మోహన మకరందం : ఉపరాష్ట్రపతితో బాటు డిన్నర్‌..

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement ఉపరాష్ట్రపతితో బాటు డిన్నర్‌ – 'థాంక్స్‌.. బట్‌, నో థాంక్స్‌'! సినిమాలలో ఐయేయస్‌లను, ఐపియస్‌లను రాజకీయ నాయకులకు 'జీ హుజూర్‌' అనేవాళ్లలా చూపిస్తారు. వాళ్లకు…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

ఉపరాష్ట్రపతితో బాటు డిన్నర్‌ – 'థాంక్స్‌.. బట్‌, నో థాంక్స్‌'!

సినిమాలలో ఐయేయస్‌లను, ఐపియస్‌లను రాజకీయ నాయకులకు 'జీ హుజూర్‌' అనేవాళ్లలా చూపిస్తారు.

వాళ్లకు స్వయం ప్రతిపత్తి లేనట్లు చిత్రీకరిస్తారు. సివిల్‌ సర్వీసెస్‌లో పరిస్థితి నిజంగా అలాగే వుంటుందా?

ఎంతమంది బాస్‌లతో ఎన్నిసార్లు 'ఢీ' కొట్టి నిలబడగలిగితే సర్వీసు సక్రమంగా నడుస్తుంది!

ఉపరాష్ట్రపతి హిదాయతుల్లా గారి దగ్గర సెక్రటరీగా పని చేసే రోజులవి…

ఓ రోజు డిన్నర్‌కు వెళుతూ నన్నూ రమ్మన్నారు… 

డిన్నర్‌ ఏర్పాటు చేసిన వారి నుండి నాకు విడిగా ఆహ్వానం లేదు.

రానని ఎలా చెప్పాలి?

ఆయన ఉన్నత విద్యావంతుడు. అరిస్టోక్రాట్‌. చాలా సంస్కారి. నా కంటె వయసులో, జ్ఞానంలో ఎంతో పెద్దాయన.

మరి చెప్పకపోతే …నా వ్యక్తిత్వం మాటేమిటి?

xxxxxx

మన తెలుగువాళ్లలో ఇంటిపేరు చాటుకోము. పొడి అక్షరాల్లో దాచేస్తాం. నా విషయంలో ఐ.ఎ.ఎస్‌.లో జాయినయ్యేదాకా కె.మోహనే. తర్వాత నార్త్‌ యిండియన్‌ స్టయిల్లో 'మోహన్‌ కందా' చేసేశారు. ఇంటిపేరుకు ప్రాధాన్యత ఇవ్వడమనేది మన కల్చర్‌లో లేదు. మనిషి పేరుకి ఎక్కువ విలువ నిస్తాం. నా భార్యను నాద్వారా గుర్తించినపుడు మిసెస్‌ మోహన్‌ అనడం రివాజు. కొంతమంది మంచివాళ్లు ఆవిడ పేరు కూడా కలిపి మిసెస్‌ ఉషామోహన్‌ అంటారు. ఆ మధ్య వరల్డ్‌కప్‌ పుట్‌బాల్‌ వచ్చినప్పుడు చూశాను. పోర్చుగల్‌లో మన తెలుగువాళ్లలాగ యింటిపేరు పట్టించుకోకుండా మనిషి పేరు వాడే అలవాటు వుంది. పైగా అ సంప్రదాయానికి నేపథ్యం ఏమిటో కామెంటేటర్‌ చెప్పాడు. ''మేము వ్యక్తికి విలువ నిస్తాము. అతను ఏ కుటుంబానికి చెందినవాడు, ఆ కుటుంబానికి  వున్న పేరుప్రఖ్యాతులు ఏమిటి? అనేవి పరిగణనలోకి తీసుకోము. ఒక మనిషి ఏదైనా సాధిస్తే ఆ ఖ్యాతి అతనికే చెందాలనుకుంటాము, అతని కుటుంబానికి కాదు'' అని. 

చైనాలో కూడా యిలాగే వుంటుంది. మావో అనే అంటున్నాం కదా, జెడాంగ్‌ అనే పేరుతో గుర్తుపెట్టుకోవటం లేదు కదా. తెలుగువాళ్లకు ఇండివిడ్యువాలిటీ ఎక్కువంటారు. దానికీ, మన పేర్ల సంప్రదాయానికి లింకేమైనా వుందేమో ఎవరైనా సోషల్‌ సైంటిస్టు పరిశోధన చేసి కనుక్కోవాలి. తెలుగు వాళ్లయినా కాకపోయినా ప్రతి మనిషికి ఇండివిడ్యువాలిటీ వుండాలంటాను. నా మట్టుకు నాకు అది ఓ పాలు ఎక్కువే. 

హిదాయతుల్లా గారి వద్ద పనిచేసిన రోజుల్లో (1981-83)… ఆయనకు నేనంటే ఎంతో అభిమానం వున్నా, స్వతహాగా ఐయేయస్‌ లంటే గౌరవాభిమానాలు పొంగి పొరలేవి కావు. మా  సర్వీసెస్‌ అంటే చాలామందికి సదభిప్రాయం లేదు. ఈ విషయంలో జడ్జీలు, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ముందువరసలో నిలబడతారు. 'ఐయేయస్‌లు కష్టపడి పని చేసి, దేశానికి సేవచేస్తున్నారు' అనుకునే పుణ్యాత్ములు ఎవరూ లేరిక్కడ. రాజకీయనాయకులు, పోలీసులు అందరూ ఏదైనా అవకాశం దొరికితే ఏదైనా అని ఏడిపిద్దామని చూసేవాళ్లే. ఓ వాత వేసి చూద్దామని సరదా పడేవాళ్లే. దానికి కారణం మేమంటే వాళ్లకు అసూయ అని అనుకుని మమ్మల్ని మేమే ఓదార్చుకుంటాం. 

హిదాయతుల్లా గారు చీఫ్‌ జస్టిస్‌ చేసినాయన. ఉన్నత విద్యావంతుడు. కేంబ్రిడ్జ్‌లో ట్రినిటీ కాలేజీలో చదివారు. చాలా సంస్కారి. అరిస్టోక్రాటిక్‌ అలవాట్లు పుట్టుకతోనే వచ్చాయి. ఆయన రాష్ట్రపతి భవన్‌లో, మిలటరీ సెక్రటరీ టు ప్రెసిడెంటు అనే ఆయనతో కలిసి గోల్ఫ్‌ ఆడేవారు. ఓ రోజు హిదాయతుల్లా గారు బర్డీ అనే షాట్‌ కొట్టారు. అలా కొట్టినవాళ్లకు అవతలివాళ్లు డిన్నర్‌ యివ్వడం గా(గో)ల్ఫ్‌ మర్యాదట. ఈయన కొట్టారు కాబట్టి వాళ్లు డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఇవన్నీ నాకు తెలియవు. ఎందుకంటే ఆయన గోల్ఫ్‌ ఆడేటప్పుడు నేను ఆయనతో ఎప్పుడూ వెళ్లలేదు. ఈ డిన్నర్‌ ఏర్పాటు నాకు తెలియదు. వాళ్లు నన్ను ప్రత్యేకంగా పిలవలేదు. 

సాయంత్రం ఆయన డిన్నర్‌కు బయలుదేరుతూ ''నువ్వూ డిన్నర్‌కు బయలుదేరు'' అన్నారు. 

నాకు యీ కథంతా తెలియదు కాబట్టి ''ఎక్కడికి?'' అన్నాను. 

''అదేమిటి, డిన్నర్‌కు పిలిచారుగా, వెళ్లాలి కదా'' అన్నారాయన కాస్త తెల్లబోతూ. అని విషయం చెప్పారు.

అంతా విని ''పిలిచింది మిమ్మల్ని కానీ నన్ను కాదు కదా. నేనెందుకు రావాలి?'' అన్నాను.

''అదేమిటి, నేను వెళ్లిన ప్రతీ చోటకీ నువ్వు రావాలేమో కదా.. అలా అని రూలు లేదా?..'' అన్నారు ప్రశ్న, ఆశ్చర్యం మిళాయించి.

నేను కాస్త గట్టిగానే చెప్పాల్సి వచ్చింది – ''చూడండి, మీరేదో ఓ రాష్ట్రానికనో, ఓ ఫంక్షన్‌ కనో వెళితే నేను మీతో రావడం సహజం. ప్రొటోకాల్‌ ప్రకారం నేను వస్తానని అందరికి తెలుసు. దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు కూడా. ఇలాటి సందర్భాల్లో అంటే సోషల్‌ అకేషన్స్‌లో నేను వస్తానని వాళ్లకు తెలియకపోవచ్చు. దానికి తగిన ఏర్పాట్లు చేసి వుండకపోవచ్చు. బహుశా అందుకేలాగుంది నన్ను ప్రత్యేకంగా పిలవలేదు. వారు పిలిచి వుంటే నాకు అభ్యంతరం లేకపోయేదేమో! కానీ జరిగినదేమిటంటే వాళ్లు పిలవలేదు. నన్ను పిలిచుంటే మీకు చెప్పేవాణ్ని. వచ్చేవాణ్ని. నన్నంటూ ప్రత్యేకంగా గుర్తించని యిటువంటి పరిస్థితుల్లో నేను రావడం బాగుండదు. నేను రాను.'' అని.

నా వాదనలో పాయింటు వున్నా నేనిలా చెప్పడం ఆయనకు రుచించలేదు. తను వెళ్తున్నారు కాబట్టి ఆయన సెక్రటరీగా నేను వెళ్లితీరాలి. ప్రత్యేక ఆహ్వానం గురించి పట్టుబట్టకూడదు. ఇదీ ఆయన ఫీలింగ్‌. నా జవాబు ఆయనకు నచ్చలేదు.

ఎంత సెక్రటరీనైనా నాకూ ఓ యిండివిడ్యువాలిటీ వుంది, యిలాటి సందర్భాల్లో నాకు ఆహ్వానం వుండి తీరాలి అని ఆయన గుర్తించకపోవడం నాకూ నచ్చలేదు. 

మర్నాడు ఒక ఏడు పేజీల నోట్‌ రాసి పెట్టేసాను! 

ఆ నోట్‌లో ఏం రాశానంటే – మమ్మల్ని సర్వీసులో ఎపాయింట్‌ చేసేది సాంకేతిక పరంగా చూస్తే భారతదేశ రాష్ట్రపతి. తీసేసే శక్తి వున్నది కూడా ఆయనకే. మీరు ఉపరాష్ట్రపతి కాబట్టి దానికి జస్ట్‌ ఒక్క మెట్టు తక్కువగా వున్నారని తెలిసే యిది రాస్తున్నాను అంటూ మొదలుపెట్టి ఏవో నా కష్టసుఖాలూ అవీ చెప్పుకుని, 'నేను వచ్చి రెండేళ్లు అయింది, రావడం నాకు పెద్దగా ఇష్టం లేకపోయినా ఎందుకొచ్చానంటే శారదా ముఖర్జీగారు నా తరఫున మీకు సిఫారస్‌ చేస్తే మీరేమో మీ ఆఫీస్‌ చక్కబెట్టుకోవడానికి ఒక ఐ.ఎ.ఎస్‌ ఆఫీసర్‌ కావాలని, చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉపరాష్ట్రపతి దగ్గర ఒక ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్‌ పోస్టు సృష్టించి, నన్ను తెచ్చి వేసుకున్నారు. 

''అది నాకు మంచి అవకాశమే, చక్కటి ఎక్స్‌పోజర్‌ వచ్చింది. ఇప్పటివరకు అంతా హాయిగా జరిగింది. మీ నుండి, మీ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇక నాకు నా రాష్ట్రానికి వెళ్లి నా ప్రజలకి సేవ చేసుకోవాలని వుంది. ఇక నన్ను వెంటనే వదిలిపెట్టేయ'మని రాసాను. చివర్లో మనసుకి తోచినదాన్ని నిర్మొగమాటంగా రాశాను. 

''ఇప్పుడు మే నెల. జులైలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తున్నాయి. మీరే రాష్ట్రపతి కావచ్చు, కాకపోవచ్చు. రాష్ట్రపతి అయ్యాక వెళతానన్నా ననుకోండి మీరు నన్ను వదిలిపెట్టరు. మీరు అవకుండా వుండి అప్పుడు నేను వెళ్ళిపోతానంటే, 'నేను కాలేదు కదా, నా దగ్గరుండి ఏం ప్రయోజనం అనుకుని వెళ్ళిపోతున్నాడు' అనుకుంటారు. అందుకని యిప్పుడే వెళ్లిపోనివ్వండి.'' 

 ఆయన పాపం చదువుకుని నవ్వుకున్నాడు, కొంచెం బాధపడ్డారేమో తెలియదు. ఆ లేఖ మీద ఏ యాక్షనూ తీసుకోకుండా నాకు తిరిగివ్వకుండా మా ఆవిడ్ని పిలిచి ఆవిడ కిచ్చేసారు – 'మీ ఆయన దగ్గరే వుంచుకోమను. తర్వాత నే వివరంగా మాట్లాడుతానులే' అంటూ. 

ఇక్కడ గుర్తుంచుకోవాలిసినది ఏమిటంటే నాకు ఆయనంటే అపారమైన గౌరవం. ఆయన పాండిత్యం, హుందాతనం, పెద్దమనిషి తరహా – వీటన్నిటినీ ఆరాధిస్తాను. వయసురీత్యా పితృసమానుడు. అయినా వ్యక్తిగా మన విలువలు కాపాడుకోవాలన్నపుడు నేను రాజీ పడలేదు. 

ఇదంతా చదివి విని నేను చాలా అహంభావిని అనుకోవడం పొరబాటు. 'అహం' అంటే సంస్కృతంలో నేను అని అర్థం. నేను, నా యిష్టం అని పదే పదే అనుకోవడం వలననే అహంభావం పుడుతుంది. అయితే ఎవరు యీ 'నేను'? చిన్నప్పుడు పెద్ద ప్లీడరు గారైన భీమశంకరం గారబ్బాయిని. సంఘసేవికురాలైన పాపాయమ్మ గారబ్బాయిని. డాన్సరైన కల్పకం తమ్ముణ్ని. పెళ్లయ్యాక గాంధీ గారి అల్లుణ్ని. ఉష గారి మొగుణ్ని. (ఆరుద్రగారు అన్నట్టు 'మనమ్మాయి మగడు.. మరేపేరుకీ తగడు') ఇప్పుడు సీతారాం ఏచూరి మేనమామను! ఇన్ని గుర్తింపులలో మన 'నేను' అనేది నలిగిపోతుంది. అస్తిత్వం పోగొట్టుకుంటుంది. అయినా విలువల దగ్గరకి వచ్చేసరికి మనకంటూ వ్యక్తిత్వం వుండాలి… కదూ!

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version