ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే..
ఒక్కడు సినిమా చూసి ఇండస్ట్రీలోకి వచ్చాడు. గాభరాపడకుండా, మెలమెల్లగా మీడియం సినిమాలు చేసుకుంటూ వెళ్లున్నాడు. బ్లాక్ బస్టర్ పలకరించింది. దాంతో సాక్షాత్తూ సూపర్ స్టార్ సినిమా చేసే అవకాశం వచ్చింది. అంతకన్నా గోల్డెన్ చాన్స్ ఇంకేం వుంటుంది? కరోనా కల్లోలం ఎప్పుడు ముగుస్తుందా? అని ఆతృతగా ఎదురు చూడడానికి అంతకన్నా రీజన్ ఇంకేం వుంటుంది. అలా ఎదురుచూస్తున్న డైరక్టర్ పరుశురామ్ (బుజ్జి). ఆయనను ఓసారి పలకరిద్దాం.
-హాయ్ అండీ…హైదరాబాద్ లో వున్నారా? నర్సీపట్నం వెళ్లిపోయారా?
ఇక్కడే వున్నానండీ. నిజానికి ప్రతి ఉగాదికి ఇంటికి వెళ్లడం అలవాటు ఆనవాయితీ. కానీ ఈసారి లాక్ డౌన్ ప్రకటించడంతో కుదరలేదు.
-వేచినమ్మకు తేటనీరు అని సామెత. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఇంతకాలం వేచి వున్నందుకు ఏకంగా మాంచి ప్రాజెక్టు దొరికినట్లుందిగా.
అవునండీ. సూపర్ స్టార్ మహేష్ బాబుగారి సినిమామ చేయబోతున్నా.
-చాలా ఎగ్జయిటింగ్ గా వుండి వుంటుంది కదా మీకు?
అవునండీ. ఇండస్ట్రీలోకి వచ్చిందే ఒక్కడు సినిమా చూసి. ఎప్పటికయినా ఆయనతో ఓ సినిమా చేయాలని అసిస్టెంట్ అయిన దగ్గర నుంచే బలమైన కోరిక. ఇన్నాళ్లకు తీరబోతోంది.
-గీతగోవిందం తరువాత వెంటనే అనుకున్న స్క్రిప్ట్, టార్గెట్ ఇదేనా?
అవునండీ.. గీతగోవిందం టైమ్ లోనే ఈ స్క్రిప్ట్ తయారుచేసుకున్నా. మహేష్ బాబు గారు విదేశాలకు వెళ్లడం, నేను కొన్నాళ్లు ఊరికి వెళ్లడం ఇలా అనుకోని గ్యాప్ లు వచ్చేసాయి.
-గీత గోవిందం తరువాత ఎన్ని స్క్రిప్ట్ లు రెడీ చేసారు. ఇదొక్కటేనా?
కాదు..మూడు స్క్రిప్ లు రెడీ చేసా. ఒకటి మహేష్ బాబు గారి కోసం. రెండు చైతూ కోసం నాగేశ్వరరావు. మూడు ఓ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ఠ్
-ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు అన్నీ మంచి సినిమాలే. కానీ ఫ్యాన్స్ మూవ్ మెంట్స్, హీరో ఇమేజ్, కమర్షియల్ లెక్కలు మీకు అడ్డం పడని సినిమాలు చేసారు. ఇప్పుడు ఎలా డీల్ చేస్తారు?
ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ వచ్చే సీన్లు, డైలాగులు రాయలేక కాదు. అవసరం పడలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. నాలో ఆ యాంగిల్ కూడా చూడొచ్చు.
-మీ అన్నయ్య, గురువు పూరి జగన్నాధ్ పోకిరి కి మీరు పని చేసారా?
లేదు. అంతకు ముందు రెండు సినిమాలు చేసాను. అప్పుడే గ్యాప్ ఇచ్చి, వేరే వాళ్ల దగ్గర జాయిన్ అయ్యాను. అలా పోకిరి మిస్ అయ్యాను.
-సాధారణంగా మీ సినిమాల్లో కనిపించే మానవ సంబందాలు, ఫ్యామిలీ ఎమోషన్లు మహేష్ సినిమాలో కూడా వుంటాయా?
అన్నీ వుంటాయి..అవి కూడా రాస్తున్నాను. మంచి సబ్జెక్ట్ ఇది. అందుకే నేను వదలకుండా దాన్నే పట్టుకున్నా, అది నన్ను వదలకుండా వుంది. చాలా మంచి సినిమా అవుతుంది. నవరసాలు వుంటాయి.
-చైతూతో సినిమా మిస్ కావడం పట్ల
మిస్ కాలేదండీ. ఆ సినిమా కూడా చేస్తాను. చైతూ కెరీర్ లో బెస్ట్ సబ్జెక్ట్ అవుతుంది ఆ సినిమా. ఈ విషయంలో చైతూ-నేను ఓ క్లారిటీతో వున్నాం.
-మధ్యలో ఈ లేడీ ఓరియెండెట్ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది.
అది ఓ మంచి పాయింట్ తట్టింది. దాంతో దాన్ని మంచి స్క్రిప్ట్ గా మార్చాను. ఎప్పడయినా చేస్తానేమో?
-ఇంకేటి సర్..కరోనా టైమ్ లో మీకు చేతిలో ఫుల్ స్క్రిప్ట్ వర్క్ వుంది. ఇదే సరిపోతుందేమో?
స్క్రిప్ట్ చేసుకోవడం. బ్యాచులర్ లైఫ్ నుంచి వంట నాకు బాగా అలవాటు. మా ఆవిడకు సాయం చేయడం. అలాగే ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ల సంగతి చూడడం. అన్ని విధాలా గడచిపోతోంది. కరోనా లాక్ పిరియడ్ అన్నది తెలియకుండానే.
-సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తుంటారా?
వెబ్ సిరీస్ లు పెద్దగా చూడను. సినిమాలు మాత్రం చూస్తాను. తెలుగు, హిందీ ఎక్కువ చూస్తాను.
-ఇంకేంటి సర్, విశేషాలు.
ఇంకేం వుందండీ..ఎప్పుడు లాక్ డౌన్ అయిపోతుందా? ఎప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్టు మొదలుపెడతానా అని వుంది.
-థాంక్యూ..బెస్టాఫ్ లక్ అండీ
థాంక్యూ, అండీ
-విఎస్ఎన్ మూర్తి