తెలంగాణకు ఇప్పట్లో మోక్షం లభించే అవకాశాలు కనపడడం లేదు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన వద్దకు సీమాంధ్ర మంత్రులు వచ్చినప్పుడు అక్కడి పరిస్థితి తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ప్రజలు నిజంగా వీధుల్లోకి వస్తున్నారని పళ్లం రాజు ఆమెకు వివరించారు. విద్యుత్ సమ్మె తర్వాత సమ్మెకాక ఢిల్లీకి తెలిసి వచ్చింది. దీనితో 70 రోజులుగా మౌన ప్రేక్షకులుగా ఉన్న కాంగ్రెస్ పెద్దలు కదిలారు.
సోనియాగాంధీ వెంటనే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌ను పిలిచి మాట్లాడారు. ముందు పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏమిచేయాలో చూడమని కోరారు.నిజానికి అప్పటికే కేంద్ర కేబినెట్ తెలంగాణపై నోట్‌ను ఆమోదించింది. అక్టోబర్ 3న జరిగిన 12 విధివిధానాలను రూపొందించింది. ఆరువారాల్లోపు తెలంగాణపై మంత్రుల బృందం తన ప్రతిపాదనలను సమర్పించాలని కేబినెట్ నిర్ణయించింది. కాని సరిగ్గా నాలుగురోజుల్లోనే కేంద్రం తన వైఖరిని మార్చుకుంది. ఈ విధివిధానాలను మార్చి 11 విధానాలకే కుదించింది. తెలంగాణపై బిల్లు తయారీకీ గడువును ఎత్తివేసింది. ఇందుకు కారణం సోనియాకు, ఢిల్లీ పెద్దలకు సీమాంధ్రలో జరిగిన పరిణామాల వాస్తవరూపం తెలియడమే.
తాజా నిర్ణయాల ప్రకారం సీమాంధ్రలో పరిస్థితులు చక్కబడే వరకూ తెలంగాణ ప్రక్రియ గురించి కేంద్రం పట్టించుకోదు. నిదానంగా తమ పని నిర్వహించాలని సోనియా మంత్రులను ఆదేశించారు. పైగా జీవోఎంలో మంత్రుల సంఖ్యను కూడా కుదించి రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక పాత్ర పోషించాల్సిన ప్రణాళికాసంఘం, జలవనరులు, మానవ వనరులు, పట్టణాభివృద్ధి, న్యాయమంత్రిత్వ శాఖలను ఎత్తివేశారు. ఇక జీవోఎం దూకుడుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రధానమంత్రి స్వయంగా ఈ బృందం పనితీరును పర్యవేక్షించాలని నిర్ణయించారని, అందుకే ప్రత్యేక ఆహ్వానితుడుగా తన కార్యాలయానికి చెందిన మంత్రి నారాయణస్వామిని చేర్చారని అంటున్నారు. జీవోఎంలో కొత్తగా చేర్చిన వారిలో మెజారిటీ మంత్రులకు ఏదోరకంగా ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం ఉన్నది. జైరామ్ రమేశ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి. ఆజాద్, దిగ్విజయ్ సింగ్, మొయిలీ, నారాయణస్వామి రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించిన వారే. ఇక షిండే రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. ఆంటోనీ, చిదంబరంలకే రాష్ట్రంతో పెద్దగా సంబంధం లేదు. పైగా వీరంతా రాజకీయ హేమాహేమీలు. సోనియాకు విధేయులు. రాష్ట్ర నేతలతో సంబంధం ఉన్నవారు. దేన్నైనా నాన్చడంలో వీరు సిద్దహస్తులు. ఏదోరకంగా తిమ్మిని బమ్మిని చేయగలరని సోనియా విశ్వసిస్తున్నారు.
జీవోఎం గడువు తగ్గించి, రాజకీయ మంత్రులను జీవోఎంలో చేర్చిన రోజే కాంగ్రెస్ తన వైఖరి స్పష్టం చేసింది. వారం రోజుల క్రితం తెలంగాణపై వెనక్కు వెళ్లే ప్రసక్తి లేదని చెప్పిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి పిసిచాకో మాట మార్చేశారు. కావాలనే తాము జీవోఎం గడువు ఎత్తివేశామని, వచ్చే ఎన్నికలలోపు తెలంగాణను ఇస్తామో లేమో చెప్పలేమని ఆయన పరిస్థితులు మారుతున్నాయని ఆయన చెప్పారు. ‘పరిస్థితులు మారుతున్నాయి. అవి చేయిదాటితే ఏం చేస్తాం? మాకూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నాం కాని గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడులేవు. కొత్తగా తలెత్తిన సమస్యలను మేం ఎలా పరిష్కరిస్తాం అన్న దానిని బట్టి, ఇతర పార్టీలు ఎలా సహకరిస్తాయి అన్నదానిని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. పరిస్థితిలు దిగజారితే.. కళ్లు మూసుకుని కూర్చోలేం కదా? వాటిని పరిష్కరించాలి. అయితే, తెలంగాణ ఏర్పాటు చేయాలన్న పార్టీ నిర్ణయం మాత్రం తిరుగులేనిది. ఎన్నికలకు ముందు దానిని అమలు చేస్తామా? తర్వాత అమలు చేస్తామా? అంటే నేనేం చెప్పలేను. ఇది ముందు జరగొచ్చు. తర్వాత కూడా కావచ్చు.. 2014 ఏప్రిల్ వరకూ ఎందుకు ఆగాలి? ముందే చేయగలిగితే చేస్తాం. అయినా, ఎన్నికలు మాకు ప్రమాణికం కాదు…’ అని ఆయన చెప్పారు. ఆయన మాటాల్లో రకరకాల అర్థాలున్నాయి.
ఇక తెలంగాణపై జీవోఎంను ఏవిధంగా ఏర్పాటు చేయాలన్నది ప్రధానమంత్రి అధికార పరిధిలోనిదని, ఆయన దాని గడువును కూడా మార్చవచ్చునని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. దీనితో తెలంగాణ ప్రక్రియ వేగం తగ్గిపోయినట్లేనని తెలుస్తోంది. మరోవైపు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా జీవోఎం సిఫారుసులను తయారు చేసేందుకు సమయం పడుతుందని చెప్పారు. సీమాంధ్ర ప్రజల ఆందోళన, మంత్రుల రాజీనామా మాత్రమే కాకుండా సీమాంధ్ర ప్రజల సమస్యలనుకూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి ప్రకటించడం కూడా కేంద్రంపై ప్రభావం చూపిందని తెలుస్తున్నది. సీమాంధ్రలో గందరగోళం తగ్గకుండా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే తాము మద్దతునివ్వలేమని బిజెపి నేతలు సంకేతాలు ఇస్తున్నారు.
దీనితో కేంద్రం ముందు రకరకాల మార్గాలున్నాయి. 2014 ఎన్నికలలోపు తెలంగాణ ఇచ్చితీరాలని సోనియా అంటున్నారు. అంటే ఇంకా ఏడెనిమిది నెలల సమయం ఉన్నది. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణపై బిల్లు ప్రవేశపెట్టాలని నిబంధన ఏమీ లేదు. వచ్చే మూడునెలల్లో అంటే డిసెంబర్ ఆకరి వరకు జీవోఎం సమస్య పరిష్కారాలపై దృష్టి కేంద్రీకరించవచ్చు. ఈ మూడు నెలల్లో సమస్యను పరిష్కరిస్తే జనవరిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కానీ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో కానీ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టవచ్చు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించి ఆరునెలల్లోపే రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపించే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి పాలనను పార్లమెంట్ ఆమోదించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆరునెలల్లోపు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతాయి కనుక. ఈ లోపు రాష్ట్ర అసెంబ్లీ నుంచి తీర్మానం కూడా తెప్పించుకోవాలని కేంద్రం భావిస్తోంది. అసెంబ్లీలో జరిగిన చర్చలను బట్టి జీవోఎం తన ప్రతిపాదనలనుకూడా మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఏమైనప్పటికీ ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఐదు నెలలపాటు తెలంగాణ ప్రక్రియ ఆగిపోయినట్లే. ఈ ఐదు నెలల పాటు సీమాంధ్రలో ఉద్యమం కొనసాగే అవకాశం లేదు. ఇప్పటికే సీమాంధ్ర ఉద్యమం పట్ల ప్రజల్లో అసహనం మొదలైందని, ఉద్యోగుల్లో కూడా జీతాలు లేనందువల్ల చీలికలు వస్తున్నాయని కేంద్రానికి సమాచారం ఉన్నది. మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్షలకు పెద్దగా ప్రతిస్పందన రాకపోవడం కాంగ్రెస్ పెద్దలకు సంతోషంగా ఉన్నది. ఈ ఇద్దరు నేతలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చారన్న విషయాన్ని కాంగ్రెస్ పలుసార్లు బయటపెట్టింది. సీమాంధ్ర నుంచి మరో పార్టీ కూడా వస్తుందని, ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీలిస్తే తమకే లాభమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.