కొన్ని వార్తలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మరీ ఇంత అరాచకమైన వ్యవస్థ నడుస్తున్నదా అనే సందేహం కలుగుతుంది. అడిగేవారు ఎవ్వరూ లేరా? అని కూడా అనిపిస్తుంది. ఇలాంటి సంభ్రమాలు కలిగించడంలో కేంద్ర ఎన్నికల సంఘం తనవంతు పాత్రను పోషిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈవీఎంలో పోలైన ఓట్లకు, వీవీప్యాట్ పడిన స్లిప్పులకు మధ్య తేడా వస్తే ఏం చేయాలో… ఇప్పటిదాకా నిర్దిష్ట విధివిధానాలు లేవని తెలిస్తే… ఆశ్చర్యకపోకుండా ఇంకేం చేయగలం.
ఈవీఎంలు మన ఎన్నికల వ్యవస్థలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో అంతా తెగ గర్వించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మనం మెషిన్లను తయారుచేశాం అన్నారు. అయితే.. ఆ తర్వాతి కాలం నుంచి ఓడిపోయిన ప్రతి పార్టీ… ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని అనడం పరిపాటి అయిపోయింది. ఓడిపోయిన వాడికి ప్రజలు తనను తిరస్కరించారనే సత్యం ఒప్పుకోవడానికి అహంకారం అడ్డొస్తుంది. అందుకే ఈవీఎంల మీద నిందలు వేయడమూ, అక్రమాలు జరిగాయని అడ్డగోలుగా మాట్లాడడమూ ఇదంతా మన ప్రజాస్వామ్యంలో పరిపాటి అయిపోయింది.
ఈవీఎంల మీద అనుమానాలు పెరుగుతున్న సమయంలో… కొందరు టెకీలు వాటిని ట్యాంపరింగ్ చేసి చూపించడం కూడా జరిగిన సందర్భంలో.. ఈసీ మరో నిర్ణయం తీసుకుంది. వాటికి వీవీపాట్ లను జతచేసింది. అందులో స్లిప్పులు గుర్తు సహా వస్తాయి గనుక.. అనుమానం వచ్చిన సందర్భాల్లో వాటిని లెక్కిస్తే ఇక ఇబ్బంది ఉండదని అంతా భావించారు. ఈవీఎంలు సరిగ్గా నమోదు చేస్తున్నాయో లేదో తెలుసుకోడానికి మాదిరిక నియోజకవర్గానికి ఒక మెషీన్ కు వీవీపాట్ లను కూడా లెక్కించాలని ఈసీ నిర్ణయించగా.. దీనిపై కొందరు కోర్టు గడపతొక్కిన తర్వాత.. కనీసం అయిదు వీవీపాట్ లు లెక్కించాల్సిందే అని తీర్పు వచ్చింది.
అయితే వీవీపాట్ ల లెక్కకు, ఈవీఎం లెక్కకు తేడా వస్తే ఏం చేయాలి? దీని గురించి మనకు రకరకాల ఊహలు ఉండవచ్చు. కానీ అలా జరిగితే ఏం చేస్తామో… ఇప్పటిదాకా ఈసీ వద్ద స్పష్టతలేదు. ఒక నిర్ణయం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ వారు ఆ విషయాన్ని లేఖ రూపంలో ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ సంగతి బయటపడింది. ఎలాంటి చట్టం అయినా, నిర్ణయం చేసినా.. దానికి సంబంధించి.. ప్రతి ప్రాబబుల్ పరిణామానికి ఎలాంటి మార్గం అనుసరించాలో స్పష్టంగా నిబంధనలు రూపొందిస్తారు. కానీ.. కేంద్ర ఎన్నికల సంఘం అసలు లెక్క తేడా రావడం గురించి ఆలోచించనే లేదు.
కాంగ్రెస్ ఆరోపణ నిజమే అయితే గనుక… ఈసీ అహంకార పూరితంగా వ్యవహరించినట్లు లెక్క. ఈసీ అనే వ్యవస్థ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు లొంగి పనిచేయవలసిన అవసరం లేని స్వతంత్ర వ్యవస్థే కావొచ్చు. కానీ, దాని అర్థం నియంతృత్వం కాదని వారు తెలుసుకోవాలి. వీవీ పాట్ లు లెక్క తప్పితే ఏం చేయాలో కనీసం ఆలోచించలేదంటే… వాటి ఏర్పాటు అనేది ఎవరి కంటితుడుపుకోసం చేపట్టిన చర్యలో కూడా వారు జాతికి వివరించాలి.