సినిమా వాళ్లు అనేక వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం చాలా రొటీన్ వ్యవహారమే. తమ స్థాయికి తగ్గట్టుగా.. ఇమేజ్ కు తగినట్టుగా సెలబ్రిటీలు ఈ బ్రాండ్ అంబాసిడర్ అవకాశాలను పొందుతున్నారు. ఇమేజ్ ను క్యాష్ చేసుకొంటున్నారు. ఫలనా అని లేకుండా.. అన్ని రకాల ప్రోడక్ట్స్ కూ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ వాటిని ప్రమోట్ చేస్తున్నారని కూడా వేరే చెప్పనక్కర్లేదు.
మరి అలాంటి అంబాసిడర్లకు ఇప్పుడు కొత్త తలనొప్పులొస్తున్నాయి. బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న వీళ్లు.. ఆ బ్రాండ్ల విశ్వసనీయతకు కూడా రుజువులు చూపాల్సి వస్తోంది. కొన్ని నెలల క్రితం హీరోయిన్ జెనీలియాపై ఒక ఆసక్తికరమైన కేసు నమోదైంది. ఒక రియలెస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆమెపై ఆ రియాలిటీ సంస్థతో లావాదేవీలు జరిపిన వారు కేసు వేశారు. అంబాసిడర్ హోదాలో జెన్నీ చెప్పిన మాటకూ.. వాస్తవానికి సంబంధం లేదని.. పిటిషనర్లు పేర్కొన్నారు. చివరకు జెనీలియా ఆ చిక్కుముడి నుంచి ఎలాగో బయటపడింది.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ నటీమణి మాధురీ దీక్షిత్ కూడా అలాంటి చిక్కుల్లోనే పడింది. 'మ్యాగీ' కి అంబాసిడర్ టెలివిజన్ లోకనిపిస్తున్న మాధురి.. ఇరకాటంలో పడింది. టీవీ యాడ్ లో 'మ్యాగీ' ఒక న్యూట్రీషియన్ వ్యాలూవ్స్ ఉన్న ఫుడ్ అని మాధురి చెబుతుందని.. ఇప్పుడు ఆ విషయాన్ని ఆమెనిరూపించాలని.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ సంస్థ నోటీసులు జారీ చేసింది. ఆమె యాడ్ లో ప్రామినెంట్ గా ఈ విషయాన్ని చెబుతుంది.. తన పిల్లలకు మ్యాగీ చేసి పెడతానని అంటుంది కాబట్టి.. దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఆమెపైనే ఉందనేది వారి వాదన.
మరి ఎండార్స్ మెంట్లలో సెలబ్రిటీలు చెప్పే మాటల్లో సత్య సంధత ఎంత ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇలా వారిపై కేసులు.. చట్టపరమైన చర్యలు అంటే.. సగం మంది అంబాసిడర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది!