్వాన్స్ డ్ బర్త్ డే గ్రీటింగ్స్.
థాంక్యూ అండీ.