కరోనా లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా సామాజిక దూరం అనేది ప్రతి పౌరుడికీ తప్పనిసరి కానుంది. వ్యక్తిగత వాహనాల సంగతి సరే, మరి ప్రజా రవాణా వ్యవస్థ మాటేంటి? అక్కడ కూడా సామాజిక దూరం పాటించాలంటే సాధ్యమవుతుందా? దీనిపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి.
రైల్వే విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా ఒకటే నియమ నిబంధనలుంటాయి. టికెట్లు కూడా పరిమిత సంఖ్యలో ఇస్తారు, రైల్వే ప్రయాణం కంటే.. స్టేషన్లలో జరిపే పరీక్షలకే ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. లాక్ డౌన్ తర్వాత రైలు ఎక్కాలంటే బయల్దేరే సమయానికి కనీసం 2 గంటల ముందైనా స్టేషన్ కు చేరుకోవాలి. దీంతో రైళ్ల వైపు మొగ్గుచూపేవారి సంఖ్య అంతంతమాత్రమేనని తెలుస్తోంది.
ఇక ఆర్టీసీ విషయానికొద్దాం. ఆర్టీసీ బస్సుల్లో 100 సీట్లుంటే కేవలం 50మంది ప్రయాణికులనే అనుమతించాలనేది ప్రభుత్వం ఆలోచన. అంటే ఆటోమేటిగ్గా ఆక్యుపెన్షీ రేషియో 50శాతానికి పడిపోతుందనమాట. దీనికోసం అనివార్యంగా రేట్లు పెంచాలి. ఈమేరకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు నివేదికలు కూడా సిద్ధం చేశారని సమాచారం.
ఇక ఏపీ విషయానికొద్దాం. కరోనాకి కాస్త ముందే ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడం ఆ సంస్థ ఉద్యోగులకు గొప్పవరం. ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ కావడంతో.. లాభనష్టాలతో వారికి పనిలేదు. ఆక్యుపెన్షీ రేషియోతో వారికి సంబంధం లేదు. కష్టమో, నష్టమో ప్రభుత్వమే భరిస్తుంది, ఏపీలో ఇటీవలే చార్జీలు పెంచారు కాబట్టి.. తక్కువ సమయంలో మరోసారి ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం ఇష్టపడకపోవచ్చు. అందులోనూ సీఎం జగన్ కి అది సుతరామూ ఇష్టం లేదని తెలుస్తోంది.
ఎలా చూసుకున్నా.. తెలంగాణ ఆర్టీసీతో పోల్చి చూస్తే, ఏపీలో ఉద్యోగులకు మానసిక ఆందోళన లేదనేది మాత్రం వాస్తవం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ నష్టాల్లోనే ఉన్నా.. తెలంగాణలో అది ప్రత్యేక సంస్థ కావడంతో ఉద్యోగుల జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, కొత్త ఊద్యోగాల భర్తీపై సంస్థ ఆర్థిక పరిస్థితి ప్రభావం చూపుతుంది.
ఏపీ విషయానికొస్తే పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది కాబట్టి ఉద్యోగులకు ఆ బాధలు లేవు. లాక్ డౌన్ ప్రభావం నుంచి ఆ విధంగా ఏపీఎస్సార్టీసీ ఉద్యోగులు బైటపడ్డారనుకోవాలి. కానీ సంస్థ నష్టాలు మాత్రం మూడింతలు పెరిగే ఆస్కారం ఉంది. అది జగన్ సర్కార్ కు మరింత అదనపు భారం కాబోతోంది.