రివ్యూ: లచ్చిందేవికి ఓ లెక్కుంది
రేటింగ్: 1.5/5
బ్యానర్: మయూఖ క్రియేషన్స్
తారాగణం: నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి, జయప్రకాష్‌రెడ్డి, అజయ్, బ్రహ్మాజీ, సంపూర్ణేష్‌బాబు, భద్రం తదితరులు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: ఈశ్వర్ .వై
నిర్మాత: సాయిప్రసాద్ కామినేని
రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల
విడుదల తేదీ: జనవరి 29, 2016
నిర్మాణ దశలో ఉండగా ఫండ్స్ అయిపోతే సినిమా ఆగిపోతుంది. అదే కథ రాసుకుంటూ ఉండగా మధ్యలో ఐడియాలు అయిపోతే అదెలా ఉంటుంది? ఇదిగో అచ్చంగా ఇలా లెక్క తప్పిన 'లచ్చిందేవి'లా తయారవుతుంది. ఒక మంచి ఐడియాని తీసుకుని దానిని ఒక వినోదాత్మక సినిమాగా మలిచే ప్రయత్నంలో లచ్చిందేవి పూర్తిగా గాడి తప్పింది.
బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ అకౌంట్స్‌లో కోట్ల కొద్దీ డబ్బు మూలుగుతోందట. వీటిలో చాలా వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరూ రారట. అలాంటి కొన్ని అకౌంట్లని కనిపెట్టి అందులోని డబ్బు కొట్టేయాలనుకుంటారు కొందరు. బ్యాంకులో పని చేసే హీరోని ట్రాప్ చేసి, అతనికి డబ్బు ఎర వేసి ప్లాన్ అమలు చేస్తారు. అంతా సజావుగా సాగిపోతోంది అనగా కథ అడ్డం తిరుగుతుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్టే. కానీ ఇలాంటి కాన్సెప్టులతో సినిమాలు తీసేటపుడు దర్శకుడికి ఫుల్ క్లారిటీ ఉండాలి. ఏది ఎందుకు జరుగుతుంది, ఎలా చూపిస్తే ఫలానా ట్విస్టు బాగా పేలుతుంది, అసలు తీద్దామనుకుంటోన్న జోనర్ ఏంటి? వగైరా విషయాలన్నిటిపై స్పష్టత లేపోతే ఇదిగో ఇలాగే ఒక క్రైమ్ కామెడీ ఎలా తీయకూడదనే దానికి కేస్ స్టడీగా మిగిలిపోతుంది.
చూసే వాళ్లు ఆసక్తి కోల్పోకుండా తమని తాము మోటివేట్ చేసుకుంటూ, అకస్మాత్తుగా నిద్రలోకి జారిపోకుండా ఎవరిని వారే అలర్ట్ చేసుకుంటూ ఉంటే తప్ప 'లచ్చిందేవి'ని చివరంటా భరించడం కష్టం. అంత తాపీగా, అనాసక్తంగా, నీరసంగా నడుస్తుందీ చిత్రం. కీలకమైన ట్విస్టులు వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఎక్సయిట్‌మెంట్ కలిగించని విధంగా చాలా ఫ్లాట్‌గా తీసుకుంటూ పోవడంతో ఏ క్షణంలోను ముందు ఏమి జరుగుతుందనే ఉత్కంఠ కలగదు. ఇలాంటి సినిమాలో అది మిస్ అయిందంటే ఇక ఏమి ఉన్నా లేనట్టే. ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్‌ని ఏదో ఆవహించినట్టు నటిస్తుంటుంది. కనీసం ఆ తంతు జరుగుతున్నప్పుడైనా ఆసక్తి కలిగించాలి. అంతటి కీలకమైన ఘట్టంలో కూడా ఈ చిత్రం డ్రామానే తలపిస్తుంది తప్ప ఎక్కడా సీరియస్‌నెస్ ఉండదు. ఆ ఎపిసోడ్‌ని కుదిరితే కామెడీకి అయినా వాడుకుని ఉండాల్సింది. ట్రై చేసారు కానీ పండలేదు.
ఇక క్లయిమాక్స్ అయితే సుదీర్ఘమైన నాన్సెన్స్‌కి కేరాఫ్‌గా మారిపోయింది. రెండు గంటల కంటే తక్కువ నిడివిలో, ఆసక్తికరమైన కథావస్తువుతో ఇలాంటి బోరింగ్ సినిమా తీయడానికి దర్శకుడు సాకులు వెతుక్కునే అవకాశం కూడా లేదు. ఈ చిత్రానికి రచయిత కూడా తనే కనుక స్క్రిప్టు దశలోనే జాగ్రత్త పడాల్సింది. క్లారిటీ లేకపోవడంతో ఇంట్రెస్టింగ్ అనిపించాల్సినవి కూడా ఎఫెక్టివ్‌గా తెర మీదకి రాకుండా పోయాయి.
నవీన్ చంద్ర, లావణ్య ఇద్దరూ తమ వంతు చేయగలిగింది చేశారు. ఇన్‌స్పయిర్ చేసే క్యారెక్టరైజేషన్లు కానీ, తమ టాలెంట్‌ని చూపించడానికి తగిన సందర్భాలు కానీ లేకపోవడంతో కొన్నిసార్లు వాళ్లు సైతం చేష్టలుడిగి చూస్తుండిపోయారు. విభిన్నమైన షేడ్స్ చూపించాల్సిన దశలో కూడా లావణ్య కేవలం యాక్షన్, కట్‌ల మీదే దృష్టి పెట్టి మరబొమ్మలా నటించిందనే భావన కలుగుతుంది. దానికి దర్శకుడినే తప్పుపట్టాలి తప్ప లావణ్యని అనుకోవడానికి లేదు. జయప్రకాష్‌రెడ్డి ఒక్కడే ఈ చిత్రాన్ని అంతో ఇంతో ఎంటర్‌టైనింగ్‌గా మలిచేందుకు శాయశక్తులా కృషి చేసాడు. కానీ ఒక దశలో ఆయన కూడా హ్యాండ్సప్ అనేసాడు. అజయ్ క్లూలెస్‌గా కనిపిస్తాడు. సంపూర్ణేష్ కామియో మిస్‌ఫైర్ అయింది.
కీరవాణి సంగీతంలో ఒక పాట వినసొంపుగానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. ఇతర సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోతగ్గ అవుట్‌పుట్ ఏమీ లేదు. బడ్జెట్ పరంగా చాలా లిమిట్స్ పాటించడం వల్లనేమో సినిమాటోగ్రఫీ కూడా డల్‌గా అనిపిస్తుంది. లచ్చిందేవికి ఓ లెక్కుంది అంటూ… 'లోల్' అని పెడితే నవ్వుల విందు ఖాయమనుకోవడం మన తప్పు కాదు. కానీ ఆ పగలబడి నవ్వేది మనం కాదని, దీన్ని చూడ్డానికి వచ్చిన మనల్ని చూసినపుడు వాళ్ల ఫీలింగునే అలా టైటిల్‌లో పెట్టి ఉంటారని అనుకోవాల్సి వస్తుంది.
కాన్సెప్ట్ సినిమాలు సరిగ్గా కుదిరితే ఎంతగా సర్‌ప్రైజ్ చేసి ఫన్ అందిస్తాయో, కుదరనప్పుడు అంతగా టార్చర్ పెట్టి వదుల్తాయి. దురదృష్టవశాత్తూ లచ్చిందేవి ఆ రెండో బాపతు సినిమాగా మిగిలిపోయింది.
బోటమ్ లైన్: లచ్చిందేవి లెక్క దారుణంగా తప్పింది!
– గణేష్ రావూరి