దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఎంతలా అంటే.. దేశంలో దాదాపు మూడో వంతు కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. 31 వేలకు పైగా కేసుల్లో 9 వేలకు పైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. కరోనాతో మరణించిన వెయ్యి మందిలో మహారాష్ట్రకు చెందిన వారే 400 మంది వరకూ ఉన్నారు. ఇలా కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రంగా నిలుస్తోంది మహారాష్ట్ర.
కట్ చేస్తే.. మరో రకంగా వార్తల్లోకి ఎక్కుతోంది ఈ రాష్ట్రం. అదే రాజకీయ అనిశ్చితి దిశగా పయనిస్తూ ఉండటం. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో నెల రోజుల పాటు పదవిలో ఉండే అర్హత కనిపిస్తూ ఉంది. ఆయన శాసన సభలో కానీ, మండలిలో కానీ సభ్యుడు కాకపోవడంతో.. మరో నెల రోజులు మాత్రమే సీఎంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ లోపే ఆయనను మండలికి నామినేట్ చేయాలని, ఠాక్రేతో ఖాళీ ఉన్న మండలి స్థానం ఒకదాన్ని భర్తీ చేయాలని గవర్నర్ కు మహారాష్ట్ర కేబినెట్ ఇప్పటికే సూచించింది. అయితే బీజేపీ నియమిత గవర్నర్ కోష్యారీ మాత్రం ఆ విషయంలో స్పందించడం లేదు. కనీసం ఏడాది వ్యవధి అయినా పదవీ కాలం లేకపోతే ఎన్నికలు జరగడం కానీ, నామినేట్ చేయడం కానీ ఉండదని అంటూ బీజేపీ వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో గవర్నర్ భారతీయ జనతా పార్టీ వాదనకు అనుగుణంగానే ఉద్ధవ్ ను మండలికి నామినేట్ చేయడం లేదనే వాదన మొదలైంది.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఫోన్ కూడా చేశారట ఉద్ధవ్ ఠాక్రే. రాజకీయ అనిశ్చితిని సృష్టించాలని చూస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారట. తమ రాష్ట్రం కరోనాతో తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటూ ఉంటే, ఇలాంటి సమయంలో ఇలాంటి రాజకీయాలు భావ్యమా? అని మోడీని ప్రశ్నించారట ఠాక్రే.
మరోవైపు మహారాష్ట్ర కేబినెట్ భేటీ కావాలనుకుంటోందట, ఈ పాటికే మండలి ఎన్నికలు జరగాల్సింది. అయితే లాక్ డౌన్ వల్ల ఆ ఎన్నికలు జరగలేదు. గవర్నర్ సహకరించని పక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈసీని కోరాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందట. అందుకు గానూ ఈ పాటికే కేబినెట్ భేటీ జరగాల్సి ఉందట. అయితే చివరగా ప్రధానితో ఒకసారి మాట్లాడి చూడాలన్నట్టుగా ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నించినట్టుగా ఉన్నారు. ఒకవైపు ఆ రాష్ట్రం కరోనా చేత తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. ఇలాంటి రాజకీయ రచ్చ ఏమిటో!