నెల రోజుల బట్టి తెర వెనుక ఒకటే లాబీయింగ్ నడుస్తోంది. ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ ను ఒప్పించాలని. ఏ నిర్మాత, ఎప్పుడు చేస్తారు అన్నవి అన్నీ పక్కన పెట్టి, ముందు అసలు సినిమా చేస్తా అని చెబితే చాలు అంటూ త్రివిక్రమ్ వద్దకు రాయబారాలు సాగుతున్నాయని ఇండస్ట్రీ టాక్.
కానీ త్రివిక్రమ్ డైరీ 2017 మొత్తం ఫుల్ గా వుంది. పవన్ సినిమా పూర్తి కావడానికి ఆర్నెల్లు పడుతుంది. అంటే 2017 సమ్మర్ వస్తుంది. ఆపై మళ్లీ స్క్రిప్ట్ రెడీ చేసి, మహేష్-మైత్రీ కాంబినేషన్ సినిమా చేయాల్సి వుంది. అది 2017 ఎండ్ లో వుంటుంది. మరి అంటే 2018 ప్రారంభంలో కూడా త్రివిక్రమ్ బిజీనే.
మరి ఎక్కడ ఖాళీ? పవన్ సినిమా అయిపోయిన తరువాత, మహేష్ సినిమా ప్రారంభానికి ముందు వున్న గ్యాప్ లో మాత్రమే. మరి అంత టైట్ పోజిషన్ లో త్రివిక్రమ్ లాంటి డైరక్టర్ సినిమా చేయడం కష్టం. అంటే ఇక ఓకె అంటే చేయగలిగింది 2018లో మాత్రమే.
మరి ఇది తెలిసి ఎందుకు ఎన్టీఆర్ వర్గం త్రివిక్రమ్ వెంట పడుతున్నట్లో? లేదా త్రివిక్రమ్ ప్లానింగ్ వేరే ఏమన్నా వుందా? ఇలాంటి గుసగుసల నేపథ్యంలో కొత్తగా వినిపిస్తున్నది ఏమిటంటే, మొత్తానికి త్రివిక్రమ్ డిసైడ్ చేసుకున్నారు. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి తల ఊపారు అని గ్యాసిప్ ఒకటి వినిపిస్తోంది.
ఈ మేరకు దీపావళి వెళ్లగానే ఎన్టీఆర్ యూనిట్ నుంచి ప్రకటన వస్తుంది అని అంటున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని వినికిడి. సో, ఏది ఏమైనా దీపావళి తరవాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట.