ఎమ్బీయస్‌: రాహుల్‌ గాంధి చురుకుదనం వెనుక…2/2

దీనిపై తీర్పు వస్తే అది చాలా ముఖ్యమైన, మార్గదర్శకమైన తీర్పు అవుతుంది. ఎందుకంటే అనేక రాజకీయపార్టీలకు సంబంధిత పత్రికలున్నాయి. వాళ్లూ యిదే తరహాలో తమ పత్రికలను పోషిస్తూ వుండవచ్చు. ఉదాహరణకి ''విశాలాంధ్ర'', ''ప్రజాశక్తి'', ''ఆర్గనైజర్‌''…

దీనిపై తీర్పు వస్తే అది చాలా ముఖ్యమైన, మార్గదర్శకమైన తీర్పు అవుతుంది. ఎందుకంటే అనేక రాజకీయపార్టీలకు సంబంధిత పత్రికలున్నాయి. వాళ్లూ యిదే తరహాలో తమ పత్రికలను పోషిస్తూ వుండవచ్చు. ఉదాహరణకి ''విశాలాంధ్ర'', ''ప్రజాశక్తి'', ''ఆర్గనైజర్‌'' వంటి పత్రికలు యాడ్స్‌పై, చందాలపై నడుస్తున్నాయని తోచదు. ఆ యా పార్టీలు నిధులు అందిస్తూ వుండాలి. అవి ఏ పేరు చెప్పి నిధులిస్తున్నాయి? అది చట్టప్రకారం సమ్మతమేనా? అనే విషయం తేలుతుంది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక మూతపడి, కాంగ్రెసు పార్టీ చేసిన ఆర్థికసాయం మురిగిపోయినా ఎవరూ పేచీ పెట్టి వుండకపోదురు. లేదా  తాము చేసిన సాయానికి గాను నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను కాంగ్రెసు పార్టీ తమ పేర రాయించేసుకున్నా సరేలే అని వూరుకుందురేమో. 

కానీ జరిగిన దగా ఏమిటంటే సోనియా, రాహుల్‌ నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను దొడ్డిదారిన కాజేయడానికి పూనుకున్నారు. 2010 నవంబరులో యంగ్‌ ఇండియన్‌ అనే లాభాపేక్ష లేని కంపెనీ  కంపెనీల చట్టం 25 వ సెక్షన్‌ కింద ప్రారంభించారు. మూలధనం రూ. 5 లక్షలు. కంపెనీలో సోనియా వాటా 38%, రాహుల్‌ది 38%, తక్కిన 24%లో కాంగ్రెసు కోశాధికారి మోతీలాల్‌ వోరా, సోనియా అంతేవాసి ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, (సుమన్‌ దూబే, శామ్‌ పిత్రోద్రా కూడా ఏదో దశలో చేరినట్లున్నారు). ఈ కంపెనీ దగ్గర్నుంచి కేవలం రూ.50 లక్షలు తీసుకుని కాంగ్రెసు పార్టీ 'నాకు నేషనల్‌ హెరాల్డ్‌ నుంచి రావల్సిన రూ.90 కోట్లు నువ్వే వసూలు చేసుకో' అని అధికారం యిచ్చేసింది. అప్పుడు ఆ కంపెనీ ఎజెఎల్‌ వద్దకు వచ్చి 'మీ బదులు కాంగ్రెసు పార్టీకి బాకీ తీర్చేశాం కాబట్టి, మీ కంపెనీలో  99% (ఈ శాతంపై స్పష్టత లేదు, మెజారిటీ షేర్లు అనే కొందరు రాస్తున్నారు) వాటా యివ్వండి' అని అడిగి తీసుకుంది. ఆ విధంగా వివిధ నగరాల్లో ఎజెఎల్‌ కున్న యావదాస్తులపై యంగ్‌ ఇండియన్‌కు హక్కు దఖలు పడింది. ఎజెఎల్‌కు వున్న ఆస్తుల విలువ బుక్‌ వేల్యూ ప్రకారం రూ. 1.71 కోట్లు – ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం కొన్నారు కాబట్టి! కానీ మార్కెట్‌ విలువ ఎన్నో రెట్లు ఎక్కువ. రూ.2 వేల కోట్లు అని సుబ్రహ్మణ్యం స్వామి అన్నారు కాబట్టి కనీసం అందులో నాల్గో వంతైనా వుంటుంది. 

ఇంత ఆస్తులున్న ఎజెఎల్‌ ఒకటి రెండు అమ్మేస్తే అతి సులభంగా అప్పు తీర్చేయవచ్చు. ఈ యంగ్‌ ఇండియన్‌కు మెజారిటీ వాటా ఎందుకివ్వాలి? అలా ఎలా ఒప్పుకుంది? అంటే దానికి 2002 నుండి సిఎండీ వేరెవరో కాదు మోతీలాల్‌ వోరాయే! ఎజెఎల్‌లో ప్రస్తుతం వున్న వాటాదారుల సంఖ్య 1037! వారిలో ఏ ఒక్కరు అడ్డుకున్నా యీ బదిలీ చిక్కుల్లో పడుతుంది. అదే జరిగింది. శాంతి భూషణ్‌ 'తనకు యీ షేర్ల బదిలీ గురించి తెలియపరచలేదం'టూ కోర్టు కెక్కారు. ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ సోనియా, రాహుల్‌ చేతిలో వుంది కాబట్టి పార్టీ నుంచి అభ్యంతరాలు రాలేదు. రేపు వేరేవారు వస్తే 'రూ.90 కోట్ల అప్పును కేవలం రూ.50 లక్షలకే ఎందుకు వదులుకున్నారు? దాని బదులు ఎజెఎల్‌ ఆస్తులు మన పార్టీ పేర రాయించేసుకుంటే బాగుండేది కదా' అని అడుగుతారు. అంటే అటు పార్టీకి, యిటు స్వాతంత్య్రసమరయోధులు స్థాపించిన సంస్థను దోచుకుని సోనియా, రాహుల్‌ బాగుపడుతున్నారన్నమాట!

అబ్బే, అలాటిదేమీ లేదు, ఇప్పటిదాకా ఎజెఎల్‌ ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు, పైగా ఎజెఎల్‌లాగానే మాదీ లాభాపేక్ష లేని కంపెనీ అని సోనియా, రాహుల్‌ వాదిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ కానీ, దాతలు కాని ఎవరూ ఫిర్యాదు చేయనప్పుడు కేసేమి వుంది? మోసం చేశారని ఎలా అంటారు? అని చిదంబరం ఆశ్చర్యపడుతున్నాడు. కానీ తక్కినవాళ్లు అలా అనుకోవడం లేదు. సుబ్రహ్మణ్య స్వామి 2013 జనవరిలో ఢిల్లీ కోర్టులో సోనియా, రాహుల్‌లపై చీటింగ్‌ కేసు పెట్టాడు. నేేషనల్‌ హెరాల్డ్‌ ఆఫీసు వుండే బహదూర్‌ షా జఫర్‌ మార్గ్‌ బిల్డింగులో యిప్పుడు పాస్‌పోర్టు ఆఫీసు పెట్టి అద్దె తీసుకుంటున్నారన్నాడు. ఎజెఎల్‌ పేరు చెప్పి ఆస్తులు సంపాదించుకోవాలనే ఆలోచన సోనియా, రాహుల్‌లకు ముందు నుంచే వున్నట్టుంది. 2006లో హరియాణా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పత్రికలకు ప్రోత్సాహం పేరు చెప్పి అప్పటికే కుంటుతూ వున్న నేషనల్‌ హెరాల్డ్‌కు రూ.59 లక్షలకు ప్లాటు ఎలాట్‌ చేసింది. హరియాణాలోను, కేంద్రంలోను వున్నది కాంగ్రెసు ప్రభుత్వమే కాబట్టి యిది సాధించారు. వోరా దాన్ని 2012లో స్వాధీనం చేసుకుని రూ.14.60 కోట్లకు తాకట్టు పెట్టాడు. అంటే అంత విలువైన స్థలాన్ని ఎంత చవకగా కొట్టేశారో గమనించాలి. ఇప్పుడు దాన్ని తమ యంగ్‌ ఇండియా కంపెనీ అజమాయిషీలోకి తెచ్చేసుకున్నారు. 

ఢిల్లీ కోర్టు 2013 జూన్‌లో తల్లీకొడుకులకు సమన్లు పంపించింది. వాళ్లు తమపై కేసు కొట్టేయమంటూ హైకోర్టుకి వెళ్లారు. 2015 డిసెంబరు 7 న హైకోర్టు వారి అభ్యర్థన తిరస్కరించి, పాటియాలా హౌస్‌లో వున్న ట్రయల్‌ కోర్టుకి హాజరు కమ్మనమని చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లు డిసెంబరు 19న హాజరై బెయిల్‌ యిమ్మనమని అడిగారు. ఇవ్వద్దు, వాళ్లకు చాలా పలుకుబడి వుంది, విదేశాలకు పారిపోతారు అంటూ సుబ్రహ్మణ్యం స్వామి అడ్డుపడ్డాడు. అయినా కోర్టు రూ.50 వేల పూచీకత్తుపై యిద్దరికీ బెయిలు యిచ్చింది. ఫిబ్రవరి 20 న కోర్టుకు మళ్లీ హాజరు కావాలంది. మేము స్వయంగా హాజరు కానక్కరలేకుండా మినహాయింపు యివ్వండి అని వాళ్లిద్దరూ చేసిన అభ్యర్థన కోర్టులు తిరస్కరించాయి కాబట్టి కేసులో ఎంతో కొంత విషయం వుందని ఒప్పుకున్నట్లే. ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ గోమతి మనోచా తన 2014 జూన్‌ 26 నాటి తీర్పులో 'ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునే ఉద్దేశంతోనే యంగ్‌ ఇండియన్‌ లి. అనే కంపెనీని పుట్టించార'ని అభిప్రాయపడ్డారు. బెయిలు మంజూరు చేసిన డిసెంబరు 7 నాటి తీర్పులో హైకోర్టు న్యాయమూర్తి కూడా 'ఎజెఎల్‌లో, యంగ్‌ ఇండియాలో, కాంగ్రెసు పార్టీలో వ్యక్తులు ఒకరే కాబట్టి ఎజెఎల్‌ ఆస్తులను చేజిక్కించుకోవడానికి చేసిన ప్రయత్నమిది అని స్పష్టంగా తెలుస్తోంది' అని వ్యాఖ్యానించారు. ఎజెఎల్‌ వంటి పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీని యంగ్‌ ఇండియా వంటి ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఎలా టేకోవర్‌ చేసుకోగలదని నిపుణులు అడుగుతున్నారు. 

ఇదంతా కావాలని చేస్తున్న యాగీ అని కాంగ్రెసు వాదిస్తోంది. 'ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ రెండు సార్లు -ఒకసారి యుపిఏ హయాంలో, మరోసారి ఎన్‌డిఏ హయాంలో – యీ లావాదేవీని పరిశీలించి, తప్పేమీ లేదని తేల్చింది. సుబ్రహ్మణ్యం స్వామి ఫిర్యాదు తర్వాత కేసు తిరగతోడింది. ఇది రాజకీయ కక్ష కాకపోతే మరేమిటి?'' అంటోంది. మాకేమీ సంబంధం లేదు అని బిజెపి వాదిస్తోంది కానీ సుబ్రహ్మణ్యం స్వామికి రాచమర్యాదలు చేస్తోంది. ఢిల్లీ కోర్టులో సోనియా, రాహుల్‌ హాజరు కావడానికి ముందు రోజు అతనికి ల్యూటెన్స్‌ జోన్‌లో మంత్రులకు యిచ్చే బంగళా కేటాయించింది, రూలు ప్రకారం అతనికి అంత బంగళా యివ్వకూడదు. ఎవరి ఉద్దేశం ఏదైనా యీ షేరు బదిలీ వ్యవహారంలో దురుద్దేశం స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వం జాగ్రత్తగా, మెలకువగా వ్యవహరిస్తే సోనియా, రాహుల్‌లు కృష్ణజన్మస్థల దర్శనం తప్పదు. ఈ ప్రమాదాన్ని వూహించే రాహుల్‌ యిప్పుడు కొన్ని వర్గాలను తమ పక్షాన మచ్చిక చేసుకుంటున్నాడని అనుకోవచ్చు. 'రాజకీయనాయకులు ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే వుంటారు. ప్రస్తుతం చేస్తున్నది అందులో భాగమే తప్ప నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకి సంబంధం లేదు' అని కూడా కొందరు వాదించవచ్చు. అలాటప్పుడు రాహుల్‌ పార్టీ అధ్యక్షపదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్నారన్న వార్తలు ఎందుకు వస్తున్నాయో సమాధానం చెప్పాల్సివస్తుంది. తల్లి అనారోగ్యం పాలైనప్పుడే ఆ పదవి చేపట్టి ఆమెకు భారం తగ్గించవలసిన తనయుడు తప్పుకుని తిరిగాడు. ఇప్పుడేం కొంప మునిగిందని అధ్యక్షపదవి తీసుకుంటాడు? తను జైలుకి వెళితే 'మమ్మల్ని రాజకీయంగా సమాధి చేయడానికి మా అధ్యక్షుణ్ని జైలుకి పంపారు' అని కాంగ్రెసు పార్టీ బిజెపిని దుమ్మెత్తిపోయడానికా? – (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016)

[email protected]

Click Here For Part – 1