అహంకారానికి తాను కేరాఫ్ అడ్రస్ అని దిగ్విజయసింగ్ నిరూపించుకోవడం ఇవాళ కొత్త కాదు. కానీ.. ఇప్పుడు మళ్లీ ఆయన తెలుగువారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు. అందరినీ సంప్రదించే నిర్ణయం తీసుకున్నాం అని, తెలంగాణ విషయంలో వెనక్కు తగ్గే సమస్యే లేదని, ప్రక్రియ కొనసాగుతోందని మామూలు విషయాలే ఆయన మాట్లాడారు గానీ.. ఉద్యమం గురించి మాట్లాడినదే అభ్యంతరకరంగా ఉంది.
ఇప్పటికే ఉద్యమం దాదాపుగా వెనక్కు తగ్గిందని డిగ్గీరాజా వెటకారాలు వెలిబుచ్చారు. ఉద్యమకారులతో సంప్రదింపులకు కూర్చున్న ముఖ్యమంత్రి స్పాట్ లోంచి ఫోను చేస్తే.. బిల్లు రెండుసార్లు శాసనసభకు కచ్చితంగా వస్తుందని హామీ ఇచ్చి, తనమాటగా ఉద్యోగులకు చెప్పమని అంటూ.. వారితో విరమింప జేసిన వ్యక్తి డిగ్గీ. ఇప్పుడాయన ఉద్యమం వెనక్కు తగ్గిందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఈ మాటలు చాలా పొగరుగా కనిపిస్తున్నాయి.
దిగ్విజయసింగ్ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
‘వింటినారి వెనక్కు వెళ్లింది కదా’ ని మురిసిపోయావంటే డిగ్గీ!
అది ఒక్కసారిగా చేయగల అహంకార నాదానికి
నీ గుండెలు అవిసిపోతాయ్!
అది శరపరంపరంగా సంధించే అస్త్రాలన్నీ నాటుకున్నాయంటే..
నిలువెత్తుగా నీవు కప్పుకున్న అహంకారపు తొడుగు..
ఆ తూట్లు తట్టుకోలేక నిలువెత్తు జల్లెడగా మారుతుంది గుర్తించు!
సమైక్య ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే నైచ్యం వద్దు
వెనక్కు తగ్గినదంటూ రెచ్చగొట్ట వెటకారాలు వద్దు
విరమణలోని ఔచిత్యం, సహృదయతలను గుర్తించు!!
కాదని విర్రవీగితే…
అహంకార మదాంధ భరితమైన నీ ఒంటెత్తు పోడకలను
అవశ్యంగా మన్ను కరిపించగలదు.. ఈ తెలుగుజాతి!!