ఒకేసారి 2 సినిమాలు చేస్తే ఏంటి ప్రాబ్లమ్?

కెరీర్ లో శంకర్ ఎప్పుడూ ఒకేసారి 2 సినిమాలు చేయలేదు. కానీ ఈసారి చేయాల్సి వచ్చింది. గేమ్ ఛేంజర్ తో పాటు భారతీయుడు-2 సినిమాల్ని కొనసాగించాల్సి వచ్చింది. ఫస్ట్ టైమ్ ఇలా చేయడంతో దర్శకుడు…

కెరీర్ లో శంకర్ ఎప్పుడూ ఒకేసారి 2 సినిమాలు చేయలేదు. కానీ ఈసారి చేయాల్సి వచ్చింది. గేమ్ ఛేంజర్ తో పాటు భారతీయుడు-2 సినిమాల్ని కొనసాగించాల్సి వచ్చింది. ఫస్ట్ టైమ్ ఇలా చేయడంతో దర్శకుడు కొన్ని సందర్భాల్లో, కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండొచ్చని చాలామంది భావించారు. ఇదే ప్రశ్న శంకర్ కు ఎదురైంది. దీనిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు.  

“2 సినిమాలు చేయడం వల్ల ఏమీ తేడా ఉండదు. ఒకేసారి 2 సినిమాలు సెపరేట్ గా చేసినా, ఒకేసారి చేసినా నా కృషి ఒకేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ఈసారి ఎక్కువగా నా ఎఫర్ట్ పెట్టాను, ఎక్కువగా పని చేశాను. భారతీయుడు-2 మధ్యలో కరోనా వచ్చింది. ఆ టైమ్ లో భారతీయుడు-2 కు సంబంధించి అన్నీ ప్రిపేర్ చేశాను. సీన్ రైటింగ్, షాట్ డివిజన్, ప్రాపర్టీస్ లిస్ట్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్.. ఇలా అన్నీ ఫైనల్ చేశాను. అలా ఫుల్ గా రెడీ అవ్వబట్టి గేమ్ ఛేంజర్ చేసేటప్పుడు భారతీయుడు-2 కోసం ఆలోచించాల్సిన అవసరం రాలేదు.”

శంకర్ ఇలా తనదైన శైలిలో వివరణ ఇస్తుండగా, మధ్యలో కమల్ హాసన్ కల్పించుకున్నారు. ఒక దర్శకుడు ఒకేసారి 2 సినిమాలు చేస్తే తప్పేంటంటూ శంకర్ ను సమర్థించారు.  

“బాలచందర్ 4 సినిమాలు ఒకేసారి చేశారు. ఆ 4 సినిమాల్లో నేను ఉన్నాను. దాసరి నారాయణరావు గారు ఒకేసారి 5 స్టోరీలపై పనిచేసేవారు. హోటల్ లో ఈ డోర్ తెరిస్తే ఓ కథ, మరో డోర్ తెరిస్తే ఇంకో కథపై ఆయన పనిచేసేవారు. భోజనం ముందు ఒక స్టోరీ, భోజనం తర్వాత మరో స్టోరీ చేస్తూ వరుసగా హిట్స్ ఇచ్చారు.”

ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ పై స్పందించిన శంకర్, ఆ సినిమా విడుదల తేదీని చెప్పలేకపోయారు. ఎడిట్ లాక్ అయిన తర్వాత మాత్రమే విడుదల తేదీ చెప్పగలనని అన్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా 10-15 రోజులు పెండింగ్ ఉందన్నారు.