మోహన మకరందం

అనుభవాలూ – జ్ఞాపకాలూ డా. మోహన్‌ కందా  రచయిత గురించి … Advertisement ''మోహన్‌ మకరందం'' రచయిత డా. మోహన్‌ కందా గారి గురించి చెప్పాలంటే-  2010 అక్టోబరు వరకు నేషనల్‌ డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌…

అనుభవాలూ – జ్ఞాపకాలూ
డా. మోహన్‌ కందా 
రచయిత గురించి …

''మోహన్‌ మకరందం'' రచయిత డా. మోహన్‌ కందా గారి గురించి చెప్పాలంటే- 

2010 అక్టోబరు వరకు నేషనల్‌ డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలో మెంబర్‌గా (సెంట్రల్‌ మినిస్టర్‌  ఆఫ్‌ స్టేట్‌ హోదాలో)  బాధ్యతలు నిర్వర్తించిన శ్రీ మోహన్‌ 2003-05ల మధ్య మన రాష్ట్రానికి చీఫ్‌ సెక్రటరీగా,  కోనసీమ రైతుల ''క్రాప్‌ హాలీడే'' సమస్యపై ప్రభుత్వం వేసిన కమిటీకి చైర్మన్‌గా పరిచితులు. ఎన్‌.టి.రామారావు (స్పెషల్‌ సెక్రటరీ 1983-84), చంద్రబాబు నాయుడు (చీఫ్‌ సెక్రటరీ 2003-04), వైయస్‌ రాజశేఖరరెడ్డి (చీఫ్‌ సెక్రటరీ 2004-05) వంటి వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగిన ముఖ్యమంత్రులతో పనిచేసి శభాషనిపించుకోవడం శ్రీ మోహన్‌  సామర్థ్యానికి, వ్యవహారదక్షతకు నిదర్శనం. డా|| చెన్నారెడ్డితో తలపడిన శారదా ముఖర్జీ వంటి గవర్నరు వద్ద (సెక్రటరీ 1977-79), పాండిత్యం, సున్నితత్త్వం, తో బాటు రాజీలేని వ్యక్తిత్వం మూర్తీభవించిన హిదాయతుల్లా వంటి ఉపరాష్ట్రపతి వద్ద (సెక్రటరీ 1981-83), వెంకయ్య నాయుడు వంటి బిజెపి నేత వద్ద, చతురానన్‌ మిశ్రా వంటి కమ్యూనిస్టు మంత్రి వద్ద నెగ్గుకు రావాలంటే పరిస్థితులకు అనుగుణంగా మెలగలిగిన చాకచక్యం, ఒడుపు కావాలి. వారితో మసలగలిగే విషయపరిజ్ఞానం కావాలి. 

న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఎంతో పేరుప్రఖ్యాతులు గడించిన కందా భీమశంకరం, ప్రముఖ సామాజిక కార్యకర్త పాపాయమ్మగార్ల కుమారుడైన మోహన్‌ చెన్నయ్‌లో ఆంధ్ర బాలానంద సంఘం సభ్యుడిగా నాటకాలలో వేశారు. సినిమాలలో బాలనటుడిగా 28 తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో వేషాలు వేశారు. (''పెళ్లి చేసి చూడు'', ''మనోహర'' వంటివి) ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఎమ్మెస్సీ చేసి, దరిమిలా చాలా ఏళ్ల తర్వాత అదే యూనివర్శిటీ  నుండి వ్యవసాయ ఋణవ్యవస్థపై డాక్టరేట్‌ తీసుకున్నారు. స్టేటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసరుగా పనిచేస్తూ 1968లో ఐయేయస్‌ క్యాడర్‌కు సెలక్టయ్యారు.

కృష్ణాజిల్లాలో అసిస్టెంటు కలక్టరుగా, 1972 నాటి 'జై ఆంధ్ర' ఉద్యమ సమయంలో ఒంగోలులో సబ్‌ కలక్టర్‌గా, విశాఖపట్టణం, కర్నూలులలో కమర్షియల్‌ టాక్సెస్‌ డిప్యూటీ కమిషనర్‌గా, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలక్టరుగా, హైదరాబాదులో అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ అథారిటీగా పనిచేసిన శ్రీ మోహన్‌ కెరియర్‌లో చాలా భాగం వ్యవసాయం, గ్రామీణాభివృద్ధితో ముడిపడివుంది. అగ్రికల్చర్‌, కో-ఆపరేటివ్‌ సొసైటీలు, ఫిషరీస్‌ – ఇవన్నీ ఆయనను కోరుకుని వచ్చిన శాఖలు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ శాఖలో సెక్రటరీగా పనిచేస్తూండగానే కేంద్రంలో అదే శాఖలో పనిచేయడానికి పిలుపు వచ్చింది. 1995 నుండి 2002 వరకు కేంద్రప్రభుత్వంలో వుండి అగ్రికల్చర్‌, కో-ఆపరేషన్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖల్లో పని చేస్తూ 30 దేశాలు పర్యటించి, అక్కడి పరిస్థితులు అధ్యయనం  చేసి నైపుణ్యం గడించారు. ఆ అంశాలపై ఆంగ్లంలో పుస్తకాలు రచించారు. అవి – గ్రామీణాభివృద్ధిపై రాసిన ''టింక్చర్‌డ్‌ కాన్వాస్‌'', భారతదేశంలోని భూవనరులపై రాసిన ''వసుంధర'',  శాస్త్రజ్ఞుల పరిశోధనా ఫలితాలను రైతుకు చేర్చే ప్రయత్నాలు భారతదేశంలో, ఆసియా పసిఫిక్‌ ప్రాంతాలలో ఏ మేరకు జరుగుతున్నాయన్న అంశంపై ''ఫర్‌గివింగ్‌ ఎర్త్‌'' !  భారతదేశంలో సహకారరంగంలో ఋణాలపై వ్రాసిన ''నాట్‌ బై అదర్స్‌ హ్యాండ్స్‌ – ఏన్‌ ఎంథాలజీ ఆఫ్‌ ఎ సెంచరీ ఆఫ్‌ క్రెడిట్‌ కోపరేటివ్స్‌ ఇన్‌ ఇండియా'' పుస్తకం యిటీవలే వెలువరించారు. ఆయన నిర్వహించిన, నిర్వహిస్తున్న బాధ్యతలు :

– నాబార్డ్‌ సూపర్విజన్‌ బోర్డులో మెంబరు

– 12 వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై వ్యూహాలకై ప్లానింగ్‌ కమిషన్‌ వారి స్టీరింగ్‌ కమిటీలో మెంబరు

– ఢిల్లీ ఐఐటి వారి సెంటర్‌ ఫర్‌ ఎట్మాస్‌ఫియరిక్‌ స్టడీస్‌లో విజిటింగ్‌ ఫ్యాకల్టీ

– చెన్నయ్‌ ఐఐటి వారి ఇండో-జర్మన్‌ సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌కై ఎడ్జన్‌క్ట్‌ ఫ్యాకల్టీ

– బాలికల సమస్యలపై సమాజంలో అవగాహన పెంచే తెలుగు టీవీ ఛానెల్‌ను ఎంపిక చేయడానికి యునిసెఫ్‌ నియమించిన జ్యూరీ చైర్మన్‌ 

– రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ ఫస్ట్‌ కోర్టు సభ్యులు 

డా|| మోహన్‌ కందా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలతో బాటు ఉర్దూ, తమిళం, జర్మన్‌, ఫ్రెంచ్‌ భాషలు చదవగలరు, వ్రాయగలరు. పుస్తకపఠనం, సంగీతం ఆయన హాబీలు. క్రీడల్లో క్రికెట్‌, బ్రిడ్జ్‌, బిలియర్డ్స్‌, టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌ ఆయనకు అభిమానపాత్రమైనవి. ఆయనకు భార్య, యిద్దరు పిల్లలు. స్వభావరీత్యా స్నేహపాత్రులు. హాస్యసంభాషణా చతురులు. కీ.శే. ముళ్లపూడి వెంకట రమణ 'విన్నావా కందా మోహన్‌..' మకుటంతో యీయనపై కంద పద్యాలు రాశారు. 

వివిధ శాఖల్లో తను గడించిన అనుభవాన్ని, వ్యక్తిగత జీవితంలో మనమందరం అనుసరించవలసిన కొన్ని మెళకువలను నేటి యువతరం కోసం శ్రీ మోహన్‌ పాఠకులతో పంచుకుంటున్నారు. 

నా మాట

పాఠకులకు నమస్కారం. నా పేరు మీలో కొందరికే తెలిసి వుండవచ్చు. చిన్నపుడు ''పెళ్లి చేసి చూడు''లో 'అమ్మా నొప్పులే' పాటకు అభినయించిన బాలనటుడిగా ఒకతరం వారికి గుర్తుండవచ్చు. తర్వాత ఐయేయస్‌ క్యాడర్‌కి వెళ్లాక మాదంతా తెరచాటు వ్యవహారమే! ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చీఫ్‌ సెక్రటరీ (2003-2005)గా చేసినపుడు కొత్తతరం వారు గమనించి వుండవచ్చు. రాజకీయ నాయకుల్లా, తెరవేలుపుల్లా, క్రికెటర్లలా మేం నిత్యం పేపర్లలో, టీవీలలో కనబడం. మా ఆలోచనా ధోరణి, పరిపాలనా శైలి, ప్రభుత్వం నడిచే తీరు, దానిలో మేం ఎదుర్కునే సమస్యలు, మాకుండే వెసులుబాట్లు – యివన్నీ సామాన్య పౌరులకు ఎక్కువగా తెలియవు. మా గురించి చర్చలు జరగవు. జరిగాయంటే అనర్థానికే (ఫర్‌ 'రాంగ్‌ రీజన్స్‌'కే) అని అర్థం చేసుకోవాలి. 

పరిపాలన బాగా సాగినంతకాలం వెనుక ఎవరుండి నడిపించారన్నది సామాన్యుడికి అనవసరం. ఏదైనా చిక్కు వచ్చినపుడే ఆ సమస్యా, దాన్ని పరిష్కరించిన విధానం అతని దృష్టికి వస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే వరదలొచ్చి ఏదైనా ఓ కాలువలో ఓ పిల్లాడు పడిపోయాడనుకోండి. కాలువలోకి దూకి పిల్లాణ్ని రక్షించినవాడికి మెప్పు లభిస్తుంది. అదృష్టం బాగుంటే సాహసవీరుల ఎవార్డు కూడా యిస్తారు. వరద సమయంలో ఆ కాలువలోకి నీరు రాకుండా కట్టడి చేసే ఆనకట్టను ఎవరైనా ముందే ప్లాను చేసి కట్టేశారనుకోండి. ప్రమాదమూ జరగదు. దానిపై మన దృష్టీ పడదు. ఆనకట్ట ప్లాను చేసినతని గురించి మనకు తెలియనే తెలియదు. అతని ముందుచూపును అభినందించాలని మనకు తోచనే తోచదు. 

గద్దె వెనక్కాల వ్యవహరించే ఎడ్మినిస్ట్రేటర్స్‌ యిటువంటి గుర్తింపు-లేమికి మానసికంగా సిద్ధపడాలి. మిత్రుడు, నాకు సీనియర్‌ శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌ 'నాహం కర్తా..' ద్వారా టిటిడిలో ఆయన సాధించిన విజయాల గురించి చెప్పేదాకా చాలామందికి టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల కష్టాలు తెలియనే తెలియవు. తిరుమల వెళ్లే భక్తులు యీనాడు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు కల్పించడానికి అడుగడుగునా ఆయన ఎన్ని అవరోధాలు ఎదుర్కోవలసి వచ్చిందో ఆయన స్వయంగా చెప్పేదాకా వారికి తెలిసే అవకాశమే లేదు. అదే విధంగా దేశాన్ని మలుపు తిప్పిన పలు కీలకమైన సందర్భాలలో తెరవెనుక ఆయన నిర్వహించిన భూమిక గురించి 'అసలేం జరిగిందంటే..' ద్వారా పాఠకులకు వివరించేదాకా రాజకీయ నాయకులకు, అధికారులకు మధ్యన వుండే సమీకరణం గురించి పౌరులకు పెద్దగా అవగాహన వుండి వుండదు. 

నా యీ పుస్తకంలో పలు వుద్యోగాలలో నేను ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావన రాక తప్పదు కానీ నా 'ఫోకస్‌' యువతరానికి చెందిన టీమ్‌ లీడర్స్‌పై వుంది. ఒకప్పుడు ఎడ్మినిస్ట్రేషన్‌ అంటే ఐయేయస్‌ మాత్రమే గుర్తుకు వచ్చేది. ఈనాడు ఎంబిఏల ధర్మమాని ఎటు చూసినా ఎడ్మినిస్ట్రేటర్స్‌ కనబడుతున్నారు. వీళ్లనే టీమ్‌ లీడర్స్‌ అంటున్నారు. వీళ్ల విజయమే మన సంస్థల విజయం, మన దేశపు విజయం. వీళ్లు సరిగ్గా, నైపుణ్యంతో వ్యవహరించకపోతే వారు పని చేసే సంస్థ మాత్రమే కాదు, స్నోబాలింగ్‌ ఎఫెక్ట్‌తో అంతిమంగా మన ఆర్థిక, సామాజిక, పాలనా వ్యవస్థ యావత్తు ('బాడీ పాలిటిక్‌') కుప్పకూలుతుంది. 

లక్ష్యం ఎలా ఏర్పరచుకోవాలి, లక్ష్యసాధన కనువైన మనుష్యులను ఎలా ఎంచుకోవాలి,  వారితో ప్రజాహితం దృష్ట్యా ఎలా వ్యవహరించాలి, పరిస్థితుల కనుగుణంగా మననెలా మలచుకోవాలి, లక్ష్యం విఫలమైనపుడు మనను మనం ఎలా ఓదార్చుకోవాలి, యితరులకు ఎలా సర్దిచెప్పాలి, గెలిచినపుడు దాన్ని ఎలా హరాయించుకోవాలి, వ్యక్తిగతంగా మనను మనం ఏ విధంగా తూకంగా వుంచుకోవాలి, ఆరోగ్యం, వినోదం, కుటుంబ బాధ్యతలు, ఆధ్యాత్మికత వీటన్నిటి మధ్య ఎలా సమన్వయం చేసుకోవాలి ఇవన్నీ యీనాటి టీమ్‌ లీడర్స్‌ తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడం పలురకాలుగా వుంటుంది. వీరికి కళాశాలలలో నేర్పేది కొంతే వుంటుంది. ఏదైనా సంస్థలో చేరిన తర్వాత, రకరకాల అనుభవాల ద్వారా, సీనియర్ల ద్వారా, విజయం సాధించిన మహామహుల ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. 

వారిని లక్ష్యం చేసుకుంటూ వారికి ఉపయోగపడే రచన అందించాలనే తపనే ''స్వాతి'' వారపత్రికలో యీ పేరున శీర్షిక నడపడానికి పురికొల్పింది. ''స్వాతి''లో సీరియల్‌కు వచ్చిన స్పందన మరిన్ని వ్యాసాలు చేర్చి యీ పుస్తకం రాయడానికి ప్రేరేపించింది. నిజానికి యిది రాయాలనే ఆలోచనకు కాపీరైట్‌ మా అమ్మాయి అపర్ణదే. తను రెచ్చగొట్టి వుండకపోతే నేను దీన్ని రాసేవాణ్నే కాను. ఇదిలా ఆసక్తికరంగా, జనరంజకంగా రూపుదిద్దుకోవడంలో ముఖ్యభూమిక వహించినది మాత్రం- శ్రీ ఎమ్బీయస్‌ ప్రసాద్‌! ముళ్లపూడి రమణగారు మమ్మల్నిద్దర్నీ కలిపారు. సంఘటనల కూర్పు, కథనశైలి, అధ్యాయాలుగా వింగడింపు, పుస్తక రూపకల్పన, ఛాయాచిత్రాల ఎంపిక, అమరిక – యిలాటి విషయాలపై నాతో వాదించి, వేధించి, చివరకు ఔననిపించడంలో అమితమైన ఓర్పు, నేర్పు చూపారు ప్రసాద్‌.

 ఇదేదో మేనేజ్‌మెంట్‌ పాఠ్యపుస్తకంలా వుంటుందని కంగారు పడవద్దు. నేను విన్న, కన్న, చదివిన, అనుభవించిన అనేక విషయాల నుండి సారాంశాన్ని పువ్వులలోని  మకరందాన్ని తేనెటీగ సేకరించిన రీతిలో సేకరించి మీకు అందిస్తాను. చెప్పేదేదో మోహనంగా, పఠనమనోహరంగా, హృద్యంగా వుండాలని నాకు తెలిసిన ఉదంతాలను, జోక్స్‌ను రంగరించి సరదా శైలిలోనే చెప్తాను. చెప్పడానికి ఆధారమంటూ ఒకటి వుండాలి కాబట్టి నా ఆత్మకథలా చెప్తాను. కానీ తారీకుల వారీగా కాదు. చెప్పే అంశం బట్టి అది కాస్త ముందుకీ వెనక్కీ వెళుతూ వుంటుంది. 

చదవండి. నచ్చినా, నచ్చకపోయినా మీ సూచనలు [email protected]  కి ఈమెయిల్‌ చేయండి.

డా. మోహన్‌ కందా

excerpted from the forthcoming book Mohana Makarandamprint version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version

Click here for Audio