అభిషేక్ బచ్చన్ అమ్మగారు.. అమితాబ్ బచ్చన్ భార్యగారు.. ఒకనాటి హీరోయిన్ గారు… జయాబచ్చన్ ఆ సినిమాను ఒక చెత్త సినిమా అని తేల్చిపడేశారు. అంత బడ్జెట్ పెట్టి… అంత స్టార్ కాస్టింగ్ ను ఉపయోగించుకొని.. అలాంటి సినిమా ఎలా తీశారు? అని ఆమె వ్యాఖ్యానించారు. తన తనయుడు నటించాడన్న అభిమానం ఏదీ లేకుండా.. జయబచ్చన్ “హ్యాపీ న్యూయర్'' సినిమాను చెత్త మూవీగా తేల్చేశారు.
మరి ఆ తర్వాత జరిగినదేంటో అందరికీ తెలిసిందే. జయబచ్చన్ వ్యాఖ్యానాల పట్ల షారూఖ్ హర్ట్ కావడం.. ఆమె తీరును తప్పుపట్టడం… వెనుకటికి అమితాబ్ నటించిన కమర్షియల్ హిట్స్ ను కూడా చెత్త సినిమాలు అని సినీ విమర్శకులు తేల్చేసిన ఉదంతాలను ప్రస్తావించడం జరిగింది. మరి జయ మాటలకు షారూక్ చాలా హర్ట్ అయ్యాడని బచ్చన్ ఫ్యామిలీ అర్థం చేసుకొంది.
అభి, ఐష్ లు షారూఖ్ ఇంటికి వెళ్లి మరీ జయ వ్యాఖ్యానాల పట్ల విచారం పలికి వచ్చారట. ఆమె మాటలను లైట్ తీసుకోవాలని సూచించారట. ఆ తర్వాత కూడా జయ తన మాటల పట్ల స్పందించలేదు.
ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు “హ్యాపీ న్యూ ఇయర్'' మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం అని ప్రకటించాడు అభిషేక్. ఈ విషయంలో తామంతా దర్శకురాలు ఫరాఖాన్ పై ఒత్తిడి చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చాడు. తొలి వెర్షన్ కు పనిచేసిన వాళ్లమంతా.. సీక్వెల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చారు!
మరి ఇప్పుడు మళ్లీ జయబచ్చన్ మాటలను గుర్తు చేసుకొంటే.. తొలి వెర్షనే చెత్త. మరి దానికి సీక్వెల్ అంటే.. అది ఎంత చెత్తగా తయారు అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరమా? మరి ప్రేక్షకుల బుర్రల్లోకి అలాంటి చెత్త వేయడానికి ఈ సినిమా యూనిట్ అంత ఉబలాపడుతోందా? అనే సందేహాలు వస్తాయి!