నిన్నట్నుంచి 2వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్ 30వరకు ఈ ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈలోగా పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవాలని, లేదా డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, చెప్పిన గడువు లోగా రిజర్వ్ బ్యాంక్ ఆశించిన స్థాయిలో ఉపసంహరణ జరగకపోతే ఏం చేస్తారు?
పెద్ద నోట్ల రద్దు తర్వాత, ద్రవ్య లభ్యతను సమతూకం చేసేందుకు మార్కెట్లోకి దశలవారీగా 6లక్షల 73 వేల కోట్ల రూపాయల 2వేల నోట్లను ప్రవేశపెట్టింది రిజర్వ్ బ్యాంక్. అయితే 2018, మార్చి 31 నాటికే 2వేల నోట్ల చలామణి 3.62 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయాయి. అంటే దీనర్థం మిగతాదంతా బ్లాక్ లోకి మారిందని. స్వయంగా సెంట్రల్ బ్యాంక్ చెప్పిన వివరాల ప్రకారం, మార్కెట్లో 10.8శాతం 2వేల నోట్లు మాత్రమే లభ్యం అవుతున్నాయి.
ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, ఇలా మార్కెట్లో లభ్యమౌతున్న 10.8శాతం నోట్లు గడువులోగా బ్యాంకులకు వచ్చేస్తాయి. బ్లాక్ లోకి మళ్లిన దాదాపు 3.11 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లలో ఎన్ని తిరిగి బ్యాంకులకు వస్తాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆశించిన స్థాయిలో 2వేల నోట్లు వెనక్కి రాకపోతే ఆర్బీఐ ఏం చేస్తుంది? ఈ ప్రశ్నకు ఆర్బీఐ దగ్గర కూడా సమాధానం లేదు.
“సెప్టెంబర్ 30వరకు చూస్తాం.. అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం”. ప్రస్తుతానికి వాళ్లు చెబుతోంది ఇదొక్కటే. సో.. ఆర్బీఐ దగ్గర కూడా ప్రస్తుతానికి ఉపసంహరణకు సంబంధించి పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ లేదనే అర్థం చేసుకోవాలి.
అనుకున్నదే జరిగింది.. చిల్లర లేదంట
మరోవైపు అంతా ఊహించినట్టుగానే బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. ఉపంసహరణ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజుకే చాలా బ్యాంకులు, తమ వద్ద చిల్లర లేదని చెబుతున్నాయి. కాబట్టి 2వేల నోట్లను ఎకౌంట్లలో జమ చేసుకోవాలని సూచిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రూరల్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. దీనికితోడు చాలా పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్ లో 2వేల నోట్లు తీసుకునేందుకు నిరాకరించడంతో, సామాన్యుల ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి.
2వేల నోట్లతో భారీ విరాళం
వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు ఎలాగైతే భారీ విరాళాలు కనిపించాయో, ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలోని చాలా చోట్ల 2వేల నోట్లను హుండీల్లో వేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని ఓ ఆలయ హుండీలో 8లక్షల రూపాయల విరాళాన్ని అధికారులు గుర్తించారు. అవన్నీ 2వేల రూపాయల నోట్లే. ఈ భారీ విరాళాన్ని అందించిన భక్తుడు ఎవరనేది సీసీటీవీ ఫూటేజ్ చూసి తెలుసుకుంటామంటున్నారు పోలీసులు.