సినిమా రివ్యూ : ప్రేమ ఇష్క్‌ కాదల్‌

చిత్రం: ప్రేమ ఇష్క్‌ కాదల్‌ రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: లక్కీ మీడియా తారాగణం: హర్షవర్ధన్‌ రాణే, శ్రీవిష్ణు, హరీష్‌, వితిక, రీతూ వర్మ, శ్రీముఖి, రాజేష్‌, స్నిగ్ధ తదితరులు సంగీతం: శ్రవణ్‌ ఛాయాగ్రహణం: కార్తీక్‌…

చిత్రం: ప్రేమ ఇష్క్‌ కాదల్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
లక్కీ మీడియా
తారాగణం: హర్షవర్ధన్‌ రాణే, శ్రీవిష్ణు, హరీష్‌, వితిక, రీతూ వర్మ, శ్రీముఖి, రాజేష్‌, స్నిగ్ధ తదితరులు
సంగీతం: శ్రవణ్‌
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాత: బెక్కం వేణుగోపాల్‌
కథ, కథనం, దర్శకత్వం: పవన్‌ సాదినేని
విడుదల తేదీ: డిసెంబర్‌ 6, 2013

మూడు జంటల ప్రేమ కథలతో యువ దర్శకుడు పవన్‌ తెరకెక్కించిన ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ అర్బన్‌ యూత్‌ని టార్గెట్‌ చేసుకుంది. శేఖర్‌ కమ్ముల బ్రాండ్‌ ఫిల్మ్‌లా అనిపించిన ఈ చిత్రం కమ్ముల సినిమాల్లా యువతని అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా?

కథేంటి?

మూడు జంటల మధ్య జరిగే ప్రేమ కథ ఇది…

మొదటి జంట: సింగర్‌ ప్లస్‌ మ్యుజీషియన్‌ అయిన రాండీ (హర్షవర్ధన్‌) సోషల్‌ సర్వీస్‌ చేస్తుంటాడు. అతనితో తమ కాలేజ్‌లో షో చేయించాలని వెంట పడుతుంటుంది సరయు (వితిక). ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? తర్వాత ఏమవుతుంది?

రెండవ జంట: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజు (విష్ణు) తమ సినిమాకి కాస్టూమ్స్‌ డిజైనర్‌గా పని చేస్తున్న సమీరని (రీతూవర్మ) ప్రేమిస్తాడు. ఎడ్యుకేషన్‌, సోషల్‌ స్టేటస్‌ ఇలా అన్నిట్లోను అస్సలు సారూప్యం లేని ఈ జంట ప్రేమ కథ ఎటు దారి తీస్తుంది?

మూడవ జంట: కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమించేసే అర్జున్‌ (హరీష్‌) చెన్నయ్‌ అమ్మాయి అయిన శాంతిని (శ్రీముఖి) కూడా వలలో వేసుకోవాలని చూస్తాడు. మరి అతని ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి?

కళాకారుల పనితీరు!

నటీనటులందరూ పాత్రలకి అనుగుణంగా ఉన్నారు. హర్షవర్ధన్‌ ‘రాక్‌స్టార్‌’ క్యారెక్టర్‌లో బాగున్నాడు. నటనలో కూడా మునుపటి కంటే మెరుగు పడ్డాడు. అతనికి జంటగా నటించిన వితిక ‘జెనీలియా’ టైప్‌ క్యారెక్టరైజేషన్‌తో కాస్త విసిగించింది. లుక్స్‌, పర్‌ఫార్మెన్స్‌ పరంగా చాలా యావరేజ్‌ యాక్ట్రెస్‌.

రాయల్‌ రాజుగా నటించిన శ్రీవిష్ణు గోదావరి యాసతో, కేర్‌ఫ్రీ ఆటిట్యూడ్‌తో చాలా ఈజ్‌తో చేశాడు. ‘హీరో’గా ఎంతవరకు సక్సెస్‌ కాగలడో కానీ, బాగా నటించాడు. తన పాత్రకి పరిపూర్ణ న్యాయం చేశాడు. అతని జంటగా నటించిన రీతూ వర్మ షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా నెటిజన్స్‌కి బాగా తెలిసిన ముఖమే. ఈమె కూడా నటనలో బాగా రాణించింది. మూడు జంటల్లో వీరిదే బాగా స్కోర్‌ చేసింది.

ప్లేబాయ్‌ అర్జున్‌గా హరీష్‌ ఫర్వాలేదనిపించాడు. శ్రీముఖి స్టార్టింగ్‌ సీన్స్‌లో కంటే తర్వాత కాన్ఫిడెంట్‌గా చేసింది. ప్రధానంగా ఈ ఆరుగురి చుట్టూనే మొత్తం జరుగుతుంది. వీరి స్నేహితుల పాత్రలు పోషించిన వారు, ‘సత్యం’ రాజేష్‌ కాస్త కామెడీ పండిరచాలని చూశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

చిన్న సినిమా అయినా కానీ సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంది. సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌. సినిమా డల్‌ అవుతున్న ప్రతిసారీ ఒక మంచి సాంగ్‌ వచ్చి కదలకుండా కూర్చోపెడుతుంది. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. శ్రవణ్‌ శ్రవణానందకరమైన సంగీతంతో ముగ్గురు హీరోలున్న ఈ చిత్రానికి సిసలైన ‘హీరో’ అనిపించుకున్నాడు.

కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా పెద్ద ఎస్సెట్‌. చిన్న సినిమాని సూపర్బ్‌ క్వాలిటీతో, రిచ్‌ కలర్స్‌తో చాలా వైబ్రెంట్‌గా ప్రెజెంట్‌ చేసిన అతనికి హేట్సాఫ్‌. ప్రొడక్షన్‌ డిజైన్‌ మరో బోనస్‌. చిన్న చిత్రాలంటే చీప్‌గా చుట్టి పారేయడమని, సాంకేతిక పరంగా పెద్ద క్వాలిటీ తీసుకురాలేమని అనుకునే వాళ్లకి ఈ చిత్రం ఓ కనువిప్పు.

షార్ట్‌ ఫిలింస్‌తో కెరీర్‌ స్టార్ట్‌ చేసిన పవన్‌ ఈ చిత్రంతో దర్శకుడయ్యాడు. అతనికి అన్ని క్రాఫ్ట్స్‌నుంచి పని చేయించుకోవడం బాగా తెలుసు. తన ప్రోడక్ట్‌ని రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ప్రెజెంట్‌ చేయడమూ తెలుసు. అయితే తన మొదటి సినిమాకి ఇలాంటి వీక్‌ స్క్రిప్ట్‌ని కాకుండా పకడ్బందీ కథతో వచ్చి ఉండాల్సింది. మూడు షార్ట్‌ ఫిలింస్‌ కలిపి ఒక సినిమా చేసినట్టుంది. స్క్రిప్ట్‌పై కేర్‌ తీసుకుంటే పవన్‌నుంచి మంచి చిత్రాలు వచ్చే అవకాశముంది.

హైలైట్స్‌:

– సాంగ్స్‌

– సినిమాటోగ్రఫీ

డ్రాబ్యాక్స్‌:

– వీక్‌ స్క్రిప్ట్‌

విశ్లేషణ:

‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ అని పేరు పెట్టిన ఈ చిత్రంలో ‘ప్రేమ’ లేదు. రొమాన్స్‌/డ్రామా జోనర్‌లోకి వచ్చే ఈ చిత్రంలో టచింగ్‌ రొమాంటిక్‌ మొమెంట్‌ ఒక్కటి కూడా లేదు. మూడు జంటలు ప్రేమలో పడే వైనాన్ని, వారికి ఎదురయ్యే పరిస్థితుల్ని, వారి ప్రేమ తాలూకు గమనాన్ని, గమ్యాన్ని చూపించే ప్రయత్నంలో దర్శకుడు ఆకట్టుకునే సన్నివేశాలేమీ రాసుకోలేదు.

ఒకటి రెండు ఆకర్షించే పాత్రలు మినహా రైటింగ్‌ పరంగా ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ ఫెయిల్‌ అయింది. అన్ని ప్రేమకథలకి దాదాపుగా ఒకే ముగింపుని ఇవ్వడం, ఫిమేల్‌ క్యారెక్టర్స్‌దే తప్పు అన్నట్టు చూపించడం కరెక్ట్‌ కాదు. ఇప్పటి ప్రేమల్లో చాలా వరకు ఇలానే ఉంటూ ఉండవచ్చు కానీ ‘ఆడవాళ్లు ఆలోచిస్తారు… మగవాళ్లు అనుభవిస్తారు’ అనే కన్‌క్లూజన్‌ పూర్తిగా వన్‌ సైడ్‌ జస్టిఫికేషన్‌ అనిపిస్తుంది.

పాటలు వచ్చినప్పుడు కాకుండా మిగతా సమయంలో చాలా సందర్భాల్లో ఈ చిత్రం బోర్‌ కొట్టిస్తుంది. లాస్ట్‌ రీల్‌ వరకు అలా అనాసక్తంగా సాగిపోయిన చిత్రానికి చివరి రీల్లో మలుపులిచ్చి ఆసక్తికరంగా మార్చాలని చూశారు కానీ అది కొంతవరకే ఎఫెక్టివ్‌గా అనిపించింది. అన్ని క్యారెక్టర్స్‌ ఒకేసారి ‘యూటర్న్‌’ తీసుకోవడం కన్విన్సింగ్‌గా లేదు. ముఖ్యంగా ఫిమేల్‌ క్యారెక్టర్స్‌ అంతకు ముందు ప్రవర్తించిన దానికీ, ఒకేసారి పూర్తిగా విరుద్ధంగా మారిపోవడానికి తగిన క్లారిటీ లేదు. తనకి కావాల్సిన ముగింపు కోసం దర్శకుడు తన పాత్రల్ని అప్పటికప్పుడు ‘మార్చేసినట్టు’ అనిపిస్తుంది.

ఇక కామెడీ కోసమని పెట్టిన క్యారెక్టర్స్‌, సీన్స్‌ కూడా అంతగా నవ్వించలేకపోయాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా వీక్‌గా ఉన్న ఈ చిత్రం టెక్నికల్‌గా మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. సంగీతం, ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. కథాపరంగా జాగ్రత్తలు తీసుకుని, హృద్యమైన సన్నివేశాలు, కన్విన్స్‌ చేసే క్లయిమాక్స్‌ ఉండి ఉంటే ఈ చిత్రం నెక్స్‌ట్‌ లెవల్‌కి ఖచ్చితంగా వెళ్లేది.

బోటమ్‌ లైన్‌: ప్రేమ ఇష్క్‌ కా‘డల్‌’!

– జి.కె