ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ను అడ్డుకోవడం కంటే ఎల్లో వైరస్ ను అడ్డుకోవడం కష్టంగా ఉందంటున్నారు మంత్రి కన్నబాబు. కరోనా వైరస్ లక్షణాలు స్పష్టంగా తెలుస్తున్నాయి కానీ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తున్న ఎల్లో వైరస్ లక్షణాలు మాత్రం కనిబెట్టడం కష్టంగా ఉందంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
“మే 15 నుంచి వైఎస్ఆర్ రైతుభరోసా పథకాన్ని అమలు చేయబోతున్నాం. ఈరోజు చంద్రబాబు మీడియాకు ఓ లేఖ రిలీజ్ చేశారు. 4 లక్షల లబ్దిదారుల్ని తొలిగించామని బాబు ఆరోపిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు చంద్రబాబు అన్నట్టుంది. లాస్ట్ టైమ్ 46లక్షల 50వేల మంది లబ్దిదారుల్ని గుర్తించి సహాయం చేశాం. ఇప్పుడు అదనంగా మరికొంతమంది లబ్దిదారుల్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నాం. అంతలోనే 4 లక్షల మంది తొలిగించామని చంద్రబాబు ఎలా చెబుతారు”
వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే, తెలుగుదేశం కార్యకర్తలే కొనుగోలు చేసి పంచుతున్నారంటూ చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. అసలు ఏ తెలుగుదేశం నాయకుడు బయటకొచ్చి పంచుతున్నారో చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు.
“మేం ఆల్రెడీ పనులు చేస్తున్నాం. కానీ అవే పనులు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు లేఖలు రాస్తారు. 2 రోజులు పోయిన తర్వాత ఆయన డిమాండ్ కే మేం స్పందించినట్టు ప్రచారం చేసుకుంటారు. గుజరాత్ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మత్స్యకారుల్ని తీసుకొస్తే, మా వల్లే ఇదంతా జరిగిందని ప్రచారం చేసుకుంటారు. తమిళనాడు సీఎంతో మాట్లాడితే ఈయన మధ్యలో ఉత్తరం రాశారంట. అసలీ ఉత్తరాల గోలేంటో అర్థంకాదు. సీఎం చేస్తున్నదంతా పోతోంది. మధ్యలో అంతా తనే దగ్గరుండి చేస్తున్నట్టు చెబుతున్నారు.”
క్వారంటైన్ కేంద్రాలపై లేనిపోని విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. హైదరాబాద్ లోని తన ఇంట్లో కూర్చునే బదులు.. రాష్ట్రంలోని ఏ క్వారంటైన్ కేంద్రాన్నయినా సందర్శించవచ్చని సవాల్ విసిరారు కన్నబాబు.