సమస్యల పరిష్కారం కాదు.. రాజకీయం కోసమే!

ఎట్టకేలకు బీజేపీ, జనసేన నాయకులు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ, జనసేన మధ్య వస్తున్న గ్యాప్ పై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కదిలించాయో లేక, ఇప్పటికైనా నేతలు కలవకపోతే.. కార్యకర్తలు ఎట్టి…

ఎట్టకేలకు బీజేపీ, జనసేన నాయకులు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ, జనసేన మధ్య వస్తున్న గ్యాప్ పై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కదిలించాయో లేక, ఇప్పటికైనా నేతలు కలవకపోతే.. కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవలేరనే భయమో.. తెలియదు కానీ, మొత్తానికి జనసేన-బీజేపీ నాయకులు ఒకేచోట కలసి మంతనాలు జరిపారు. 

చాలా నెలల గ్యాప్ తర్వాత ఇటీవల కాలంలో జరిగిన తొలి కామన్ మీటింగ్ ఇదే కావడం విశేషం. అయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలసి పోరాటం చేస్తామని గొప్పలు చెప్పుకున్న నేతలు.. ఇప్పుడు కలసింది కేవలం రాజకీయం కోసమే.

తిరుపతి ఉప ఎన్నికల సీటుపై రెండు పార్టీల నేతల మధ్య మేధో మథనం జరిగింది. ఏపీ రాజకీయ వ్యవహారాలపై హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకోవడం ఈ రెండు పార్టీలకే చెల్లింది. రైతుల సమస్య పరిష్కారం కోసం ఇటీవల పవన్ చేసిన దీక్ష కూడా హైదరాబాద్ నుంచే కావడం గమనార్హం.

తాజాగా అమరావతి టికెట్ పై రెండు పార్టీల మధ్య పీటముడి పడింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల ఫలితాలతో జోరుమీదున్న బీజేపీ.. ఏపీలో కూడా అలాంటి విజయాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 

ఈ నేపథ్యంలో తిరుపతి బైపోల్ లో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నేతను బరిలో దించాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఏపీలో బీజేపీ కంటే జనసేనే మెరుగ్గా ఉందని, 2019 తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కంటే జనసేన మద్దతిచ్చిన అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయనేది పవన్ వాదన.

ఇటీవల తన రైతు ఓదార్పు యాత్రలో కూడా జనసేనకు ప్రజాభిమానం ఎక్కువగా ఉందనే విషయం తేలిందని కూడా ఆయన ఈ ఉమ్మడి సమావేశంలో చెప్పారట. ఏది ఏమైనా జనసేనకు అవకాశం ఇవ్వాలని, తాను దగ్గరుండి ప్రచార బాధ్యతల్ని భుజాన వేసుకుని అభ్యర్థిని గెలిపించుకుంటానని కూడా పవన్ ధీమా వ్యక్తం చేశారట. 

అయితే ఇది రాష్ట్ర నాయకత్వం తేల్చే విషయం కాదు కాబట్టి.. బీజేపీ జాతీయ నాయకుల నిర్ణయానికే ఈ సమస్యను వదిలేశారు. కట్ చేస్తే బయటకు వచ్చి.. రెండు పార్టీల నేతలు.. రాష్ట్ర సమస్యలపై చర్చించినట్టు కలరింగ్ ఇచ్చారు. 

ఇటీవల ఏపీలో రోడ్లు బాగా లేవంటూ బీజేపీ, రైతులకు తుపాను పరిహారం ఇవ్వాలంటూ జనసేన విడివిడిగా నిరనస ప్రదర్శనలు చేపట్టాయి. ఇప్పుడు ఉమ్మడిగా ఆ సమస్యలపై మీటింగ్ పెట్టుకుని.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. 

తాము కలసి ఉన్నామనే సంకేతాలు ప్రజలకు పంపేందుకు, తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థికోసం మీటింగ్ పెట్టుకున్న రెండు పార్టీలు.. ఛాన్స్ దొరికింది కదా అని ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరం.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ కలసి పోరాడలేని పార్టీలు.. తిరుపతిలో గెలుపు కోసం మాత్రం కలసి పనిచేస్తాయట. చూద్దాం.. తిరుపతి ఎన్నికల్లో బీజేపీ, జనసేన మిత్రలాభం ఏ స్థాయిలో ఉంటుందో..?

మళ్ళీ అదే ప్రశ్న