కాగ్ రిపోర్టులో 2 జి స్కామ్ గురించి, కోల్ గేట్ గురించి రాసినది బాగానే ప్రచారంలోకి వచ్చింది కానీ రాజస్థాన్‌లోని బార్మర్‌లోని కెయిర్న్ ఇండియా వారి క్రూడ్ ఆయిల్ ప్లాంట్ ఉత్పత్తిని ప్రయివేటు సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టిన వైనం గురించి రాసినది తగినంతగా వెలుగులోకి రాలేదు. భారతదేశంలోని మొత్తం క్రూడ్ ఆయిల్‌లో నాలుగో వంతు అక్కడ తయారవుతుంది. అయితే దానిలో సల్ఫర్ తక్కువ, వాక్స్ ఎక్కువ. దాన్ని శుద్ధి చేసుకుని వాడుకుంటే చాలా ప్రయోజనాలుంటాయి కానీ శుద్ధి చేసే సౌకర్యాలు పబ్లిక్ సెక్టార్ రిఫైనరీలకు లేకుండా చేసింది యుపిఏ ప్రభుత్వం. అక్కడ ఏటా తయారయ్యే 7.5-8.0 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌లో ప్రభుత్వానికి చెందిన రిఫైనరీలైన ఇండియన్ ఆయిల్, ఎచ్‌పిసిఎల్, బిపిసిఎల్, ఎంఆర్‌పిఎల్‌లు 3.5-4.20 మిలియన్ టన్నులు తీసుకోవాలని 2008 ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం వీటిలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఒక్కటే 1.5 మిలియన్ టన్నులు తీసుకుంటోంది. తక్కినదంతా అంటే 80% గత ఐదేళ్లగా రిలయన్సు, ఎస్సార్ వంటి ప్రయివేటు కార్పోరేట్లకు భారీ డిస్కౌంట్‌తో అమ్ముడుపోతోంది. తక్కిన ప్రభుత్వ సంస్థలు ఎందుకు తీసుకోవడం లేదంటే దానికో కథ వుంది. 2009 సెప్టెంబరులో ప్రభుత్వం యీ పబ్లిక్ సెక్టార్ రిఫైనరీలకు చెప్పింది ''మీరు రాజస్థాన్ క్రూడ్ ఆయిల్ ఏ ధరలో తీసుకోవాలో మేం తర్వాత తేలుస్తాం. అప్పటిదాకా ఏదో తాత్కాలికమైన రేటుకి మీరు కొంటూ వుండండి.'' అని. వాళ్లు ''సరే కానీ, ఆ క్రూడ్ వాడుకోవాలంటే మా రిఫైనరీలలో యంత్రాలను ఆధునీకరించాలి. లేకపోతే దానిలోని మైనాన్ని తొలగించలేం. ఆ ఆధునీకరణకు మీరు చాలాకాలంగా సహకరించటం లేదు.'' అన్నారు.
ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ రిఫైనరీలకు యీ క్రూడ్ వాడుకునే శక్తిసామర్థ్యాలు సమకూర్చలేదు. రేటు నిర్ధారించలేదు. ఎంఆర్‌పిఎల్ 18 నెలలు పాటు తీసుకుని వదిలిపెట్టేసింది. ఈ లోపుగా ప్రయివేటు రిఫైనరీలు తమ యంత్రాలను ఆధునీకరించుకుని దీన్ని వాడుకునే పరిస్థితిలో వున్నాయి. 'పబ్లిక్ సెక్టార్ వాళ్లు ఎలాగూ తీసుకోవడం లేదు కాబట్టి అదంతా మాకు తక్కువ ధరకు యిచ్చేయండి.' అని కెయిర్న్‌తో బేరం పెట్టాయి. కెయిర్న్ సరేనంది. ఇదంతా చూసిన పబ్లిక్ సెక్టార్‌లో వున్న ఎచ్‌పిసిఎల్ 'మేం రాజస్థాన్ క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేయగల 7 మిలియన్ సామర్థ్యం గల ప్లాంట్ పెట్టుకుంటాం' అని ముందుకు వచ్చింది. అనుమతి యివ్వడానికి ప్రభుత్వం ఐదేళ్లు తీసుకుంది! క్రూడ్ ఆయిల్‌ను టాంకర్ల ద్వారా పంపితే రవాణా ఖర్చు ఎక్కువౌతుంది. పైప్‌లైన్ల ద్వారా పంపితే చౌక. పైప్‌లైన్లు లేదు కాబట్టి టాంకర్ల ఖర్చు ఎవరు భరిస్తారు అనే విషయంపై కెయిర్న్‌కు, రిఫైనరీలకు వివాదం నడుస్తోంది. ప్రభుత్వ రిఫైనరీలకు మొత్తుకోగా చివరకు ప్రభుత్వం 2008 ఏప్రిల్‌లో బార్మర్ నుండి గుజరాత్‌లోని సలాయా వరకు 580 కి.మీ.ల పైప్‌లైన్ వేస్తానని, అక్కణ్నుంచి వివిధ రిఫైనరీలు తీసుకోవచ్చని ప్రతిపాదించింది. పని ప్రారంభించిన 8 నెలలకు కాంట్రాక్టరు గుజరాత్ తీరంలోని భోగాట్ వరకు వేస్తానని ప్రతిపాదించాడు. అంటే మరో 80 కి.మీ.ల అదనపు దూరం. 2009 జులైలో దీన్ని ఆమోదించారు. ఎందుకో వారికే తెలియాలి. దీనివలన పైప్‌లైన్లు వేయడం మరింత ఆలస్యమై 2010 జూన్ వరకు ట్యాంకర్ల ద్వారానే రవాణా జరిగింది. ఏది ఏమైనా ఇండియన్ ఆయిల్ మాత్రం బార్మర్ నుండి క్రూడాయిల్ తెప్పించుకుని గుజరాత్‌లోని కోయాలి, హరియాణాలోని పానిపట్ రిఫైనరీలలో శుద్ధి చేసుకుంటోంది. తక్కిన పబ్లిక్ సెక్టార్ రిఫైనరీలు మాత్రం వాడుకోలేకపోతున్నాయి. అవి వాడుకోలేకుండా చేసినది ప్రభుత్వమే. రిలయన్స్, ఎస్సార్ వంటి కార్పోరేట్లకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వాధినేతలు, అధికారులు కలిసి చేస్తున్న చేష్టలివి అని కాగ్ తప్పుపట్టింది.
– ఎమ్బీయస్ ప్రసాద్