బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల అశ్రునివాళి అర్పించింది ప్రపంచం. భారతీయ నటుల్లో లెజెండరీ హోదాల్లోని వారు మరణించినప్పుడు వచ్చిన స్పందన కన్నా ఇర్ఫాన్ విషయంలో గొప్పగా ఉండటం గమనార్హం. భారత రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి రాజకీయ నేతలతో మొదలుపెడితే.. సినిమా వాళ్లలో వీళ్లూ వాళ్లూ అని తేడా లేకుండా అంతా ఆ నటుడికి నివాళి ఘటిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉన్నారు.
మరోవైపు విదేశీ మీడియా కూడా ఇర్ఫాన్ మరణం గురించి కథనాలను ఇచ్చింది. ఇర్ఫాన్ ఖాన్ హాలీవుడ్ సినిమాల్లో నటించిన తన ప్రత్యేకతను చాటిన నేపథ్యంలో.. అంతర్జాతీయ మీడియాలో కూడా ఇర్ఫాన్ మరణం గురించి ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఇర్ఫాన్ మరణంపై సంతాప ప్రకటనలు చేశారు.
బాలీవుడ్ నటీనటులు అయితే.. ఒకరని కాదు.. దాదాపుగా అంతా ఇర్ఫాన్ తో తమ అనుబంధాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. కొందరు కన్నీటి పర్యంతం అవుతూ ఇర్ఫాన్ తో తమ బంధాన్ని స్మరించుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల తెలుగు స్టార్ హీరో మహేశ్ బాబు, ఆయన భార్య నమత్రా శిరోద్కర్ స్పందించారు. ఇర్ఫాన్ ఖాన్ తో పని చేసిన అనుభవం ఉంది మహేశ్ కు. నటుడిగా ఇర్ఫాన్ ఖాన్ హవా మొదలయ్యాకా.. ప్రత్యేకంగా ఆయనను మహేశ్ సైనికుడు సినిమాలో విలన్ గా నటింపజేసుకున్నారు. ఆ అనుబంధంతో మహేశ్, నమత్రలు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఇటీవలే ఇర్ఫాన్ ఖాన్ తల్లి మరణించారు. ఇంతలోనే ఆయనా మరణించడం అనేక మంది సినీ ప్రేక్షకులను కూడా కలిచి వేస్తూ ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అనేక మంది వాట్సాప్ స్టేటస్ లు పెడుతూ ఉండటం, ఇంత మంది ఆయన మరణం పట్ల స్పందిస్తూ ఉండటం.. ఆ నటుడికి దక్కిన గొప్ప నివాళి అని చెప్పవచ్చు.