తెలుగువాళ్ల‌కూ గుర్తుండిపోయే న‌టుడు ఢిల్లీ గ‌ణేష్

త‌మిళ అనువాద సినిమాల‌తోనే అయినా.. తెలుగు వారికి గుర్తుండిపోయే న‌టుడు ఢిల్లీ గ‌ణేష్. కామెడీ పాత్ర‌లను అయినా, సీరియ‌స్ పాత్ర‌ల‌ను అయినా దేనిక‌దే ప్ర‌త్యేక‌మైన శైలిలో పండించ‌డంలో ఈ త‌మిళ‌న‌టుడు గుర్తుండిపోతాడు. కామెడీ పాత్ర‌లు…

త‌మిళ అనువాద సినిమాల‌తోనే అయినా.. తెలుగు వారికి గుర్తుండిపోయే న‌టుడు ఢిల్లీ గ‌ణేష్. కామెడీ పాత్ర‌లను అయినా, సీరియ‌స్ పాత్ర‌ల‌ను అయినా దేనిక‌దే ప్ర‌త్యేక‌మైన శైలిలో పండించ‌డంలో ఈ త‌మిళ‌న‌టుడు గుర్తుండిపోతాడు. కామెడీ పాత్ర‌లు అంటే.. ‘భామ‌నే స‌త్య‌భామ‌నే’ త‌మిళానికి ధీటుగా తెలుగులో ఆడిన సినిమా. క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌నే కాదు, ఈ సినిమాలో న‌టించిన ఎవ‌రికి వారు త‌మ త‌మ పాత్ర‌ల్లో వీర‌విహార‌మే చేశారు. జెమినీ గ‌ణేషన్, నాజ‌ర్, మ‌ణివ‌న్న‌న్, వీళ్ల‌కు తోడు సినిమా ఆసాంతం కొన‌సాగే పాత్ర‌లో ఢిల్లీ గ‌ణేష్ క‌నిపిస్తాడు! అమాయ‌క‌త్వం, క‌న్నింగ్ నెస్ క‌ల‌గ‌ల‌సిన పాత్ర‌లో ఢిల్లీ గ‌ణేష్ జీవించేశాడ‌ని చెప్పొచ్చు. అనువాదంలో ఈ పాత్ర‌కు ఏవీఎస్ తో డ‌బ్బింగ్ చెప్పించారు! ఏవీఎస్ డైలాగ్ డెలివ‌రీ ఆ పాత్ర‌ను మ‌రింత పండించింది.

సీరియ‌స్ పాత్ర‌లు అంటే.. ఆ మ‌ధ్య విశాల్ సినిమా ఒక‌టి వ‌చ్చింది.’అభిమన్యుడు’ అని. సైబ‌ర్ క్రైమ్స్ కు సంబంధించిన ఆ సినిమా ప‌క‌డ్బంధీ స్క్రీన్ ప్లేతో మంచి పేరు తెచ్చుకుంది. అందులో విశాల్ తండ్రి పాత్ర‌లో ఢిల్లీ గ‌ణేష్ క‌నిపిస్తాడు. కొన్ని సీన్లే అయినా.. ఆ పాత్ర‌ను పండించిన తీరుతో ఈ న‌టుడు గుర్తుండిపోతాడు!

క‌మ‌ల్ హాస‌న్ సినిమాల్లో ఢిల్లీ గ‌ణేష్ కు ప‌దునైనా పాత్ర‌లుంటాయి. మైఖేల్ మ‌ద‌న కామ‌రాజు సినిమాలో కమ‌ల్ నాలుగు పాత్ర‌లు చేస్తే, అందులో కామేశ్వ‌ర‌శాస్త్రి తండ్రి పాత్ర‌లో ఢిల్లీ గ‌ణేష్ క‌నిపిస్తారు. పాల‌కొల్లు పేరిశాస్త్రి పేరుతో ఆ పాత్ర‌ను అనువాదం చేశారు. స‌ట‌ల్ కామెడీని పండించ‌డంలో క‌మ‌ల్ కు ధీటుగా చెల‌రేగాడు ఈ న‌టుడు.

నాయ‌కుడు సినిమాలో క‌మ‌ల్ స‌హాయ‌కుడి పాత్ర‌లో క‌నిపిస్తాడు. క‌మ‌ల్ దే మ‌రో సినిమా తెనాలిలో క‌థ‌ను మ‌లుపుతిప్పే సూడో సైకాల‌జిస్ట్ పాత్ర‌లో ఈయ‌న క‌నిపిస్తారు. ఇందులో కూడా ఏవీఎస్ డ‌బ్బింగ్ ఆ పాత్ర మ‌రింత న‌వ్వించేలా చేస్తుంది. సుదీర్ఘ‌కాలం కెరీర్ కొన‌సాగించ‌డం కూడా గ‌ణేష్ న‌ట‌నాప‌టిమ‌కు మ‌రో నిద‌ర్శ‌నం. ఎప్పుడో 1970ల‌లో కెరీర్ మొద‌లుపెట్టి, 2024లో కూడా మూడు విడుద‌ల‌ల‌ను క‌లిగి ఉండ‌టం అంటే మాట‌లు కాదు.

గ‌త న‌ల‌భై ఐదేళ్ల‌లో త‌మిళంలో ఏడాదికి క‌నీసం రెండు మూడు సినిమాల‌తో మొద‌లుపెడితే, ప‌ది- ఇర‌వై సినిమాల్లో కూడా క‌నిపించారు ఢిల్లీ గ‌ణేష్. తెలుగులో డైరెక్ట్ సినిమాల్లో ఒక‌టీ రెండు చేశారంతే. మ‌ల‌యాళంలో మాత్రం కొన్ని సినిమాలు చేసిన‌ట్టుగా ఉన్నారు. త‌మిళ‌న‌టుల్లో గ‌ణేష్ లు, గ‌ణేష‌న్ లు ఎక్కువ‌మంది ఉండ‌టంతో, వారు చేసిన పాత్ర‌లు, సినిమాల పేర్లు అస‌లు పేర్ల ముందు చేరుతూ ఉంటాయి. జెమిని స్టూడియోతో ప‌ని చేయ‌డంతో జెమిని గ‌ణేష‌న్, స్టేజ్ ప్లేస్ లో శివాజీ పాత్ర‌తో శివాజీ గ‌ణేష‌న్ ఇలా.. సినిమాల్లో బిజీకాక‌ముందు దేశ రాజ‌ధాని ఢిల్లీలో కొంత‌కాలం ప‌నిచేయ‌డం వ‌ల్ల ఈయ‌న పేరు వెనుక ఢిల్లీ చేరింది.

4 Replies to “తెలుగువాళ్ల‌కూ గుర్తుండిపోయే న‌టుడు ఢిల్లీ గ‌ణేష్”

  1. నాయకుడు సినిమా లో కమల్ సహాయకుడి గా ఉండేది, కుయులి పాట లో కూడా ఉండేది జనగరాజ్ కదా! ఢిల్లీ గణేష్ కూడా ఉన్నాడట, అతని పాత్ర గుర్తు లేదు!

Comments are closed.