పవన్ కళ్యాణ్ పదే పదే ఓ విషయం చెబుతుంటారు. తన వద్ద డబ్బుల్లేవు..డబ్బుల్లేవు అని. కానీ అంతకు ముందు కాస్త వెనక్కివెళ్తే, జనసేన ఆవిర్భావంలో ఓ మాట అన్నారు..ఒక ఇల్లు చాలదా..ఒక కారు చాలదా..అంటూ సినిమాటిక్ గా. అయితే టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న గుసగుసలేంటంటే, పవన్ తన పెట్టుబడులు అన్నీ భూములు, ఇళ్లమీదే పెట్టారని.
ఆయన ప్రస్తుతం వుంటున్న ఇల్లు, ఫార్మ్ హవుస్ కాకుండా, కొన్నాళ్ల క్రితం నగరంలోని కీలక ప్రాంతంలో రెండు ప్రాపర్టీలు కొన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగానే వరుసగా రెండు హిట్ లు కొట్టిన ఓ బడా నిర్మాణ సంస్థ నుంచి పది కోట్లకు పైగా అడ్వాన్స్ ఓ సారి తీసుకుని మళ్లీ వెనక్కు ఇచ్చారని, ఆ తరువాత మళ్లీ తీసుకున్నారని తెలుస్తోంది.
సినిమాకు పది హేను కోట్లు తీసుకునే రేంజ్ లో వున్న పవన్ ఆస్తులు కొనుక్కోవడమో, కూడా బెట్టుకోవడమో అభ్యంతరకరమైన విషయం కాదు. కానీ తనకు డబ్బులు లేవని, అసలు ఇన్ని ఆస్తులు కూడా బెట్టుకోవడం అవసరమా అని పదే పదే అనడమే అభ్యంతరం.
జనసేన తొలి మీటింగ్ లో ఒక ఇల్లు చాలదా? ఒక కారు చాలదా అన్న పవన్ కు తమిళనాట తన అన్న చిరంజీవికి ఎన్ని ప్రాపర్టీలు వున్నాయో, వాటి అద్దెలు, మంచి చెడ్డలు చూడడానికే ఓ ఆఫీసును, బోలెడు మంది ఎంప్లాయీస్ ని నిర్వహిస్తున్న సంగతి తెలియదా అన్నదే అనుమానం. ఎవరి సంపాదన వారిది..ఎవరి ఆస్తులు వారివి. కానీ మన వైనాలు మరిచి, ఎదుటివారిని క్వశ్చను చేసేటపుడే కాస్త ఆలోచించాలి.