ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘అలాయ్ బలాయ్’ నిర్వహించాలా?

ప్రతి అర్హత కలిగిన అభ్యర్థికి నామినేషన్ వేసే అవకాశం, ప్రతి ఓటరుకు తన ప్రతినిధిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి.

స్థానిక ఎన్నికలపై ఇతర రాష్ట్రాల నాయకులకూ ఆందోళన… నామినేషన్ల కోసం కోర్టుల మెట్లు ఎక్కాల్సిందేనా?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రాష్ట్ర సరిహద్దులు దాటి చర్చనీయాంశమవుతోంది.

హైదరాబాద్‌లో జరిగిన ‘అలాయ్ బలాయ్’ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఏపీలో నామినేషన్లు కూడా వేయనివ్వడం లేదని ప్రస్తావిస్తూ, వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘అలాయ్ బలాయ్’ నిర్వహించాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించారు.

రాజకీయ విభేదాలను పక్కనపెట్టి నాయకులను ఒకచోట చేర్చే కార్యక్రమంలో కూడా ఏపీ ఎన్నికల పరిస్థితి ప్రస్తావనకు రావడం ఆలోచించాల్సిన విషయం.

మరోవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ స్థానిక ఎన్నికల నిర్వహణపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, నామినేషన్ పత్రాలు చింపివేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తుపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి అయితే అభ్యర్థుల జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి, హైకోర్టుకు, అవసరమైతే సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని, న్యాయపోరాటం ద్వారా నామినేషన్లకు అవకాశం కల్పించేలా చూస్తామని ప్రకటించారు.

సాధారణంగా ఎన్నికల కార్యాలయంలో జరగాల్సిన నామినేషన్ ప్రక్రియ కోసం కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ప్రధాన ప్రశ్న.

అయితే అధికార కూటమి ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సహకరిస్తామని ప్రకటించారు.

ఎన్నికల సంఘం నిర్ణయాలను గౌరవిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఎన్నికల వివాదాలకు వైసీపీ కారణమని ఆరోపించారు.

ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్న సమయంలో నామినేషన్లకు సంబంధించిన ఫిర్యాదులు సుప్రీంకోర్టు వరకు వెళ్లడం గమనార్హం.

అభ్యర్థులకు స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదే.

గత ప్రభుత్వ హయాంలోనూ ఏకగ్రీవాలు, నామినేషన్లపై వివాదాలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినా అలాంటి ఆరోపణలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి… కానీ ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఎందుకు మారడం లేదు?

మరో ముఖ్యమైన విషయం ప్రజల స్పందన. రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. జాతీయ మీడియా చర్చిస్తోంది. న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు.

చర్చ జరిగినా మార్పు కోసం ఒత్తిడి పెరగడం లేదు. ఇది రాజకీయాలపై విసుగా? ఎవరు అధికారంలో ఉన్నా ఇంతేననే నిరాశా? లేక ఇలాంటి పరిణామాలను సాధారణంగా తీసుకోవడం అలవాటైపోయిందా?

స్థానిక ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరంగా రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది.

కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ఈ పరిణామాలను ఎలా చూస్తోందనే రాజకీయ ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రత్యక్ష అధికారం ఉండదన్న విషయాన్ని గుర్తించాలి.

ఏకగ్రీవ ఎన్నిక తప్పు కాదు. కానీ అది స్వచ్ఛందంగా జరగాలి. ప్రతి అర్హత కలిగిన అభ్యర్థికి నామినేషన్ వేసే అవకాశం, ప్రతి ఓటరుకు తన ప్రతినిధిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది కేవలం రాజకీయ నాయకుల మధ్య ‘అలాయ్ బలాయ్’ మాత్రమే కాదు… ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించే వాతావరణం కూడా!

ఎన్నికల్లో ఎవరు గెలిచారన్నదానికంటే, ఎంతమందికి స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం లభించిందన్నది ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష.

ఎన్నికల కార్యాలయంలో వేయాల్సిన నామినేషన్ కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తే… ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తోందని ప్రశ్నించక తప్పదు!

– వంశీ కృష్ణ ఇరువారం

5 Replies to “ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘అలాయ్ బలాయ్’ నిర్వహించాలా?”

  1. జనసేన పార్టీ రెబల్స్ ని కూడా సస్పెండ్ చేస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర..🤔

    ఎవడి పార్టీ వాళ్ళని ఎవడు సస్పెండ్ చేస్తాడురా..😜😂

  2. First చెల్లితో అలై బలై చేపించి సార్, పాపం ఆడకుతురు ఆడపిల్లకు పెళ్ళి చేయనికి ఇబ్బంది పడుతుంది

Comments are closed.