సినిమా రివ్యూ: భీమవరం బుల్లోడు

రివ్యూ: భీమవరం బుల్లోడు రేటింగ్‌: 2/5 బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి. తారాగణం: సునీల్‌, ఎస్తర్‌, పోసాని కృష్ణమురళి, పృధ్వీరాజ్‌, సుప్రీత్‌, సయాజీ షిండే, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి తదితరులు కథ: కాళిదాస్‌ మాటలు: శ్రీధర్‌…

రివ్యూ: భీమవరం బుల్లోడు
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి.
తారాగణం: సునీల్‌, ఎస్తర్‌, పోసాని కృష్ణమురళి, పృధ్వీరాజ్‌, సుప్రీత్‌, సయాజీ షిండే, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి తదితరులు
కథ: కాళిదాస్‌
మాటలు: శ్రీధర్‌ సీపాన
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: సంతోష్‌ రాయ్‌
నిర్మాత: సురేష్‌
కథనం, దర్శకత్వం: ఉదయశంకర్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 27, 2014

హీరోగా సక్సెస్‌ అయిన తర్వాత కామెడీ వేషాలు మానేసిన సునీల్‌ మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ‘భీమవరం బుల్లోడు’గా వచ్చాడు. ఎప్పుడో తీసిన ‘కలిసుందాం రా’ తప్ప మరో అఛీవ్‌మెంట్‌ లేని ఉదయశంకర్‌ చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసాడు. ఈమధ్య కాలంలో సోలోగా సినిమాలు నిర్మించడం మానేసిన డి. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌పై హోల్‌ అండ్‌ సోల్‌గా తానే నిర్మించాడు. 

కథేంటి?

రాంబాబు (సునీల్‌) ఎవరైనా అమ్మాయిని చూసి నచ్చిందని చెప్తే ఆమెకి వేరే అబ్బాయితో పెళ్లి కుదిరిపోతుంది. మహా పిరికివాడైన రాంబాబు గొడవలకి దూరంగా ఉంటాడు. కానీ అనుకోకుండా ఓ గొడవలో రాంబాబు తలకి దెబ్బ తగలడంతో హాస్పిటల్‌లో జాయిన్‌ చేస్తారు. అతనికి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని, పది రోజులకి మించి బతకడని డాక్టర్‌ (ఆహుతి ప్రసాద్‌) చెప్తాడు. చనిపోదామని అనుకున్న రాంబాబు ఈ పది రోజుల్లో ఏదైనా మంచి పని చేద్దామని నిర్ణయించుకుని హైదరాబాద్‌లో రౌడీలందర్నీ కొట్టి పోలీస్‌ అయిన తన అన్న (పోసాని) ద్వారా జైల్లో పడేస్తాడు. చనిపోతాననే మొండి ధైర్యంతో అందర్నీ ఎదిరిస్తాడు. నందినిని (ఎస్తర్‌) ప్రేమించినా కానీ ఆమెని కాదంటాడు. కానీ తర్వాత రాంబాబుకి డాక్టర్‌ పొరబడ్డాడని, తనకి బ్రెయిన్‌ ట్యూమర్‌ లేదని తెలుస్తుంది. ఇప్పుడు నందినిని దక్కించుకోవడంతో పాటు తను గొడవపడ్డ రౌడీలందరి నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. అదెలా చేసాడన్నదే మిగతా కథ. 

కళాకారుల పనితీరు!

సునీల్‌ బాగానే చేసాడు కానీ తన క్యారెక్టర్‌ అంత ఫన్నీగా లేకపోవడం, తనకి రాసిన డైలాగ్స్‌లో పంచ్‌ లేకపోవడంతో పెద్దగా నవ్వించలేకపోయాడు. డైలాగ్‌ బేస్డ్‌ కమెడియన్‌ అయిన సునీల్‌తో హాస్యం పండించాలంటే అందుకు తగ్గ సంభాషణలు ఉండి తీరాలి. మిస్టర్‌ పెళ్లికొడుకులో తనని తాను చాలా సీరియస్‌గా తీసుకుని ఓవర్‌ బోర్డ్‌ వెళ్లిన సునీల్‌ ఇందులో కంట్రోల్‌లో ఉన్నాడు. డాన్సుల్లో ఫీట్లు తగ్గించాడు, సిక్స్‌ ప్యాక్‌ షోలు కట్టిపెట్టాడు. హీరోగా కొనసాగాలనుకుంటే మాత్రం నాన్‌స్టాప్‌ కామెడీ ఉన్న కథలనే ఎంచుకుంటే మంచిది. ఇలాంటి కమర్షియల్‌ కిచిడీల్ని క్యారీ చేసేంత స్టామినా తనకి లేదు కాబట్టి. 

ఎస్తర్‌కి హీరోయిన్‌ ఫీచర్స్‌ లేవు. నటన కూడా అంతంత మాత్రమే. ‘30 ఇయర్స్‌’ పృధ్వీరాజ్‌ కొన్ని పంచ్‌లతో అక్కడక్కడా నవ్వించాడు. పోసాని కృష్ణమురళి హాస్యం అస్సలు పండలేదు. రఘుబాబు ఎప్పటిలానే లౌడ్‌ కామెడీతో విసిగించాడు. శ్రీనివాసరెడ్డితో చేయించిన ‘ఈల ట్రాక్‌’ కూడా గతంలో చూసేసినదే. విలన్స్‌ అందరూ రొటీన్‌గా చేసారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ చాలా బ్యాడ్‌గా ఉంది. మిగతా సినిమాల్లో రిజెక్టెడ్‌ ట్యూన్స్‌ అన్నీ ఈ చిత్రానికి ఇచ్చేసాడా అనిపించింది. నేపథ్య సంగీతం కూడా బాలేదు. సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సునీల్‌పై ఇంత సీరియస్‌ ఫైట్స్‌ తీసిన ఫైట్‌ మాస్టర్స్‌కి అతనికి ఉన్న ఇమేజ్‌ గురించి కనీస అవగాహన ఉందో లేదో అనిపిస్తుంది. సినిమాలో నస చాలా ఎక్కువైంది. ఎడిటర్‌ కత్తెర పదును చూపించి ఉంటే కాస్త రిలీఫ్‌ దక్కేది. సంభాషణల్లో ప్రాస కోసం ప్రయాస బాగా కనిపించింది. అవసరం ఉన్నా లేకపోయినా రైటర్‌ రైమింగ్‌ డైలాగ్స్‌ కోసం పరితపించాడు. 

దర్శకుడు ఉదయశంకర్‌ ఇండస్ట్రీకి పరిచయమై చాలా కాలమైనా తీసింది మూడు సినిమాలే. వాటిలో కలిసుందాం రా మినహా ఇంకేదీ ఆకట్టుకోలేదు. ఇంతకుముందు కామెడీ సినిమా తీసిన అనుభవం లేని ఉదయశంకర్‌ ఈసారి ఆ ఎటెంప్ట్‌ చేసాడు. కానీ తనకి కామెడీపై గ్రిప్‌ లేకపోవడంతో దీనిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. పాత కథని మూస ఫార్ములాలో వేసి రెండున్నర గంటల పాటు నస పెట్టాడు. 

హైలైట్స్‌:

  • పృధ్వీరాజ్‌ సీన్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • స్క్రీన్‌ప్లే
  • డైరెక్షన్‌
  • మ్యూజిక్‌

విశ్లేషణ:

ఒక సీన్‌లో సయాజీ షిండేకి సునీల్‌ ‘భీమవరం బుల్లోడు’ సినిమా కథే చెప్తాడు. ఆ కథ విని ‘ఎయిటీస్‌ స్టోరీలా ఉంది’ అని సయాజీ అంటాడు. దానికి సునీల్‌ ‘ట్రీట్‌మెంట్‌ చాలా కొత్తగా ఉంటుంది’ అని నచ్చచెప్తాడు. అంటే ఈ కథ ఎయిటీస్‌ కాలం నాటి కథలా ఉందని ఈ చిత్ర బృందానికి కూడా అనిపించింది. కాకపోతే ట్రీట్‌మెంట్‌ కొత్తగా చేస్తున్నామనే భ్రమతో సినిమా తీసేసినట్టున్నారు. కానీ వారికి తెలియకుండా ట్రీట్‌మెంట్‌ కూడా ఆ కాలం నాటిదిలానే తయారైంది. 

సునీల్‌ హీరో అంటే సినిమాలో ఏమి ఉన్నా లేకపోయినా కామెడీ అయితే కంపల్సరీ కదా. కానీ హాయిగా నవ్వించే కామెడీ సీన్లు కొన్ని కూడా రాసుకోలేకపోయారు. తనదైన టైమింగ్‌తో డైలాగ్స్‌ పేల్చే పృధ్వీరాజ్‌ వల్ల కొన్ని సన్నివేశాలైనా పండాయి కానీ లేదంటే ‘భీమవరం బుల్లోడు’ ఫుల్‌ టైమ్‌ టార్చర్‌ అయ్యుండేది. ఎంత పాత కథ అయినా కానీ దీంతో కామెడీ పండించడానికి స్కోప్‌ అయితే ఉంది. కామెడీ సినిమాలే తీసే నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సత్తిబాబు లాంటి దర్శకుల చేతికిచ్చినా దీంతో ఎంతో కొంత నవ్వించి ఉండేవారు.     

డైరెక్టర్‌ ఉదయశంకర్‌కి కామెడీపై కమాండ్‌ లేకపోవడం, డైలాగ్‌ రైటర్‌ శ్రీధర్‌ సీపాన డైలాగ్స్‌లో ప్రాస తప్ప పంచ్‌ లేకపోవడంతో ‘భీమవరం బుల్లోడు’ భరించలేని నసలా తయారైంది. ఫస్ట్‌ హాఫ్‌లో లెక్కకు మించిన ఫైట్స్‌తో ఏదో మాస్‌ హీరో సినిమా తీస్తున్నట్టు హీరో ఎలివేషన్‌ షాట్స్‌తో చుట్టి పారేసారు. కనీసం ద్వితీయార్థంలో అయినా సునీల్‌ సినిమాలా కామెడీగా ఉంటుందని అనుకుంటే, ఎక్కడా పట్టుమని పది నిముషాలు నవ్వించిన పాపాన పోలేదు. ఇప్పుడు కాకపోతే, ఇప్పుడు నవ్విస్తారు అంటూ ఎదురు చూస్తూ చూస్తూనే పుణ్య కాలం గడిచిపోతుంది. ముతక సన్నివేశాలు, నాసిరకం సంభాషణలతో శుభం కార్డు కోసం ఎదురు చూడ్డం తప్ప భీమవరం బుల్లోడితో ఏ కొంచెం కాలక్షేపం జరగదు. హీరోయిజం ఉన్న కథల్ని ఎంచుకోవడం మానేసి కామెడీని నమ్ముకుంటే అటు సునీల్‌కి, ఇటు మనకీ మంచిది. లేదంటే అతని సినిమాలు పెట్టే హాస్య హింసని తట్టుకోవడం వల్ల కాని పని. 

బోటమ్‌ లైన్‌: ‘భీకరం’ బుల్లోడు!

-జి.కె.