ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చుకుని తాము బలపడబోతున్నట్టుగా గొప్పగా ప్రకటించుకున్నారు బీజేపీ నేతలు! ఒక రాజకీయ పార్టీ బలోపేతం కావడం అంటే ప్రజల నుంచి మద్దతు వచ్చి కాదు, ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చుకుని.. అనుకుంటున్నట్టుగా ఉన్నారు బీజేపీ వాళ్లు. జాతీయ స్థాయిలో తాము అధికారం చేపట్టింది ఎలాగో మరిచిపోయినట్టుగా ఉన్నారు ఈ మేధావులు.
కాంగ్రెస్ నుంచి నేతలు వచ్చిచేరడం వల్ల నేషనల్ లెవల్లో బీజేపీ నెగ్గిందా? లేక ప్రజల నుంచి సపోర్ట్ వచ్చి నెగ్గిందా? ఈ ప్రాథమిక అంశాన్ని మరిచి ఫిరాయింపులతో బలోపేతం అనే భ్రమలో ఉంది కమలం పార్టీ. ఏపీలో వాళ్లకు ఇంతకు మించి గత్యంతరం లేదా అంటే.. చాలా అవకాశాలున్నా బీజేపీ కేవలం ఫిరాయింపులనే నమ్ముకుందట!
ఆ సంగతలా ఉంటే.. ఆఖరికి జనసేన పార్టీ నుంచి కూడా నేతలను తెచ్చుకుంటుందట కమలం పార్టీ. డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయిన పార్టీ జనసేన. దాన్నుంచి కూడా నేతలను తెచ్చుకుని బలోపేతం అవుతుందట బీజేపీ. ఈ విషయాన్ని బీజేపీ నేతలే ప్రకటించారు.
ఇంతకీ జనసేన నుంచి బీజేపీలోకి వెళ్లే నేతాశ్రీలు ఎవరు అంటే.. ముందుగా వినిపిస్తున్న పేరు లక్ష్మినారాయణ. విశాఖ నుంచి జనసేన తరఫున ఓడిన ఆయన ఇప్పుడు బీజేపీలోకి చూస్తున్నాడని టాక్. ముందుగానే బీజేపీలోకి చేరాలని అనుకున్నా.. ఆయన చంద్రబాబు సూచన మేరకు జనసేనలోకి చేరి ఇప్పుడు బాధపడుతున్నారట. అందుకే ఇప్పుడైనా బీజేపీలోకి చేరిపోవాలని ఆయన రెడీ అవుతున్నారని టాక్!