అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
ఎగ్జిబిషన్‌లో మంత్రి మాయం
1998 ప్రాంతం. కేంద్ర వ్యవసాయ శాఖలో నేను జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్నాను. మంత్రిగా సోమ్ పాల్ వుండేవారు.
ఏదో సమావేశంలో పాల్గొనడానికి యిద్దరం ఇరాక్ వెళ్లాం. మా మంత్రిగారికి సద్దాం హుస్సేన్‌ను చూడాలని సరదా.
ఆయన వివాదాస్పద వ్యక్తి కదా. వెళ్లి చూడడం దేనికి? అని నేననుకున్నాను.
వివాదాస్పద వ్యక్తి కాబట్టే చూడాలని ఆయన అనుకున్నాడు. సద్దాం నిజజీవితంలో ఎలా వుంటాడో చూడాలని ఆయనకు ఉబలాటం.
''ఇరాక్ రూపురేఖలను మార్చేశాడు కదా, ఇక్కడి వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కించాడు కదా. ఒక అరబ్ దేశంలో యింతటి క్రాంతదర్శిని చూడగలమా?'' అన్నాడాయన నాతో. అని వూరుకోకుండా కార్యక్రమ నిర్వాహకుల వద్ద తన కోరిక వెల్లడించాడు.
''చాలా సెక్యూరిటీ వుంటుంది. ఆయన ఎవరినీ అంత సులభంగా దగ్గరకు రానీయడు. మీ అభ్యర్థన ఆయనకు అందేట్టు చూస్తాం. ఆ తర్వాత మీ అదృష్టం.'' అన్నారు వాళ్లు.
ఏదైనా ఎపాయింట్‌మెంట్ సంకేతమో, ఆయన ఆఫీసునుండి ఫోనో వస్తుందనుకున్నాం. ఆయనా అదే అనుకున్నాడు పాపం.
మర్నాడు మా టీము సభ్యులమంతా కలిసి ఎగ్జిబిషన్‌కు వెళ్లాం. ఏదో మాట్లాడుకుంటూ మధ్యలో ''మీరేమంటార్ సర్?'' అని మంత్రిగారి కేసి తిరిగి ప్రశ్నించాను. ఆయన లేడు. అటూ యిటూ చూశాం, ఏ స్టాల్ దగ్గరైనా వుండిపోయారా అని. లేరు.
ఎప్పుడూ ఆయన వెంటే వుండే సెక్యూరిటీని అడిగాను. ''ఇప్పటిదాకా యిక్కడే వున్నారు సాబ్. ఇంతలోనే ఏమై పోయారో తెలియదు. ఎదురుగా గుంపు ఒకటి వచ్చి మన మధ్యలోంచి వెళ్లింది కదా! ఆ తర్వాత కనబళ్లేదు.'' అన్నారు వాళ్లు.
కాస్సేపు ఆగి చూశాం. నలుగురం నాలుగు వైపులా వెళ్లి చూశాం. ఎక్కడా కనబడలేదు.
అదేదో యాడ్‌లో చెప్పినట్టు సెకన్లలో 'గాయబ్'!
చెట్టంత మనిషిని అలా ఎలా మాయం చేయగలిగారో తెలియదు – అదీ పక్కనున్న మాకు కూడా అనుమానం రాకుండా! నోరు నొక్కేసి తీసుకుపోయారా? మత్తుమందు చల్లి ఎత్తుకుపోయారా? ఇంత పబ్లిక్ ప్లేస్‌లో అది సాధ్యమా? మాకు కేకలు, మూలుగులు వినబడవా?
ఇదేదో మామూలు నేరస్తుల, కిడ్నాపర్ల పని కాదు. ఆరితేరిన గూఢచారుల పనే అయి వుంటుంది. ఎవరు వారు?
సమావేశ సందర్భంగా మనదేశం నుండి మంత్రివర్యులు వస్తారని తెలిసిన శత్రుదేశాల వాళ్లెవరైనా కిడ్నాప్ చేశారా?
విడుదల చేయడానికి ఎంత అడుగుతారో ఏమో! ఏ షరతులు పెడతారో ఏమిటో!
''పరదేశాల గూఢచారులకు అంత గట్స్ వుండకపోవచ్చండి. ఇరాక్ గూఢచారులే 'స్నాచ్' చేసేసి వుంటారు'' అన్నాడు నా సహచరుడు.
''అది యింకా ప్రమాదకరం. అయినా వాళ్లకు యిదేం సరదా?'' అడిగాను నేను.
''సద్దాం గారిని చూడాలని మంత్రిగారు ముచ్చటపడ్డారు కదండీ ..''
'దానికి యిదా పద్ధతి! బాగుంది సరసం..!' అనుకున్నాను.
బాపుగారి కార్టూన్ వుంది. బుడుగు కంగారుపడుతూ బడికి వెళుతున్నాడు. 'ఇప్పటికే ఆలస్యమై పోయింది, తొరగా బడికి తీసుకెళ్లు దేవుడా' అని మొక్కుకుంటున్నాడు. అంతలో వాడి కాలికి ఏదో తగిలి కిందపడ్డాడు. లేచి బట్టలు దులుపుకుంటూ పైకి చూసి దేవుణ్ని కోప్పడ్డాడు – 'తొరగా తీసుకెళ్లమన్నాను గానీ తొయ్యమన్నానా?' అని.
అలాగ యీయన ఇంటర్వ్యూ అడిగాడు తప్ప కిడ్నాప్ అడగలేదు కదా!
ఒకవేళ యింటర్వ్యూలో ఏదైనా అవకతవకగా మాట్లాడితే..? సద్దాంకు కోపం వస్తే… ?
అప్పుడున్న పరిస్థితుల బట్టి శాల్తీ గల్లంతైతే ఎవరినైనా అడుగుదామన్నా దిక్కూ, దివాణం లేకపోవచ్చు!
సాంకేతికంగా చూస్తే మంత్రిగారి బాధ్యత ఆయన సెక్యూరిటీదే కానీ పక్కన వున్నందుకు నాకూ వర్రీ పట్టుకుంది.
ఈయనకీ కోరిక పుట్టనేల? అంతకంటెముందు వ్యవసాయాభివృద్ధికోసం అంటూ అసలీ దేశాలకు రానేల?
xxxxxx
నేను పల్లెటూళ్లో ఎప్పుడూ వుండకపోయినా, నాగలి పట్టడం తెలియకపోయినా అగ్రికల్చర్ నా కెరియర్‌తో పెనవేసుకుని పోయింది. నేను వేసిన పథకాలు, ప్రణాళికలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. రాష్ట్రప్రభుత్వంలో వ్యవసాయశాఖలో పని చేసి కేంద్రానికి వెళితే అక్కడా అదే శాఖ యిచ్చారు. 1995 నుండి నాలుగేళ్ల పాటు వ్యవసాయ శాఖలో జాయింట్ సెక్రటరీగా వున్నాను. 1999లో ప్రమోషన్ వచ్చి దానికి అనుబంధంగా వున్న గ్రామీణాభివృద్ధి శాఖలో ఎడిషనల్ సెక్రటరీగా వేశారు. అక్కడ మూడేళ్లు వున్నాక మళ్లీ వ్యవసాయశాఖకు తీసుకుని వచ్చారు. వ్యవసాయ, సహకార విభాగాలలో సెక్రటరీగా చేస్తూండగానే మన రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పిలుపు వచ్చింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో అంతర్జాతీయరంగంలో కూడా ప్రభావితం చేయగల పథకాలు రూపొందించే అవకాశం నాకు దక్కింది.
ప్రపంచదేశాలు వ్యవసాయరంగంలో పరస్పరసహకారం అందించుకుంటూ వుంటాయి. దానికి సంబంధించిన విభాగాన్ని నేను కొంతకాలం చూశాను. అప్పట్లో నెదర్లాండ్స్, ఆమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, కెనడా, స్వీడన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలనుండి (వీటిని నార్త్ కంట్రీస్ అంటారు) కి మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న (సౌత్ కంట్రీస్ అంటారు) దేశాలకు సహాయం చేస్తూ వుండేవి. ఆ దేశాలకు, మన దేశాలకు పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం వుండేది. వాటి వలన సమస్యలు వస్తూ వుండేవి. వాళ్ల నిపుణుల జీతాలు భరించశక్యంగా వుండేవి కావు. అందువలన నార్త్-సౌత్ పక్కకు పెట్టి యీ సౌత్-సౌత్ దేశాల మధ్యనే అంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల మధ్య పరస్పరసహకారం వృద్ధి చేసుకుని, టెక్నాలజీని షేర్ చేసుకుంటే చవకగా, సులభంగా వుంటుంది కదాని ఎఫ్‌ఎఓకు అనిపించింది. చైనా, ఇండియా వంటి పెద్ద వ్యవసాయప్రధానమైన దేశాలున్నాయి. తరతరాలుగా మనం ప్రోది చేసుకున్న విజ్ఞానం వుంది. ఇక్కడ నుండి మనం కొందరు నిపుణులను ఆ దేశాలకు పంపితే..?
ప్రజల మధ్య అవగాహన పెరుగుతుంది. రాజకీయంగా కూడా ఉపయోగపుడుతుంది.
ఈ పంపడంలో కూడా అప్పటిదాకా వున్న పద్ధతిని మార్చేద్దామనుకున్నాను. అప్పటిదాకా రెండు దేశాల మధ్యన పరస్పర సహకారమంటే ముగ్గురో, నలుగురో ఉన్నతాధికారులు మరో దేశం రాజధానికి వెళ్లి, మూడు నాలుగు రోజులుండి, అక్కడ పెద్దవాళ్లని కలిసి వచ్చేసేవారు. ఇప్పుడీ కొత్త పద్ధతిలో వెళ్లేవాళ్లు ముగ్గురో నలుగురో కాదు, దాదాపు వందమంది! దేశం సైజు బట్టి ఆ గ్రూపు సైజు మారుతుందనుకోండి! ఇక వెళ్లేది రాజధానికి కాదు – గ్రామీణ ప్రాంతాలకు! ఉండేది రోజులు కాదు – రెండేళ్లు! అంటే ఏదో పాఠాలు చెప్పేసి వచ్చేయడం కాదు. అక్కడ వుండి, స్థానిక పరిస్థితులు అధ్యయనం చేసి, మన విజ్ఞానాన్ని వాళ్లకు అనువుగా మలచి, అమలు చేసి, ఫలితాలు ఏ మేరకు వచ్చాయో లెక్కలు కట్టి, సరైన పద్ధతిని స్థిరపరచి రావాలన్నమాట. ఈ ఆలోచన కేంద్రప్రభుత్వానికి, ఎఫ్‌ఏఓ – ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని ఐరాస సంస్థకు నచ్చింది.
కేంద్రప్రభుత్వంలో వుంటే యిదొక గొప్ప అడ్వాంటేజి. మనం రాష్ట్రస్థాయిలో ప్లాన్ చేస్తే అది రాష్ట్రానికే పరిమితమవుతుంది. అదే కేంద్రస్థాయిలో చేస్తే దేశమంతా అమలవుతుంది. అంతేకాదు, భారతదేశం తరఫున ప్రతినిథిగా అంతర్జాతీయ సంస్థల్లో మన ఆలోచనలు ముందు పెట్టి అవి ఆమోదించబడితే ప్రపంచవ్యాప్తంగా జరగబోయే ఒక పథకానికి బీజం మన తలలో రూపు దిద్దుకుందన్న గొప్ప తృప్తి వుంటుంది. ఇది వ్యవసాయం అనే కాదు, ఏ శాఖలోనైనా వర్తిస్తుంది. అయితే దానికి ముందు మనం ప్రపంచంలో వున్న యితర దేశాల స్థితిగతులు కూడా అధ్యయనం చేయవలసి వుంటుంది.
ఎఫ్‌ఏఓ వారి కార్యాలయం రోమ్‌లో వుంది. అక్కడకు వెళ్లి వాళ్లతో యిదంతా చెపితే 'బాగుంది, ఏదైనా చిన్న దేశంలో పైలెట్ ప్రాజెక్టు చేసి చూద్దాం' అన్నారు. ఎరిత్రియా అనే చిన్నదేశాన్ని ప్రయోగశాలగా ఎంచుకున్నాం. మరి అక్కడకి వెళ్లి పనిచేసే భారతీయనిపుణులు జీతాల మాటేమిటి అంటే రోజుకి మన దేశం పది డాలర్లిస్తే ఎఫ్‌ఏఓ యింకో పది యిస్తానంది. నెలకు ఆరువందల డాలర్లంటే ఆ రోజుల్లో దాదాపు 15 వేల రూపాయలు. అందువలన డబ్బు కోసమేనా అలాటి విదేశాల్లో పని చేయడానికి ముందుకు వస్తారని అనుకున్నాం. కొన్ని రోజులకు ఒక టీము ఎరిత్రియా వెళ్లి వారం రోజులుండి పరిస్థితి గమనించాం. ఐసిఎయార్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చి) నుండి ఒకతను, నేను, మైనర్ ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్ మరొకతను ఆ టీములో వున్నాం. ఎరిత్రియాలో నీటివనరులు చిన్న తరహావే. అవి ఎలా డెవలప్ చేయాలో చూసి, కొన్ని చోట్ల మత్స్యపరిశ్రమ, కొన్ని చోట్ల ఉద్యాన పరిశ్రమకు, మరికొన్ని చోట్ల పశు, పాడిపరిశ్రమకు అవకాశం వుందని గమనించి ఒక పెద్ద బృందాన్ని దీర్ఘకాలం వుండేట్లా పంపించాం. దానివలన ఆ దేశాలలో ఎంతో మార్పు వచ్చింది.
వ్యవసాయ, తత్సంబంధిత శాఖల్లో పనిచేస్తున్నపుడు యిలాటివి ఎన్నిటికో రూపకల్పన చేసే అవకాశం వచ్చింది. ఎఫ్‌ఎఓలో అనేకసార్లు సమావేశాలకు వెళ్లి వస్తూండేవాణ్ని – ఒక్కోసారి మంత్రితో కలిసి, మరోసారి సెక్రటరీతో.. ఎన్నోసార్లు ఒంటరిగా కూడా వెళ్లాను. 'రోమ్.. నీకు సెకండ్ హోమ్' అని చమత్కరించేవారు మిత్రులు. సహకారవ్యవస్థతో నాకు రాష్ట్రస్థాయిలో ప్రారంభమైన అనుబంధం ఢిల్లీదాకా కొనసాగింది. ఇఫ్‌కో, క్రిబ్‌కో, నాఫెడ్ వంటి జాతీయ స్థాయి సహకారసంస్థలకు సెంట్రల్ రిజిస్ట్రార్‌గా చేశాను. నిజానికి సహకార వ్యవస్థ తిరగేసిన త్రిభుజం లాటిది. కిందిస్థాయిలో రైతు, రైతులద్వారా ఏర్పడిన ప్రాథమిక సహకార సొసైటీలు, వాటిలోంచి అంచెలుగా ఏర్పడిన జిల్లా, రాష్ట్ర ఫెడరేషన్లు, రాష్ట్రఫెడరేషన్లతో కూడిన జాతీయస్థాయి ఫెడరేషన్. అంటే అత్యున్నత స్థాయి సంస్థలో కూడా అట్టడుగున వున్న రైతు భాగస్వామ్యం వుంటుందన్నమాట. నా పనీ అలాగే అయింది. రాష్ట్రస్థాయి కోఆపరేటివ్ రిజిస్ట్రార్ నుండి సెంట్రల్ రిజిస్ట్రార్‌ను అయ్యాను. ఆ విధంగా గ్రాస్‌రూట్స్ లెవెల్ రైతుతో బాంధవ్యాన్ని నిలుపుకున్నాను.
ఎందరో పై అధికారులు మారినా, మంత్రులు మారినా యీ బాంధవ్యం చెదిరిపోలేదు. నన్ను ఢిల్లీలో యీ శాఖకు తీసుకుని వచ్చిన సెక్రటరీ పంత్‌గారు నేను వచ్చిన కొద్ది రోజులకే మారిపోయారు. ఆ తర్వాత బాలకృష్ణన్.. ఆయనా వెళ్లిపోయి సబ్జక్ట్ బాగా తెలిసిన రాజన్..ఆ తర్వాత కమల్ పాండే అనే ఆయన చండశాసనుడు, కోపిష్టి, ఔట్‌స్టాండింగ్ ఆఫీసర్. ఎప్పుడేమంటాడో తెలియని వ్యక్తి. అయితే ఆయన టైములో నేను అనేక ఐడియాలు చెప్పి 'ఐడియా మ్యాన్'గా పేరుబడడం, వాటిని అమలు చేసి చూపించడం కూడా జరిగింది. వీరందరూ నన్ను అభిమానించినవారే. వ్యవసాయశాఖ అని పేరే కానీ గ్రామీణ ఆర్థికవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలూ – యానిమల్ హజ్బెండరీ, ఫిషరీస్, కోఆపరేషన్ వగైరా – దాని కిందే వుండేవి.
అధికారులే కాదు నేను అన్ని పార్టీలకు సంబంధించిన మంత్రులతో పని చేశాను. వెళ్లినపుడు కాంగ్రెసుకు చెందిన బలరాం జాఖడ్‌గారు మంత్రి, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు వచ్చాయి. టిడిపికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుగారు, ఆయన తర్వాత సిపిఐకు చెందిన చతురానన్ మిశ్రాగారు, డిఎంకె కు చెందిన రాజా, గ్రామీణాభివృద్ధి శాఖకు వెళితే బిజెపికి చెందిన అన్నాసాహెబ్ పాటిల్, వెంకయ్యనాయుడు గారు.. యిలా అనేక పార్టీలకు సంబంధించిన నాయకులతో ఎలాటి యిబ్బంది పడకుండా చేయగలిగినంత చేశాను.
వ్యవసాయానికి సంబంధించి ప్రపంచంలో ఏ ప్రదర్శన జరిగినా మాకు ఆహ్వానాలు వస్తూ వుండేవి. అవి చూసి వచ్చి మన దేశంలో ఎలా అమలు చేయాలా అని ఆలోచించేవాళ్లం. అలా ఇరాక్‌కు వెళ్లినపుడే పైన చెప్పిన సంఘటన జరిగింది.
xxxxxx
మంత్రిగారు కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చారు. హమ్మయ్య అనుకుని వెళ్లి పలకరించాను.
''చూస్తూండగానే ఎగ్జిబిషన్‌లో పక్కకు తప్పించేశారు. బయటకు తీసుకెళ్లి కారు ఎక్కించారు. కళ్లకు గంతలు కట్టేశారు. ఓ చోట దింపి, నడిపించారు, ఇంకో కారు ఎక్కించారు. మళ్లీ నడకా, కారూ మార్పు! దింపి నడిపించి తీసుకెళ్లి కళ్లకు గంతలు విప్పితే ఎదురుగా సద్దాం! ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడాడు. వెళ్లి వస్తానన్నాను. సరే అన్నాడు. వెళ్లినట్లే తిరిగి వచ్చాను. కళ్లకు గంతలు, నడిపించడాలూ, కార్లు మార్చడాలూ.. కాస్త టెన్షన్ ఫీలయ్యాననుకోండి..'' అన్నారు మంత్రిగారు.
మేం పడ్డ టెన్షన్‌తో పోలిస్తే మీదెంత స్వామీ, వెళ్లిన చోట నుండి తిరిగి వస్తానో లేదో అని మీ ఆందోళన. అసలు ఎక్కడికి వెళ్లారో తెలియని ఆందోళన మాది! అనుకున్నాను.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version