కరోనా ఫస్ట్ వేవ్ లో థియేటర్లు మూతబడ్డంతో.. తెలుగు సినిమాలు చాలా ఓటీటీ బాటపట్టాయి. అయితే విచిత్రంగా సెకండ్ వేవ్ లో మాత్రం ఓటీటీలు కంటెంట్ కోసం వెతుక్కోవాల్సి వస్తోంది.
ప్రస్తుతానికి థియేటర్లు క్లోజ్. కనుచూపు మేరలో తెరుస్తారనే ఆశ కూడా లేదు, తెరిచినా నిబంధనల పేరుతో 50శాతం ఆక్యుపెన్సీ తోనే నడిచే అకాశాలున్నాయి. అయినా కూడా నిర్మాతలెవరూ ఓటీటీలకు సినిమాలివ్వడం లేదు.
నిర్మాతలకు ఇష్టంలేదా..?
సినిమాపై పెట్టుబడి పెట్టి, దానికి వడ్డీలు కట్టుకుంటూ కూర్చోవాలని ఏ నిర్మాతా అనుకోడు. వీలైనంత త్వరగా వ్యవహారం తెగ్గొట్టాలనే అనుకుంటాడు. ఓటీటీ నిర్వాహకులు బేరాలాడినా.. ఎంతో కొంత టేబుల్ ప్రాఫిట్ కి సినిమా ఇచ్చేయొచ్చు.
హిట్టా, ఫట్టా అనే బాధ ఉండదు, కలెక్షన్ల జంజాటం అసలే ఉండదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ప్రమోషన్ యాక్టివిటీ, పోస్ట్ రిలీజ్ సక్సెస్ మీట్.. ఇలా అన్ని ఖర్చులూ కలిసొచ్చినట్టే. అందుకే నిర్మాతలు ఓటీటీలవైపే మొగ్గుచూపుతారు. కానీ తెలుగు హీరోలే ఇక్కడ అడ్డుపడుతున్నారు.
హీరోలకేంటి నష్టం..?
ఓటీటీలో సినిమా పడితే హీరో ఇమేజ్ తగ్గిపోతుందని, ఓటీటీ స్టార్ అనే ముద్రపడిపోతుందనే అపోహ ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఉంది. కొన్నిసార్లు ఈ అపోహల్ని దాటి నాని లాంటి హీరోలు 'వి'లాంటి సినిమాలతో చేసిన ప్రయోగాలు కూడా ఫలించలేదు. దీంతో సహజంగానే వారికి ఓటీటీలంటే భయమేర్పడింది. కొత్త సినిమా టక్ జగదీష్ విషయంలో కూడా ఓటీటీ వద్దే వద్దని నాని, నిర్మాతలకు తేల్చి చెప్పడమే దీనికి నిదర్శనం.
పాగల్ లాంటి సినిమాల విషయంలో కూడా హీరో విష్వక్ సేన్ ఒప్పుకోక పోవడం వల్లే నిర్మాతలు ఓటీటీవైపు వెళ్లలేకపోతున్నారు. అంతెందుకు విడుదలకు సిద్ధంగా ఉన్న 'లవ్ స్టోరీ' మూవీపై కూడా ఇంకా ఏటూ తేల్చలేకపోతున్నారంటే.. నాగచైతన్య లాంటి హీరోలు ఓటీటీలు మాకొద్దని చెప్పడమే కారణం.
ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ గ్యాప్ లో వచ్చిన క్రాక్, ఉప్పెన వంటి సినిమాలకు మంచి ఆదరణ దక్కడంతో థియేటర్లలోనే తమ సినిమాలు అని చెప్పేందుకు హీరోలు ఇష్టపడుతున్నారు. ఇటీవలే తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన రవితేజ, కచ్చితంగా థియేటర్లలోనే కలుద్దాం అని చెప్పడానికి ఇదే కారణం.
ఓటీటీ వ్యవహారాల్లో నిర్మాతలు హీరోలపై ఒత్తిడి తెస్తున్నా ఫలితం లేదు. తమ సినిమాలను పెద్ద స్క్రీన్లపైనే చూసుకోవాలనేదే హీరోల ఆశ. వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయని, ఓటీటీలకు ఇచ్చి చేతులు దులుపుకుందామని నిర్మాతలు అనుకుంటుంటే.. హీరోలు మాత్రం మంకు పట్టు పడుతున్నారు.
అయితే బాలీవుడ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాధే వంటి పెద్ద సినిమాలు సైతం ఓటీటీ, పే-పర్ వ్యూ పద్ధతిలో విడుదలైపోయాయి. ఆ సినిమాకి సల్మాన్ ఖానే నిర్మాత కావడంతో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. హీరోగా ఉన్న ఇమేజ్ చాలు, నిర్మాతగా జేబుకి చిల్లు పడకూడదు అనుకున్నాడు కాబట్టే.. ఓటీటీ బాట పట్టాడు సల్మాన్. మరి తెలుగు హీరోలు, నిర్మాతల పరిస్థితి ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూడాలి.