బొత్స చేతిలో రెండు జిల్లాలు!

బొత్సకు రెండు జిల్లాలూ అప్పగిస్తే రానున్న రోజులలో పార్టీ ఒక గాడిన పడుతుందని కూడా భావిస్తున్నారు.

సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధినాయకత్వం దాదాపుగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీని వల్ల విశాఖ, విజయనగరం జిల్లాలలో పట్టు పెంచుకోవచ్చు అన్నది వైసీపీ యోచనగా చెబుతున్నారు.

బొత్స ఇటీవల జరిగిన విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచి సత్తా చాటారు. దాంతో ఉత్తరాంధ్రలో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో నిలువునా కృంగిపోయిన వైసీపీకి పొలిటికల్ గా బూస్టింగ్ వచ్చినట్లు అయింది అని అంటున్నారు.

బొత్సకు రెండు జిల్లాలూ అప్పగిస్తే రానున్న రోజులలో పార్టీ ఒక గాడిన పడుతుందని కూడా భావిస్తున్నారు. బొత్స కూడా దానికి పూర్తి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. వీలైనంత త్వరలో బొత్స విశాఖలో క్యాంప్ ఆఫీసుని ప్రారంభిస్తారు అని అంటున్నారు.

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ ఆలోచిస్తోంది. అలాగే అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బూడి ముత్యాలనాయుడుకి అవకాశం ఇస్తారని అంటున్నారు. దీంతో సామాజిక వర్గ సమీకరణలు సరితూగడమే కాకుండా విశాఖ జిల్లాలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం దక్కుతుందని లెక్క వేస్తున్నారు.

విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావునే కొనసాగిస్తారు అని అంటున్నారు. శ్రీకాకుళం వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరుని పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. బొత్సను ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా చేసి ఆయన నాయకత్వంలో మొత్తం పార్టీ నడచేలా చర్యలు తీసుకోవాలని కూడా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు స్థానికుడు, రాజకీయ వ్యూహాలలను రూపొందించడంతో దిట్ట అయినందునే బొత్సకు అగ్ర పీఠం ఇవ్వాలని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది అని అంటున్నారు.

24 Replies to “బొత్స చేతిలో రెండు జిల్లాలు!”

  1. ఇప్పుడు ఉత్తరాంధ్ర…. త్వరలో శాసన మండలి ప్రతిపక్ష నాయకత్వం…అటు తర్వాత y c p వర్కింగ్ ప్రెసిడెంట్

Comments are closed.