ఇంకెప్పుడు డీఎస్సీ… భారీ నిర‌స‌న ర్యాలీ!

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రి చూస్తే, ఇంకెప్పుడు డీఎస్సీ నిర్వ‌హిస్తారో అర్థం కావ‌డం లేద‌ని వారు మండిప‌డ్డారు

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబునాయుడు మొట్ట‌మొద‌ట డీఎస్సీ ఫైల్‌పై సంత‌కం చేశారు. 16 వేల‌కు పైగా ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని చంద్ర‌బాబు మెగా డీఎస్సీ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే తొమ్మిది నెల‌ల క్రితం సంత‌కానికి నోచుకున్న డీఎస్సీ ఫైల్ అమ‌లుకు నోచుకోక‌పోవ‌డంపై అభ్య‌ర్థులు తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో డీఎస్సీని వెంట‌నే నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వ‌ర్యంలో క‌ర్నూలు క‌లెక్ట‌రేట్‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్ ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డీఎస్సీ అభ్య‌ర్థులు మాట్లాడుతూ తొమ్మిది నెల‌ల క్రితం సీఎం చంద్ర‌బాబు సంత‌కం చేసిన మొద‌టి ఫైలే అమ‌లుకు నోచుకోలేద‌న్నారు. కేవ‌లం త‌మ‌ను మ‌భ్య పెట్టేందుకే డీఎస్సీ ఫైల్‌పై సంత‌కం చేశార‌ని విమ‌ర్శించారు.

పిల్ల‌లతో పాటు ఇత‌ర కుటుంబ స‌భ్యుల్ని విడిచిపెట్టి డీఎస్సీ పోటీకి నెల‌ల త‌ర‌బ‌డి శిక్ష‌ణ పొందుతున్నామ‌న్నారు. ఇందుకోసం వేలాది రూపాయ‌లు ఖ‌ర్చు అవుతోంద‌ని అభ్య‌ర్థులు వాపోయారు. తాము ఆందోళ‌న బాట ప‌ట్టిన‌ప్పుడే డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతార‌ని డీఎస్సీ అభ్య‌ర్థులు విమ‌ర్శించారు.

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రి చూస్తే, ఇంకెప్పుడు డీఎస్సీ నిర్వ‌హిస్తారో అర్థం కావ‌డం లేద‌ని వారు మండిప‌డ్డారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం డీఎస్సీ నిర్వ‌హించాలని వాళ్లంతా డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో భారీగా నిర‌స‌న కార్యక్ర‌మాలు నిర్వ‌హించాల్సి వ‌స్తుంద‌ని అభ్య‌ర్థులు హెచ్చ‌రించారు.

9 Replies to “ఇంకెప్పుడు డీఎస్సీ… భారీ నిర‌స‌న ర్యాలీ!”

  1. ఎందుకు నాయనా డీఎస్సీ … ఇప్పుడు ఉన్న పంతుళ్లు ఎక్కువ పిల్లలు తక్కువ .. వున్నోళ్లే పేకాట రియల్ ఎస్టేట్ చేసుకుని లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. మళ్ళీ మిమ్మల్ని లక్షల జీతాలు ఇచ్చి మేపడం ఎందుకు

Comments are closed.