విజయదశమి అంటే కేవలం దుర్గామాతను కొలిచే ఉత్సవం మాత్రమే కాదు. సకల శుభప్రదాయకమైన పర్వదినంగా హిందూధర్మం అనుష్టిస్తుంది. అనేకానేక శుభకార్యాలు.. కార్యరూపం దాల్చిన విజయవంతం అయిన శుభ ఘడియలు విజయదశమి పర్వదినం నాడే అని చారిత్రక పౌరాణిక ఉదంతాలు మనకు తెలియజెబుతాయి. వ్యక్తిత్వ గుణధాముడైన రాముడు.. దుర్లక్షణాలకు దుర్గుణాలకు దశముఖ ప్రతీకగా ఉన్నటువంటి రావణుని సంహరించిన సుముహూర్తం కూడా విజయదశమి నాడే అని మనకు తెలుసు. అందుకు గుర్తుగానే.. విజయదశమి పర్వదినం నాడు దేశవ్యాప్తంగా రావణ సంహారం ను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. అజ్ఞాత వాసంలో నిద్రాణంగా ఉండిపోయిన తమ లోని శక్తులను పునరుజ్జీవింపజేయడానికి ప్రతీకగా.. పాండవ వీరులు దాచిఉంచిన ధనుర్బాణాలను తిరిగి చేపట్టి.. శత్రుభీకరమైన సమరసింహనాదాలతో ఉత్తర గోగ్రహణాన్ని నెగ్గిన రోజు కూడా ఇదేనంటారు. అందుకే వారు ఆయుధాలను దాచి ఉంచిన శమీవృక్షపు పూజకూడా ఇవాళ విశిష్టతల్లో ఒకటి.
ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం దశమినాటికి శ్రవణా నక్షత్రం కలవడమే విజయవంతమైనదని పురాణాలు చెబుతాయి. ఇతరత్రా పట్టింపులు ఏమీ లేకుండానే విజయదశమి పర్వదినంనాడు ఏ కార్యాన్ని ప్రారంభించినా అందులో విజయం తథ్యం అని పెద్దలు చెబుతారు.
విజయదశమి పర్వదినంలో ప్రధానంగా రెండు అంశాలు మనకు స్ఫురిస్తాయి. ఒకటి రావణ సంహారం అయితే రెండు శమీపూజ.
ఈ దృష్టాంతాలను మనం పరిశీలిస్తే…
1 : ఆదిత్య హృదయం ` శ్రీరామ విజయం
రామరావణ యుద్ధం ప్రళయభీకరంగా జరుగుతున్న వేళ అది. దశకంఠాలను ఉత్తరించినా.. నిహతుడు కాని రావణుడితో యుద్ధంలో రామచంద్రుడు అలసి ఉన్న వేళ! అగస్త్య మహాముని ఆయన వద్దకు వస్తాడు. పరిస్థితిని గమనించి రామునిలో స్ఫూర్తిని నింపుతాడు. బాహ్యశత్రువును జయించే ముందు.. ముందు అంత:శ్శత్రువులను జయించడం అవశ్యం. రావణుడుతో యుద్ధంలో రాముడు అలసి ఉన్నాడు. నిస్పృహలో ఉన్నాడు. తొలుత ఈ అంత:శ్శత్రువుల దునుమాడడానికి రామునిలో సమరస్ఫూర్తిని ఉద్దీపనం చేస్తూ ‘సర్వశత్రు వినాశనమైన ఆదిత్య హృదయం’ను బోధిస్తాడు అగస్త్యుడు. ప్రత్యక్ష పరమాత్ముడైన సూర్యభగవానుని స్మరించి సమరోత్సాహిగా మారమంటాడు.
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ:
చీకటిని పోగొట్టే వాడికి నమస్కారం, శత్రువులను దునుమాడిన వాడికి నమస్కారం, గొప్ప తేజస్సు గల వానికి నమస్కారం, స్వయం ప్రకాశం గలవానికి, దేవునికి జ్యోతిష్యపతికి నమస్కారం అని ఈ ఆదిత్య హృదయం లోని శ్లోకం చెబుతుంది.
పరమవాక్కు యొక్క సత్యత్వాన్ని, పరమాత్ముని యొక్క నిత్యత్వాన్ని మాత్రమే శ్లోకం చెబుతుంది. దాని భాష్యాన్ని.. మన:కాల స్థితిగతులను బట్టి మనం నిర్దేశించుకోవాలి. మనలోని బద్ధకం, అలసట, నిస్పృహలే ‘తమం’. అరిషట్వర్గాలుగా పురాణాలు ప్రవచించినవే శత్రువులు. వీటిని నిర్మూలించే పరమాత్ముడిగా సూర్య భగవానుడిని స్మరించమని.. ఆదిత్య హృదయం రాముడిని నిర్దేశిస్తుంది. అగస్త్యబోధ ముగిసిన పిమ్మట.. రాముడు పునరుత్తేజితుడై.. ఆదిత్యహృదయం అందించిన అంత:తేజోధారిjైు… సమరసీమకు కదులుతాడు. దశకంఠుని నిహతుడిని చేసి.. విజయదశమి పర్వదినం వైశిష్ట్యాన్ని పెంచుతాడు. అటువంటి ఆదిత్య హృదయం నిత్య ప్రాత:స్మరణీయమైనది. శుభకామనతో సర్వజనులు అనుష్ఠించదగినది.
2 : శమీవృక్షం… పాండవ పక్షం
పాండవ వీరులు శమీ వృక్షం నుంచి తిరిగి ఆయుధాలను పొంది సమరసీమకు కదిలిన పర్వదినం విజయదశమి. ఈ రోజున శమీ వృక్షం అంటే జమ్మిచెట్టును పూజించడం ఆనవాయితీ. విరాటుని కొలువులో అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు.. తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచారు. వారు తిరిగి ఆయుధాలను ధరించిన రోజు ఇది. శమీ వృక్షం రూపంలోని ‘అపరాజిత’ దేవినిపూజించి పాండవులు అజ్ఞాతంలోంచి తిరిగి యోధులుగా కార్యక్షేత్రంలోకి ఉరికి, కౌరవసేనలపై విజయం సాధించిన రోజు ఇది. రాముడు కూడా రావణ వధ ముగించి శమీ పూజ చేసిన తర్వాత అయోధ్యకు పయనమైనట్టు పురాణాలు చెబుతాయి.
పాండవోదాహరణ లోంచి మనం తెలుసుకోవాల్సిన భాష్యం ఏమిటో పరిశీలిద్దాం. అజ్ఞాతంలోని పాండవులు దాచిఉంచిన ఆయుధాలంటే.. అవి మనలో నిద్రాణంగా ఉండే అంత:శక్తులకు ప్రతీకలు. కాలప్రభావం, పరిస్థితుల ప్రభావం.. కారణాలు ఏమైనా కావొచ్చు. మనను అలక్ష్యం, బద్ధకం, నిస్పృహ, వైరాగ్యం, వైమనస్యం వంటివి ఆవరించి.. కార్యవిముఖులను చేసే పరిస్థితులు ఏదో ఒకసారి తటస్థిస్తూనే ఉంటాయి. వీటినుంచి మనల్ని జాగృతం చేసి.. విజయోత్సాహాన్ని ఉద్దీపింపజేసి.. కార్యక్షేత్రంలోకి ఉపక్రమింపజేసేదే విజయదశమి. పాండవులు జమ్మిచెట్టు మీది ఆయుధాల్ని తిరిగి అందుకోవడమే అందుకు ప్రతీక.
అందుకే జమ్మిచెట్టును కూడా విశేష స్తోత్రాలతో పూజిస్తారు.
‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.’’
అని ప్రతీతి.
శమీ వృక్షం పాపాన్ని శమింపచేస్తుంది. శత్రునాశనం చేస్తుంది. అర్జునుని ధనస్సుకు ఆశ్రయమిచ్చిన, శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించిన వృక్షమిది. నిర్విఘ్నంగా కార్యసాధన చేయగలుగుతుంది.. అని అంటారు. అందుకే దసరా వేడుకల్లో జమ్మిచెట్టు పూజకు ఎంతో విశిష్టత ఉంటుంది.
శత్రు వినాశనాన్నే మనం వేడుకోవాలి…
విజయదశమి అంటేనే సకల విజయాలను అందించేది అనడంలో సందేహం లేదు. అయితే విజయదశమి నాడు ఆదిత్య హృదయం పఠించినా, జమ్మిచెట్టును మనముంటున్న స్థలకాలాలను బట్టి అవి మనకు అందుబాటులో లేకపోయినా.. ఈ పర్వదినం స్ఫూర్తిని అందుకుంటూ.. వాటిలోని అంత:సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. విజయదశమి పర్వదినం నాడు భగవంతుడిని ప్రార్థించడంలో సర్వశత్రు వినాశనాన్ని మనం కోరుకోవాలి.
శత్రువులను ఎంచుకోవడమే ఇక్కడ కీలకమైన విషయం. మనతో తగాదా పెట్టుకున్న వాళ్లూ, ఆఫీసులో బాసులూ, ప్రేమించిన ప్రియురాలి సోదరులూ, అప్పులిచ్చినవాళ్లూ, ఆడిపోసుకునే వాళ్లూ.. శత్రువులంటే వీళ్లు కాదు. ఇలాంటి ఐహిక, బాహ్య శత్రువులను లక్ష్యంగా ఎంచుకుని విజయాన్ని కోరుకోవడం అంటే విజయదశమి ఔన్నత్యాన్ని మనం లోకువ కట్టినట్టే. మనలోని అంత:శ్శత్రువులపై నిత్యమైన విజయాన్ని సాధించే ధైర్యస్థైర్యాలను ప్రసాదించమని మనం విజయదశమి నాడు వేడుకోవాలి.
అంత:శత్రువులంటే తెలియనివారు ఉండరు. ఈ శత్రువులు మనలోనే, మనతోనే నిత్యం ఉంటారు. ఎవరికి అవకాశం దొరికినప్పుడు వారు మనల్ని జయించి.. రాక్షసానందం పొందుతూ ఉంటారు. మనలోనే ఉండే అలాంటి శత్రువులపై శాశ్వతమైన విజయం దక్కించుకోగలిగితే.. అది మనల్ని సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుందనడంలో సందేహం ఎందుకుంటుంది. అందుకే అంత:శ్శత్రువుల పై విజయానికి ఈ పర్వదినాన్ని లక్ష్యించాలి.
ఇంతకూ ఆ శత్రువులెవరో చెప్పలేదు. అరిషట్వర్గాలనే ఆరు దుర్గుణాలే.. ప్రతి మనిషికీ అంత:శ్శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఏ వ్యక్తి.. ఏ పరాజయానికి చేరుకున్నా సరే.. ఆ పతన ప్రస్థానం మూలాలు ఈ ఆరింటిలో ఒక చోట ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ ఆరుగురు శత్రువుల మీద గెలవడం మనకు అవసరం.
నిత్య ప్రాత:స్మరణీయమైనదిగా ఆదిత్యహృదయాన్ని పఠించినా, సర్వశుభ` సకల విజయ ప్రదాయనిగా శమీవృక్షాన్ని పూజించినా.. మనలోని అంత:చేతన అరిషట్వర్గాలపై విజయాన్ని నిబద్ధతతో లక్ష్యించాలి. వీటిని జయించిన వారికి ఇక శత్రువులంటూ ఉండరు. శత్రువే లేనివాడికి సకల విజయాలూ… సర్వశుభాలూ నిత్యం సమకూరుతుంటాయి.
మనలోని అంత:చేతనకు అరిషట్వర్గాలపై విజయోస్తు!
సర్వులకు సకల శుభ కాముకులకు కల్యాణమస్తు!!
భగవదానుగ్రహ ప్రాప్తిరస్తు! శుభమస్తు!!
ఆదర్శిని సురేశ్