కూటమి ఎన్నికల హామీల్లో మెగా డీఎస్సీ కూడా ఒకటి. సీఎంగా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకాల్లో మెగా డీఎస్సీ ఫైల్ కూడా వుంది. మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని సంబంధిత ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేశారు. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో ఆనందం కనిపించింది. హామీలు నెరవేరుస్తున్నామని చెప్పుకోడానికి కూటమికి కూడా ఇది పనికొచ్చింది.
అయితే మెగా డీఎస్సీ నిర్వహణ రకరకాల కారణాలతో వాయిదాలపై వాయిదాలు పడుతూ వస్తున్నాయి. సర్లే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు కాకపోయినా, రేపైనా ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించకుండా వుంటుందా? అని నిరుద్యోగ ఉపాధ్యాయులు సర్ది చెప్పుకున్నారు. తాజాగా విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మెగా డీఎస్సీపై అనుమానం కలుగుతోందని నిరుద్యోగ ఉపాధ్యాయులు అంటున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయుల్ని నియమిస్తామని సంబంధిత మంత్రి, ప్రభుత్వంలో కీలక నాయకుడైన నారా లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే నిజమైతే విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టాలనే నిర్ణయానికి ప్రభుత్వం ఎందుకు వచ్చినట్టు అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. విద్యా వాలంటీర్లను నియమించడం అంటే, టీచర్ల భర్తీకి ఎగనామం పెట్టడమే అని నిరుద్యోగ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
మెగా డీఎస్సీలో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి 5 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. విద్యా వాలంటీర్ల నియామక ప్రకటనతో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మెగా డీఎస్సీని అటకెక్కించడానికి సాకులు వెతుక్కోకుండా, ఇప్పటికైనా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకటించాల్సిన అవసరం వుందని నిరుద్యోగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
గత 5 సంవత్సరాలు మెగా DSC, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ గురించి అడిగావా?