ఆంధ్రప్రదేశ్‌లో చాలా ముందుగానే పాలక, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు డబ్బు పంపిణీ చేపట్టాయి. నువ్వా, నేనా అనే స్థాయిలో పోటీ ఉన్న చోట ఓటర్ల పంట పండుతోంది. కాస్త గెలుపు అవకాశాలు ఉన్నాయన్న చోట ఓటుకు కనీసం రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. సహజంగా ఓటర్లకు అధికార పార్టీ అభ్యర్థులు డబ్బు బాగా పంచుతుంటారని అనుకుంటుంటారు.
కానీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఆళ్లగడ్డ సామాజిక సమీకరణల రీత్యా తనకు అనుకూలంగా వుందని సిటింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి అలియాస్ నాని ధీమాగా ఉన్నారు. తమ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందాయని, ఓటర్లు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారని ఆయన అంటున్నారు.
ఇదే సందర్భంలో తన ప్రత్యర్థి భూమా అఖిలప్రియతో మాట్లాడుకుని… ఇద్దరూ ఓటుకు రూ.1000 చొప్పున గురువారం నుంచి పంపిణీ చేయాలని సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రత్యర్థితో అవగాహనకు రావడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదెక్కడి న్యాయమని వైసీపీ కార్యకర్తలు, నాయకులు మండిపడుతున్నారు.
బ్రిజేంద్రనాథ్‌రెడ్డి తనకు పార్టీ ఇచ్చిన నిధులనే సరిపెట్టాలని ఎత్తుగడ వేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థితో కుమ్మక్కు అయిన బ్రిజేంద్ర వైఖరిపై ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ వచ్చే సరికి… ఇరు పార్టీల నేతలు కుమ్మక్కు కావడంపై ఇరు పార్టీల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టడం తప్పు అయినప్పటికీ, మన ప్రజాస్వామ్యం అలా వెలుగొందుతోందన్నది వాస్తవం. అందుకే ఇలాంటి అలజడులు, అసంతృప్తులు.