1950-60 లలో బాపు ఆంధ్రపత్రికలో ''బాపు కార్ట్యూనులు'' పేరుతో ఆనాటి సినీప్రముఖుల రేఖాచిత్రాలు వేశారు. వాటితో బాటు వారి ప్రత్యేక లక్షణాల గురించిన పరిచయ వాక్యాలు కవితారూపంలో యిచ్చారు. ఆ పరిచయం కూడా అతిశయోక్తులతో, వర్ణనలతో నింపకుండా వారిని విమర్శిస్తూ, ఎత్తిపొడుస్తూ, హెచ్చరిస్తూ రాశారు. రమణగారు కవి కాబట్టి ఆయన హస్తం కూడా వీటిలో వుంటుందని అనుకోవచ్చు. ఇవి బాపు పేరనే వెలువడ్డాయి కాబట్టి ఆ ఘనత వారికే చెందుతుంది. ఆనాటి ప్రముఖుల గుణగణాల గురించి తెలియని నేటి యువత కోసం కాస్త వివరణ యిస్తున్నాను. రేఖావిలాసాలలో అందాలను వేరుగా చెప్పనవసరం లేదు.
సినిమా సంగీతాన్ని నిర్వచించిన వారిలో అగ్రగణ్యుడు సాలూరు రాజేశ్వర రావు. పిన్న వయసులోనే లలితగీతాల గాయకుడిగా, సంగీతదర్శకుడిగా పేరు తెచ్చుకుని ''మల్లీశ్వరి'' సినిమా ద్వారా సినిమా సంగీతం యిలా వుండాలని అందరికీ తోచేట్లా చేసిన మేధావి. బాపురమణలు వీరికి వీరాభిమానులు. అయితే పోనుపోను రాజేశ్వరరావుగారు తన స్టాండర్డ్ మేన్‌టేన్ చేయలేదనే ఫిర్యాదు వీరి కుంది. గత ఘనతను గుర్తు చేస్తూ శ్రీశ్రీ పద్యం ధోరణిలో 'నిరుడు విరిసిన స్వరసరోజాలు ఎక్కడ?' అని అడుగుతున్నారు. 'హిందీ చిత్రదర్శకుడు నౌషాద్ పోకడలు పోవలసిన అవసరం ఏముంది? మీలోని గుప్త (దాగిన) సుప్త (నిద్రించిన) సప్తస్వర వనౌషధం మాక్కావాలి మేస్టారూ' అని వేడుకుంటున్నారు.
ఘంటసాల గురించి రాస్తూ 'గీతాలకు ముందు ఉపోద్ఘాతాలు' అని లలిత గీతాలు (ప్రయివేటు సాంగ్స్)లో పాటలకు ముందు ఆయన చెప్పే వచనం గురించి ప్రస్తావించారు. ఆయన కంఠాన్ని కంచుగంటతో పోలుస్తూ గంట బదులు 'ఘంట' అని పన్ చేశారు. స్వరాలతో నిత్యఖేల (ఆట) అంటూ గానలోల, ఘంటసాల అంటూ అంత్యానుప్రాసలు వేశారు.
ఇక పిబి శ్రీనివాస్ యిద్దరికీ మిత్రుడు. ఆయన గొంతులో మార్దవం ఎక్కువ పలుకుతుంది. అందుకనే ఘంటసాలను కంచుఘంటలీల అంటూ యీయనిది మధుమధురమైన తేటపాట అన్నారు. శ్రీనివాస్ అనే ఆయన పేరును శ్రీని'వాయిస్' అని పన్ చేశారు. ఇతర భాషల్లో వచ్చినన్ని ఛాన్సులు తెలుగులో ఎందుకు రావటం లేదో తరచి చూసుకోమంటూ 'క్కారణం' అనే తమిళ ఛాయను స్ఫురింపచేసే పదంతో చెణుకు వేశారు.
సావిత్రి అప్పటికే స్థూలకాయురాలయిందని గుర్తు చేస్తూ 'నిండైన' అని కోట్స్‌లో పెట్టారు. సెంటిమెంటల్ పాత్రల్లో సైతం అతి చేయదని అభినందిస్తూ 'నిగ్రహం' వాడారు. అభినేత్రి సావిత్రి అనే పదబంధం ఆ తర్వాతి రోజుల్లో ఆమెకు యింటిపేరుగా మారిపోయింది. సినీధాత్రి (భూమి)కి రాజ్ఞి అని ఆ రోజుల్లోనే యిచ్చిన బిరుదు యిప్పటికీ వర్తిస్తోంది. ఏ కొత్త హీరోయిన్ వచ్చినా సావిత్రి పేరు స్మరించకుండా వుండటం లేదు.
ఇక మరో హీరోయిన్ కృష్ణకుమారి – అన్ని విధాలా అందకత్తె. తర్వాతి రోజుల్లో అభినయానికి కూడా పేరు తెచ్చుకున్నా, అప్పట్లో అందర్నీ ఆకట్టుకున్నవి ఆమె అందచందాలే. అదే గుర్తు చేస్తూ వ్యాఖ్యలు సాగాయి. వంపుసొంపులు వుంటే చాలు హీరోయిన్లకు అద్భుత అభినయం అక్కరలేదని (సినీ)జనుల అభిప్రాయం అనే వెక్కిరింత యిప్పటికీ వర్తిస్తుంది.
ఇక గుమ్మడి. మంచి, చెడు, రాజు, మంత్రి, సేనాపతి, సేవకుడు, యువకుడు, ముసలి – ఏ పాత్ర యిచ్చినా దానిలో ఒదిగిపోగల 'కారెక్టరు' నటుడు. నానాటికీ తనకు తానే వరవడి దిద్దుకుంటున్నాడు అని ప్రశంసించారు. అహంభావం లేకుండా నటనను నిత్యం మెరుగులు దిద్దుకుంటూ పోయారు గుమ్మడి. బాపురమణలు నిర్మాతలుగా మారాక వీలున్నప్పుడల్లా తమ సినిమాల్లో ఆయనను నటింపచేశారు.
ఇక మహానటుడు రంగారావు ఎన్నిరకాల పాత్రల్లో రాణించారో మంచి కవిత్వధోరణిలో చెప్పారు. కులాసాగా తిరగడాన్ని సూచించే టింగురంగా అనే మాట యీ మధ్య ఎక్కువగా వాడటం లేదు. దాంట్లోంచి టింగురంగారావు సృష్టించారు. కొన్నాళ్లు పోయేసరికి భానుమతి, రంగారావు వంటి మహానటులు పాత్రల్లో యిమడకుండా ఏ పాత్ర వేసినా తామే కనబడసాగారు. పాత్రలో బలం లేకపోతేనే (నిర్బలం) యిలా జరుగుతుందని హెచ్చరించారు బాపు. డైలాగుల్లో హేల రంగారావు స్టయిల్‌గా అయి, ఒక్కోప్పుడు మితిమీరి కంగారుకంగారుగా మాట్లాడడం గమనించి, 'ఒక్కోసారి డైలాగుల్లో మాత్రం యమ-కంగారంగారావు' అని వెక్కిరించారు. ఇలా అన్నా రంగారావుగారికి బాపు అంటే మహా యిష్టం. ఆయన కెరియర్ చివరి థలో ''సంపూర్ణ రామాయణం''లో రావణుడిగా తనకు అద్భుతమైన పాత్ర యిచ్చారని బాపును ప్రశంసల్లో ముంచెత్తారు.
ఇక చివరగా – మల్లాది రామకృష్ణ శాస్త్రి. అత్యంత సామాన్యుడిగా కనబడే మహా పండితుడు. రచయితలకు రచయిత. కవులకు కవి. జాను తెనుగు, జాణ తెలుగు అంటే ఆయనే గుర్తుకు వస్తాడు. తెలుగు కథకు రూపు దిద్ది, వచనరచనలో తనకుతానే సాటి అనిపించుకుని, అనుకోకుండా సినీ రంగానికి వచ్చి సముద్రాల తో కలిసి పని చేసి, తర్వాత విడిగా వచ్చి ఆణిముత్యాల లాటి పాటలు, మాటలు రాశారు. ఆయన రచలన్నిటిలో మల్లాది ముద్ర స్పష్టంగా తెలుస్తుంది. ఆంధ్రపత్రికలో పని చేసే రోజుల్లో రమణ ఆయనను 'కథాకథన చక్రవర్తి' వంటి బిరుదులతో ముంచెత్తారు. బాపు ఆయన కథలకు అద్భుతమైన యిలస్ట్రేషన్లతో హారతి పట్టారు. అందుకనే ఆయనను ప్రశంసిస్తూ ఆయన తరచు వాడే పదాలతోనే (డించి, సాహో, హొరంగులు..) ఆయనకు నమోవాకాలు అర్పించారు. ఆయన కృష్ణశాస్త్రిని పోలిన భావకవి ఆయన. మహానుభావుడు పదాన్ని దానికి కలిపి 'మహానుభావుకుడు' సృష్టించారు. మల్లాదివారు రోజూ సాయంత్రం సిగరెట్టు కాలుస్తూ మద్రాసు పాండీ బజారులో నిలబడి, దర్బారు నిర్వహించేవారు. సినీరంగంలో ప్రముఖులందరూ అక్కడకు హాజరై ఆయన శిష్యరికం చేసేవారు. ఆ అలవాటు ఎత్తి చూపారు. ఇక రేఖాచిత్రం గురించి చెప్పాలంటే – మల్లాదివారు ఫోటోల్లో కంటె బాపు రేఖాచిత్రాల్లోనే అందంగా, హుందాగా వుంటారు!
'బాపు కార్ట్యూనులు'కు యివి శాంపుల్ మాత్రమే!
ఎమ్బీయస్ ప్రసాద్