విజయ్ దేవరకొండ పాతిక లక్షల కార్పస్ ఫండ్ తో స్టార్ట్ చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ అంకెలు చిత్రంగా వున్నాయి. అస్సలు ఆదాయం, అలాగే అస్సలు సేవింగ్స్ లేని వాళ్లు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే వెయ్యి రూపాయల మేరకు మాగ్జిమమ్ సరుకులు ఇప్పిస్తామని చెప్పారు. దాంతో ఇప్పటికి 63 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
వీరందరికీ వెయ్యి రూపాయల వంతున ఇవ్వాలంటే కనీసం ఆరుకోట్ల రూపాయలకు పైగా కావాలి. కానీ విజయ్ కేటాయించింది పాతిక లక్షలే. ఆయన అభిమానులు సమకూర్చింది 43 లక్షల వరకు వుంది. మొత్తం కలిపి 68 లక్షల మేరకు అయింది. వీటితో 6800 మందికి వెయ్యి వంతున ఇచ్చేయవచ్చు.
కానీ అలా కూడా చేయడం లేదు. నాలుగు రోజుల్లో ఇప్పటికి గట్టిగా 1066 మందికి మాత్రం ఇచ్చారు. అంటే దాదాపు పదిలక్షలు ఖర్చు చేసారు. దరఖాస్తు చేసుకున్న 63 వేల మందిలో ఫౌండేషన్ వాలంటీర్లు కాంట్రాక్ట్ చేసింది జస్ట్ 3500 మందిని మాత్రమే. ఆ మూడు వేల అయిదు వందల మందిలో ఇచ్చింది వెయ్యి మందికి మాత్రమే.
ఈ లెక్కన చూస్తుంటే మరో నెలరోజుల పాటు ఈ ఫండ్ వ్యవహారం ఇలా సాగేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. రోజూ కొంచెం కొంచెం మందికి ఇస్తూ, కరోనా టైమ్ ముగిసే వరకు చేయాలని ప్లాన్ లా వుంది. కానీ పాపం, దరఖాస్తు చేసుకున్నవారు తమకు ఫోన్ వస్తుందని ఆశతో చూస్తుంటారు. కానీ మహ అయితే మరో పది వేల మందికి మించి సహాయం అందేలా కనిపించడం లేదు. అంటే దరఖాస్తు చేసుకున్నవారిలో యాభై వేలకు పైగా జనాలకు నిరాశే.
లేదూ దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఇవ్వాలంటే విజయ్ ఓ సినిమాకు తీసుకునే రెమ్యూనిరేషన్ మొత్తం దీనికే కేటాయించాలి. లేదూ అంటే స్క్రూటినీ పేరుతో ఇలా రోజుకు ఓ వంద, నూటాయాభై మందికి ఇచ్చుకుంటూ, డ్రాగ్ చేసుకుంటూ వెళ్లాలి.