కర్ణాటక రాజకీయం రచ్చ రచ్చ అవుతూ ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాతో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ వ్యవహారంలో రెండు రకాల అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యేల రాజీనామాలతో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడినట్టే. అయితే వాటిని ఆమోదించే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టే అవకాశం ఉంది బీజేపీకి. ఇదంతా భారతీయ జనతా పార్టీ వ్యూహమే.. ఆ పార్టీ వ్యూహం ప్రకారమే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారనే ఆరోపణలు కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తున్నాయి.
కానీ అసంతృప్త ఎమ్మెల్యేలు తమ తమ వ్యక్తిగత అజెండాలను కూడా కలిగి ఉన్నారు. తనకు మంత్రిపదవి దక్కలేదని సీనియర్ నేత రామలింగారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. వెనుకటికి సిద్ధరామయ్య ప్రభుత్వంలో హోంమంత్రిగా వ్యవహరించారు రామలింగారెడ్డి.
అయితే ఇప్పుడు ఆయనకు ఎలాంటి మంత్రిపదవి లేదు. ఆయన కూతురు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెంగళూరు అభివృద్ధి మంత్రిత్వ శాఖను తనకు ఇవ్వాలని ఆయన అంటున్నారట.
ఈ తిరుగుబాటుకు రామలింగారెడ్డి నాయకత్వం వహిస్తూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు కుమారస్వామినే మార్చేయాలని ఆయన స్థానంలో మరెవరైనా ముఖ్యమంత్రిగా ఓకే అని కూడా కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు అంటున్నారని టాక్! కాంగ్రెస్-జేడీఎస్ రాజకీయం అలా సాగుతూ ఉండగా, బీజేపీ తన అవకాశాలను వెదుక్కొంటోంది.