రష్యాను వంచడానికి యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌ను వాడుకుంటోంది. సందట్లో సడేమియాలా అమెరికా చొరబడుతోంది. పశ్చిమదేశాలకు, రష్యాకు మధ్యలో ఉక్రెయిన్ వున్న ఒకప్పుడు రష్యాలో భాగం. జనాభాలో 20% మంది రష్యన్ మాట్లాడతారు. పారిశ్రామికీకరణ బాగా జరిగిన తూర్పుభాగంలో రష్యా ప్రభావం హెచ్చు. నికితా కృశ్చేవ్ అధ్యకక్షుడిగా వుండగా క్రిమియాను ఉక్రెయిన్‌కు యిచ్చివేశాడు. పశ్చిమభాగంలో వున్న జనాభా యూరోపియన్ దేశాలతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ వుంటారు. ఉక్రెయిన్ అధ్యకక్షుడుగా ప్రస్తుతం వున్న విక్టర్ యానుకోవిచ్ రష్యాకు, పశ్చిమదేశాలకు మధ్య తూకం సాధిద్దామని ప్రయత్నిస్తాడు. జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్‌కు స్నేహితురాలైన యూలియా తిమోషెంకో అనే ప్రతిపక్ష నాయకురాలు పశ్చిమ దేశాల మద్దతుతో 2004-05లో ''ఆరంజ్ రివల్యూషన్'' లేవదీసి అప్పుడు అధ్యకక్షుడుగా వున్న విక్టర్‌ను దింపేసింది. తను అధికారంలోకి వచ్చి కొంతకాలం పాలించింది. అవినీతికరమైన పాలనతో ప్రజాదరణ కోల్పోవడంతో విక్టర్ మూడేళ్ల క్రితం మళ్లీ అధ్యక్షపదవి చేపట్టాడు. అవినీతి నేరాలపై యూలియాను 2011లో జైలుకి పంపాడు. తమ ప్రతినిథిని మళ్లీ కూర్చోబెట్టాలనే తహతహతో ఫ్రాన్స్, జర్మనీ సారథ్యంలో యూరోపియన్ యూనియన్ (ఇయు) ప్రతిపక్షాలను దువ్వుతోంది. అది గమనించిన విక్టర్ 2013 ప్రారంభంలో ఇయుతో ఆర్థికపరమైన, రాజకీయపరమైన ఒప్పందం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. రష్యా దానికి అడ్డుపడింది. ఇప్పటికే రష్యా చుట్టూ వున్న దేశాలు పశ్చిమదేశాలతో చేతులు కలిపి యిబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉక్రెయిన్ చేయిజారకుండా చూసుకోవాలనే ఆతృతతో విక్టర్‌పై రష్యా ఒత్తిడి తెచ్చింది. తనే 15 బిలియన్ డాలర్ల సహాయం యిస్తానంది. దాంతో అతను ఇయు ఒప్పందంపై సంతకం వాయిదా వేశాడు.
అప్పుడు ఇయు అతన్ని గద్దె దింపాలని నిశ్చయించుకుంది. దాని దన్నుతో మూడు ప్రతిపక్షాలు 2013 నవంబరు నుండి ఆందోళనలు చేపట్టాయి. ఇది చూసి విక్టర్ ఇయుతో సంధి చేసుకోవడానికి ఒప్పందంపై సంతకం చేస్తానని డిసెంబరులో అన్నాడు. అయినా ఇయు పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు ప్రభుత్వ భవనాలను ఆక్రమించాయి. ప్రభుత్వం ఆందోళనకారులను అరెస్టు చేసింది. గొడవలు ముదిరాక శాంతి ఒప్పందం చేయించడానికి యీ ఫిబ్రవరి 21న ఇయు – ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్ విదేశాంగ మంత్రులను పెద్దమనుష్యులుగా పంపించింది. అంతకుముందు రోజే ఉక్రెయిన్‌పై అనేక ఆంక్షలు విధించి శాంతిచర్చలకు ఒప్పుకునేట్లా విక్టర్‌ను 'బ్లాక్‌మెయిల్' చేసింది. చర్చలు సజావుగా సాగడానికి రష్యా ఒక డెలిగేషన్‌ను పంపింది. ఆ చర్చల్లో అధ్యకక్షుడు విక్టర్ ప్రతిపక్షాల ప్రతి డిమాండ్‌కు తలవొగ్గాడు. ఆందోళనకారులను విడుదల చేశాడు. ఆ ఒప్పందంపై తడి ఆరకుండానే అధ్యకక్షుడి ఎగ్జిక్యూటివ్ అధికారాలను ప్రతిపక్షాలు లాక్కున్నాయి. రాజధాని నుండి బయటకు పంపేశారు. ఆక్రమించిన ప్రభుత్వ భవనాలను తిరిగి అప్పగించలేదు. మధ్యస్తం చేసిన ఫ్రాన్సువారికి యిదేమీ వింతగా తోచలేదు సరికదా, దాని విదేశాంగ మంత్రి 'విప్లవకారులను' అభినందించాడు. వాళ్లు విటాలి క్లిష్చికో అనే ప్రతిపక్ష నాయకుణ్ని అధ్యక్షస్థానంలో కూర్చోబెడదామని ప్రయత్నిస్తున్నారు. అతను మాజీ బాక్సింగ్ ఛాంపియన్.
అమెరికా కూడా ఉక్రెయిన్‌ను తనకు అనుకూలంగా మార్చుకుందామని చూస్తోంది. ఉక్రెయిన్‌లో వున్న అమెరికన్ రాయబారికి, అమెరికాలోని అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కలిసి స్వొబోడా పార్టీ నిరసన ప్రదర్శనలు నిర్వహించిన మైదాన్‌కు స్వయంగా వెళ్లి చాకొలేట్లు పంచిపెట్టారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు లీక్ కావడంతో వాళ్లు ఇయును పక్కకు నెట్టి ఒబామా ప్రభుత్వం సమర్థిస్తున్న ఆర్సెనీ యాట్సెన్యుక్‌ను విక్టర్ స్థానంలో కూర్చోబెడదామని ప్లాను వేస్తున్నారని తెలిసిపోయింది. ఈ ఆర్సెనీ ఫాదర్‌ల్యాండ్ పార్టీకి నాయకుడు. విక్టర్‌ను రాజధాని నుండి పంపేసిన తర్వాత ప్రతిపక్షాలతో కూడిన పార్లమెంటు విక్టర్‌ను అభిశంసిస్తూ ఒక తీర్మానం పాస్ చేసి, మే 25 నాటికి కొత్త ఎన్నికలు జరపడానికి పార్లమెంటు నిశ్చయించి, యూలియాకు సన్నిహితుడైన ఒలేక్‌సందర్‌ను మధ్యంతర అధ్యకక్షుడిగా కూర్చోబెట్టింది. యూలియాను జైల్లోంచి విడిపించడం తన వ్యక్తిగత బాధ్యతగా భావించిన ఏంజెలా, విక్టర్‌ను అలా పంపించి, యీమెను యిలా జైల్లోంచి బయటకు తీసుకువచ్చింది. వెంటనే యూలియా మైదాన్‌కు వెళ్లి తన అనుచరులను ఉద్దేశించి ఉపన్యాసమిచ్చింది. ఉక్రెయిన్ ప్రతిపక్షాలలో ఐకమత్యం లేదు. వారిలో ప్రధానపాత్ర వహిస్తున్న స్వొబోడా పార్టీ నాజీ భావాలున్న పార్టీ. ఇలాటి నాజీలకు పిరికితనంతో ప్రభుత్వం అప్పగించావని విక్టర్‌ను అతని పార్టీ సభ్యులు విమర్శిస్తున్నారు.
ఉక్రెయిన్‌కు కావలసిన గ్యాస్‌లో 40% రష్యానుండి వస్తుంది. పైగా ఎన్నో ఏళ్లపాటు రష్యాలో భాగం. ఉక్రెయిన్‌కు, రష్యాకు మధ్య రక్షణ ఒప్పందం వుంది. అందుచేత పశ్చిమదేశాలు ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించుకోకుండా చూడడానికి రష్యా క్రిమియాలో మిలటరీని దింపింది. ''మీరు క్రిమియాను ఆక్రమించడం తప్పు.'' అంటూ అమెరికా రష్యాపై ఆంక్షలు విధించడానికి పూనుకుంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియటం లేదు. మధ్యలో ఉక్రెయిన్ నలిగిపోతోంది. ఇప్పటికే దాని ఆర్థికవ్యవస్థ కుదేలైంది. ఐఎమ్‌ఎఫ్‌ను ఋణం అడిగితే అది అమలు చేయలేని షరతులు పెట్టింది. ఉక్రెయిన్ జనాభా 4.60 కోట్లు. మంచి సాగుభూమి, సహజ వనరులు, ఖనిజాలు అన్నీ వున్నాయి. అందుకే పశ్చిమదేశాలు దానిపై కన్ను వేశాయి. వారితో వాణిజ్యబంధాలు పెంచుకుని లాభాలు సంపాదించవచ్చని ఉక్రెయిన్‌లో భారీ వ్యాపారసంస్థలు ఆశిస్తున్నాయి. అయితే రష్యా దాన్ని సాగనిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2014)